- ఎస్సీ, ఎస్టీ, ఓసీ, ఇతరులు కలిపి 45 శాతం
- సర్వే నివేదిక సిద్ధం చేసిన ప్రణాళిక సంఘం
- దీనిపై నేడు కేబినెట్ మీటింగ్లో చర్చించే చాన్స్
- రైతు భరోసా, రైతు కూలీలకు సాయం, ఇందిరమ్మ ఇండ్లు,రేషన్ కార్డులపైనా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం
హైదరాబాద్, వెలుగు:రాష్ట్రంలో బీసీల జనాభాపై స్పష్టత వచ్చింది. మొత్తం జనాభాలో 55 శాతం మేర బీసీలు ఉన్నట్టు తెలిసింది. ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కులగణన సర్వేలో ఈ విషయం వెల్లడైనట్టు సమాచారం. కులగణన సర్వేకు సంబంధించిన నివేదికను రాష్ట్ర ప్రణాళిక సంఘం సిద్ధం చేసింది. దీనిపై శనివారం సెక్రటేరియెట్లో సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన జరిగే కేబినెట్ మీటింగ్లో చర్చించే అవకాశం ఉంది. ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నందున.. కులగణన సర్వే వివరాలపై కేబినెట్మీటింగ్లో చర్చించే అవకాశం ఉందని తెలిసింది. ఇప్పటికే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల కోసం బీసీ డెడికేటెడ్ కమిషన్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ క్షేత్రస్థాయిలో వివరాలు, వినతులు తీసుకున్నది. సమగ్ర కులగణన సర్వేకు సంబంధించిన వివరాలు కూడా కమిషన్ కు అందాయి. కాగా, పోయినేడాది నవంబర్లో ప్రభుత్వం కులగణన సర్వే చేపట్టింది.
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు నెలన్నర పాటు 90వేల మందికి పైగా ఎన్యుమరేటర్లు ప్రతి ఇంటికి వెళ్లి వివరాలు నమోదు చేశారు. ఆ వివరాల డిజిటలైజేషన్ కూడా పూర్తయింది. కులగణన సర్వే రిపోర్టును ప్రణాళిక సంఘం దాదాపు సిద్ధం చేసింది. సర్వేలో భాగంగా మొత్తం కోటి 17లక్షల 47వేల ఇండ్లకు స్టిక్కరింగ్చేయగా, ఇందులో 98 శాతం మేర వివరాలు సేకరించారు. ఇందులో 55 శాతం మేర బీసీలు ఉన్నట్టు తెలిసింది. మిగతా 45 శాతం ఎస్సీ, ఎస్టీ, ఓసీ, ఇతరులు ఉన్నట్టు సమాచారం. ఇక కులగణన సర్వేకు సంబంధించి అన్ని వివరాలతో కూడిన పూర్తిస్థాయి రిపోర్టును త్వరలోనే ప్రభుత్వం విడుదల చేయనుంది.
నేడు కేబినెట్ మీటింగ్లో కీలక నిర్ణయాలు..
కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. మొత్తం 18 అంశాలతో కేబినెట్ అజెండా ఉన్నట్టు తెలిసింది. రైతు భరోసాకు సంబంధించిన విధివిధానాలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలోని కేబినెట్ సబ్ కమిటీ చేసిన సిఫార్సులపై మంత్రివర్గ సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే భూమి లేని పేద రైతు కూలీలకు ఏటా రెండు విడతల్లో ఇచ్చే రూ.12 వేల సాయానికి సంబంధించి కూడా చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిసింది. ఎవరికి ఇవ్వాలి? ఎలా ఇవ్వాలనే విధివిధానాలపై చర్చించనున్నారు.
ALSO READ : ఫార్ములా-ఈ రేస్ కేసులో కేటీఆర్కు ఏసీబీ నోటీసులు
ఫిబ్రవరి లేదా ఉగాది నుంచి ఉచితంగా సన్నబియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. దీంతో కొత్త రేషన్ కార్డుల జారీపైనా చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఇందిరమ్మ ఇండ్లు ఎప్పటి నుంచి మొదలుపెట్టాలనే దానిపైనా డెసిషన్ తీసుకుంటారని తెలిసింది. ఎస్సీ వర్గీకరణ, ఇరిగేషన్ ప్రాజెక్టులు, మున్సిపాలిటీలకు సంబంధించిన అంశాలపైనా చర్చించనున్నారు. యాదగిరిగుట్ట దేవాలయానికి టీటీడీ తరహాలో ప్రత్యేక బోర్డు ఏర్పాటుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. యాదగిరిగుట్ట ఆలయానికి 20 మందితో పాలక మండలి ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. కొత్త టూరిజం పాలసీకి కేబినెట్ ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది.