
మేనేజ్‌మెంట్ కోర్సు అందించడంలో ఐఐఎం(ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్‌మెంట్)లకు అంతర్జాతీయంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ క్యాంపస్‌ల్లో అడుగుపెట్టేందుకు ఏకైక మార్గం కామన్ అడ్మిషన్ టెస్ట్(క్యాట్). దేశవ్యాప్తంగా లక్షల మంది ఎంబీఏ అభ్యర్థులు ఆసక్తిగా ఎదురుచూసే క్యాట్ 2023 నోటిఫికేషన్ విడుదలైంది. నవంబర్ 26న ఆన్‌లైన్ విధానంలో పరీక్ష జరుగనుంది. ఈ నేపథ్యంలో పరీక్ష సిలబస్, ప్రిపరేషన్, ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి తెలుసుకుందాం..
గతేడాది అన్ని ఐఐఎంలలోని దాదాపు 5000 ఎంబీఏ సీట్ల కోసం 2.20 లక్షలమంది క్యాట్‌లో పోటీ పడ్డారు. ప్రవేశ విషయంలో సానుకూలత ఏమిటంటే- కొన్ని సంవత్సరాలుగా ఐ.ఐ.ఎం.లు సాధారణ డిగ్రీ విద్యార్థులైన బీకాం, బీఎస్సీ, ఛార్టర్డ్ అకౌంటెన్సీ చదివినవారికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. బీటెక్ చదివినవారికన్నా పై గ్రూపు విద్యార్థులకు క్యాట్‌లో తక్కువ స్కోరు వచ్చినా అడ్మిషన్ అవకాశం ఉంటోంది. క్యాట్‌లో అర్హత సాధించిన తర్వాత, ఐ.ఐ.ఎం.లు, బిజినెస్ స్కూల్స్ తదుపరి స్క్రీనింగ్ టెస్ట్స్, రిటెన్ ఎబిలిటీ టెస్ట్ (రాత పరీక్ష), గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూల్లో ప్రతిభ చూపిస్తే ఎంట్రెన్స్ కల్పిస్తున్నాయి. కాబట్టి విద్యార్థులు క్యాట్ సన్నద్ధతతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించుకొంటే ఐ.ఐ.ఎం.ల్లో అడ్మిషన్స్ సులభం.
సబ్జెక్టుల వారీగా ప్రిపరేషన్
వెర్బల్ ఎబిలిటీ, రీడింగ్ కాంప్రహెన్షన్: ప్రతి అభ్యర్థికీ కష్టంగా అనిపించే విభాగమిది. ఇందులో నాలుగు ప్యాసేజీలు (16 ప్రశ్నలు), వెర్బల్ ఎబిలిటీపై 8 ప్రశ్నలు (పేరా జంబుల్స్- 3, పేరా సమ్మరీ-3, పేరా కంప్లీషన్-2 ఉంటాయి. మ్యాథ్స్‌కూ, రీజనింగ్‌కూ ఉండే షార్ట్ కట్స్ దీనికి ఉండవు. ఇంగ్లీష్‌ను తార్కికంగా చదివితే విజయం సాధించవచ్చు. ఎక్కువ వెయిటేజీ రీడింగ్ కాంప్రహెన్షన్ (ఆర్‌సీ)కి ఉంది. 19 ప్రశ్నలు కేవలం ప్యాసేజ్‌లపైనే అడిగారు. అభ్యర్థులు తప్పనిసరిగా రీడింగ్ స్కిల్స్పెంపొందించుకోవాలి. ప్రతి పోటీ పరీక్షలో ఆర్‌సీ రెండు విభాగాలతో ఉంటుంది- ఒకటి ప్యాసేజీ, రెండోది దాని ప్రశ్నలు, ఛాయిస్‌లు. ఎగ్జామినర్ ప్యాసేజీలను న్యూస్ పేపర్స్, పుస్తకాల నుంచి సేకరించి పరీక్షలకు ఉపయోగిస్తారు. అంటే ప్యాసేజీలు కష్టతరంగా ఉండనప్పటికీ.. వాటి ప్రశ్నలు, ఛాయిస్‌ల భాగంలోనే ఉచ్చులు (ట్రాప్స్) ఉంటాయి. ఇక్కడ కొద్దిగా సమయం వెచ్చించి జాగ్రత్తగా చదవాలి. అభ్యర్థులు ప్యాసేజీని పదేపదే చదువుతూ సమయం వృథా చేస్తుంటారు. దీన్నుంచి బయటపడాలి. అలాగే ప్యాసేజీని చదివేటప్పుడు, ప్రతి పేరాలోని ముఖ్య భావనలు వెలికితీయాలి. అంతేకానీ ప్రతి పదానికీ అర్థం కోసం వెతకకూడదు. ప్రశ్నలు పేరాలోని ముఖ్య భావనలపైనే కానీ, పదాలపై ఉండవు.
