లోక్​సభలో కుల దుమారం

 లోక్​సభలో కుల దుమారం
  • కులగణనపై రాహుల్ గాంధీ వర్సెస్ అనురాగ్ ఠాకూర్
  • కులమేంటో తెలియనోళ్లు కులగణన కోరుతున్నారన్న బీజేపీ ఎంపీ 
  • ఎంత అవమానించినా పోరాటం ఆపనన్న ప్రతిపక్ష నేత  
  • కులం ప్రస్తావన ఎందుకంటూ ఎస్పీ చీఫ్​అఖిలేశ్ ఆగ్రహం 
  • ఎవరి పేరూ ప్రస్తావించలేదని సమర్థించుకున్న ఠాకూర్

న్యూఢిల్లీ: కుల గణన డిమాండ్‌పై మంగళవారం లోక్​సభలో జరిగిన చర్చ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్​ ఎంపీ రాహుల్‌ గాంధీపై వ్యక్తిగత దూషణకు దారితీసింది. తమ కులం ఏంటో తెలియని వారు కులగణనకు డిమాండ్​ చేస్తున్నారంటూ బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవడంతో.. ఆ వ్యాఖ్యలు చేసినప్పుడు తాను ఎవరి పేరును ప్రస్తావించలేదని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. 

అయితే తనను అవమానించే కొద్దీ.. పోరాడుతూనే ఉంటానని రాహుల్​ అన్నారు. ఇవేవీ తనను అడ్డుకోలేవన్నారు. ఇలాంటి వారి నుంచి   క్షమాపణలను కూడా కోరుకోనని చెప్పారు. అనురాగ్ సభలో కులాన్ని ఎలా ప్రస్తావిస్తారని సమాజ్​వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్  ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో ముందుగా ఠాకూర్ మాట్లాడుతూ.. బడ్జెట్ తయారీ సందర్భంగా సంప్రదాయంగా చేసే ‘హల్వా’ వేడుకను ప్రస్తావిస్తూ బడుగు బలహీన వర్గాలకు ఎలాంటి తీపి దక్కలేదని రాహుల్  సోమవారం చేసిన కామెంట్లను విమర్శించారు. ‘‘రాహుల్ జీ.. మీరు  హల్వా గురించి మాట్లాడారు.

 బోఫోర్స్ నుంచి 2జీ స్కాం వరకు ‘హల్వా’ ఎవరికి దక్కింది? కాంగ్రెస్ ప్రెసిడెంట్​గా పనిచేసిన ఓబీసీ నేత సీతారాం కేసరిని ఎంత అవమానకరంగా తొలగించారు. అలాంటి పార్టీ ఓబీసీల గురించి మాట్లాడుతున్నది” అని అన్నారు. “కాంగ్రెస్ యువరాజు మనకు జ్ఞానబోధ చేస్తున్నరు. ముందుగా ఆయన ప్రతిపక్షం అంటే ఏమిటో అర్థం చేసుకోవాలి.. లోక్​సభ ప్రతిపక్ష నేత అంటే అబద్ధాలు ప్రచారం చేసే నాయకుడు కాదు. ఓబీసీ, కులగణన గురించి పెద్ద చర్చ జరుగుతున్నది. 

తమ కులం ఏంటో తెలియనోళ్లు  కులగణన గురించి మాట్లాడుతున్నరు” అని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. దీంతో రాహుల్ స్పందిస్తూ.. ‘‘మీరు నన్ను చాలా అవమానించగలరు. ప్రతిరోజూ అవమానించండి. కానీ మేం ఇక్కడ(పార్లమెంటులో) కులగణన బిల్లును కచ్చితంగా పాస్ చేయించుకుని తీరుతామని మర్చిపోవద్దు” అని అన్నారు.  

బ్యాంకుల పెనాల్టీలకు పేదల జేబులు ఖాళీ

బీజేపీ సర్కారు పేద ప్రజల వెన్ను విరుస్తోందని రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. బ్యాంకుల పెనాల్టీ విధానం ప్రధాని మోదీ చక్రవ్యూహానికి గేట్ వే  అని ఆరోపించారు. ఆ చక్రవ్యూహాన్ని, దౌర్జన్యాలను ప్రజలు  తిప్పికొడతారని అన్నారు. అకౌంట్లలో మినిమమ్ బ్యాలెన్స్ ఉంచనందుకు ప్రభుత్వ బ్యాంకులు పెనాల్టీ రూపంలో ఐదేండ్లలో రూ.7,500 కోట్లు వసూలు చేశాయని ఆయన ట్విట్టర్ లో విమర్శించారు. 

అగ్నిపథ్​పై అఖిలేశ్ వర్సెస్ ఠాకూర్

బడ్జెట్​పై చర్చ సదర్భంగా లోక్​సభలో సమాజ్​వాదీ పార్టీ చీఫ్​, ఎంపీ అఖిలేశ్​ యాదవ్, బీజేపీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి అనురాగ్​ ఠాకూర్​ మధ్య వాగ్వాదం జరిగింది. అగ్నిపథ్​ స్కీంను యువత వ్యతిరేకిస్తున్నారని అఖిలేశ్ అన్నారు. నాలుగేండ్ల తర్వాత అగ్నివీర్ లకు  ఎంప్లాయిమెంట్​ గ్యారంటీ లేదన్నారు. దీనిపై స్పందించిన  ఠాకూర్.. అగ్నివీర్​లకు నాలుగేండ్ల తర్వాత 100 శాతం ఉపాధి గ్యారంటీ ఉందన్నారు. 

రాహుల్​తో కలిసి కూర్చోవడం వల్ల అఖిలేశ్​కు అబద్ధాలు చెప్పడం బాగా అలవాటైందని విమర్శించారు. కేంద్ర బడ్జెట్ పూర్తిగా నిరాశపూరితంగా ఉందని అఖిలేశ్ విమర్శించారు. బడ్జెట్ లో నిరుద్యోగులు, యువత, గ్రామీణులకు ఏమీ లేదన్నారు. కుటుంబాన్ని పోషించడం ఎంత కష్టమో కుటుంబం ఉన్న వారికి మాత్రమే తెలుస్తుందన్నారు.