ఆర్‌సీ ప్రశ్నలు రెండు రకాలు. ఫ్యాక్ట్ (వాస్తవ సమాచార) ఆధారిత ప్రశ్నలు. ఇవి సులువైనవి. ప్యాసేజీల్లో వెతికితే జవాబులు దొరుకుతాయి. అయితే రెండో రకం ఇన్ఫరెన్స్ ప్రశ్నలు. వీటి జవాబులు పైపైన చదివితే దొరకవు. అంతర్లీనంగా ఉంటాయి. క్యాట్‌లో ఈ తరహా ప్రశ్నలు ఎక్కువగా ఇస్తుంటారు. ఈ విభాగంలో సమయపాలన చాలా అవసరం. ఎందుకంటే 40 నిమిషాల్లో 4 ప్యాసేజీలు, వెర్బల్ ఎబిలిటీ (వీఏ) విభాగం పూర్తి చేయాలి. అంటే ఒక్కో ప్యాసేజీని 10 నిమిషాల్లోపే పూర్తిచేసి మిగతా సమయాన్ని వీఏకి ఉపయోగించుకోవాలి. మొత్తం మీద అభ్యర్థులు వేగంగా చదవటం అలవర్చుకోవాలి. క్యాట్‌లో ఆర్‌సీలు ఆన్‌లైన్‌లోని అంతర్జాతీయ దినపత్రికలు, మ్యాగజీన్స్‌లో వచ్చే ప్రత్యేక వార్తలు, ఎడిటోరియల్స్ నుంచి ఇస్తుంటారు. ప్యాసేజీలను చదువుతున్నపుడు కొత్త పదాలు ఎదురైతే సందర్భానికి అనుగుణంగా అర్థం చేసుకోవాలి. ఈ ఆర్‌సీ సాధన ద్వారా వీఏని సులభంగా ఛేదించవచ్చు.
లాజికల్ రీజనింగ్, డేటా ఇంటర్‌ప్రిటేషన్: ఇందులో లాజికల్ రీజనింగ్‌పై 10 ప్రశ్నలు, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌పై 10 ప్రశ్నలు ఇస్తున్నారు. వీటిలో బార్ గ్రాఫ్‌లు, కాలమ్ గ్రాఫ్‌లు, టేబుల్ ఆధారిత ప్రశ్నలు, లైన్ చార్టులు, పై చార్టులు అడుగుతారు. నంబర్స్ ఆధారిత, వెన్ డయాగ్రమ్ లాంటి ప్రశ్నలు అడుగుతున్నారు. ఈ విభాగంపై పట్టు రావాలంటే మొదటగా అర్థమెటిక్ సబ్జెక్టు, సెట్ థియరీపై అవగాహన రావాలి. సాధారణమైన లాజికల్ థింకింగ్ సామర్థ్యాలు పెంచుకోవడానికి సుడోకు లాంటి పజిల్స్ సాధన చేస్తే లాజికల్ రీజనింగ్, డేటా ఇంటర్ ప్రిటేషన్పై పట్టు సాధించవచ్చు.
క్వాంటిటేటివ్ ఎబిలిటీ: 2022 క్యాట్‌లో అర్థమెటిక్- నుంచి 8, ఆల్‌జీబ్రా- నుంచి 8, జామెట్రీలో -3, నంబర్ సిస్టం నుంచి -1, మోడర్న్ మ్యాథ్స్- నుంచి 2 ప్రశ్నలు అడిగారు. అర్థమెటిక్‌లో నంబర్ సిస్టమ్, శాతాలు, నిష్పత్తులు, సరాసరి, సమయం, వేగం- దూరం, బారు-చక్రవడ్డీ, పైప్స్ లాంటి అంశాలనుంచి ప్రశ్నలు వస్తాయి. క్వాంటిటేటివ్ ఎబిలిటీలో ఎక్కువ మార్కులు సాధించాలంటే 8 నుంచి 10వ తరగతి మ్యాథ్స్ ప్రాథమిక అంశాల అధ్యయనం, అనువర్తనం చెయ్యాలి. సూత్రాలను బట్టీ పట్టకుండా తార్కిక పరిజ్ఞానం ఉపయోగించి జవాబులు కనుక్కోవాలి.- క్యాట్‌లో ఆన్‌స్క్రీన్ కాల్‌క్యులేటర్ ఉంటుంది. . దాదాపు సగం ప్రశ్నలు మ్యాథ్స్‌పై కాకుండా నిత్యజీవితంలో ఉపయోగించే అర్థమెటిక్ నుంచే అడుగుతున్నారు.
వెయిటేజీ: ఐఐఎంలు క్యాట్ స్కోర్ ఆధారంగా అర్హులైన అభ్యర్థులకు మలి దశలో గ్రూప్ డిస్కషన్, రిటెన్ ఎబిలిటీ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాయి. వీటికి నిర్దిష్ట వెయిటేజీ కేటాయించే విధానాన్ని అనుసరిస్తున్నాయి. ఆయా ఐఐఎంల గత ప్రవేశ విధానాలను పరిశీలిస్తే.. క్యాట్ స్కోర్‌కు 50 నుంచి 70 శాతం, జీడీ/పీఐలకు 30 నుంచి 50 శాతం మధ్యలో వెయిటేజీ ఇస్తున్నాయి. క్యాట్ స్కోర్‌తోనే అడ్మిషన్ వస్తుందని భావించకుండా గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ, రిటెన్ ఎబిలిటీ టెస్ట్‌లలోనూ రాణించేందుకు కృషి చేయాలి.
జీడీ, ఇంటర్వ్యూ: గ్రూప్ డిస్కషన్స్(జీడీ)లో అభ్యర్థులను నిర్దిష్ట సంఖ్యలో బృందాలుగా విభజించి.. ప్రతి బృందానికి ఏదైనా టాపిక్ ఇచ్చి దానిపై మాట్లాడమంటారు. ఒక్కో బృందంలో ఎనిమిది నుంచి పది మంది అభ్యర్థులు ఉంటున్నారు. జీడీ సమయంలోనే కొన్ని ఐఐఎంలు రిటెన్ ఎబిలిటీ టెస్ట్ నిర్వహిస్తున్నాయి. ఈ టెస్ట్‌లో భాగంగా అభ్యర్థులు నిర్దిష్టంగా ఏదైనా ఒక అంశంపై తమ అభిప్రాయాలను పద పరిమితితో రాయాలని సూచిస్తున్నాయి. ఈ రెండు దశల్లోనూ విజయం సాధించి మెరిట్ జాబితాలో నిలిచిన వారికి చివరగా పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. అభ్యర్థులు మేనేజ్‌మెంట్ విద్యనే అభ్యసించాలనుకోవడానికి కారణం ఏంటి.. భవిష్యత్తు లక్ష్యాలు, ఆసక్తులు, అభిరుచులు తదితర కోణాల్లో ప్రశ్నలు అడుగుతున్నారు.
ఐఐఎంలో - పీజీ సీట్లు: అహ్మదాబాద్–-445 సీట్లు; బెంగళూరు-–412; కోల్‌కత-–480; లక్నో-–436; ఇండోర్-–451; నాగ్‌పూర్–-225; ఉదయ్‌పూర్–-325; త్రిచీ-–260; కాశీపూర్–-90; కోజికోడ్-–375; బోద్‌గయ–-120; రోహ్‌తక్–-264; రాంచీ–-185; సిౖర్మౌర్–-120; అమృత్‌సర్–-160; షిల్లాంగ్–-92, రాయ్‌పూర్– -90; జమ్ము–-90; సంబల్‌పూర్–-90; విశాఖపట్నం–-120 సీట్లు ఉన్నాయి.
ప్రశ్నలు సగం.. మార్కులు ఫుల్
అభ్యర్థులు చాలా మంది క్యాట్‌ను ‘డిఫికల్ట్’ ఎగ్జామ్ అనుకుంటారు. కానీ ఇది ‘డిఫరెంట్’ పరీక్ష మాత్రమే. మొత్తం 66 ప్రశ్నల్లో సగం (33) సరైన జవాబులు ఇవ్వగలిగినవారికి 99 పర్సంటైల్ స్కోరు వస్తుంది. ఈ టాప్ స్కోరు అన్ని టాప్ ఐ.ఐ.ఎం.లలో ప్రవేశానికి ఉపయోగపడుతుంది. 90 పర్సంటైల్ (20 ప్రశ్నలకు సరైన సమాధానాలు) సాధించినా అనేక ఐ.ఐ.ఎం.లలో అర్హత సాధిస్తారు. అంటే క్యాట్‌లో మంచి స్కోరుకు- అభ్యర్థి తన శక్తికి తగ్గ ప్రశ్నలను ఎంపిక చేసుకోవడం చాలా అవసరం. అసాధ్యమైన క్లిష్ట ప్రశ్నలను వదిలివేసే (ఎలిమినేషన్) సమయస్ఫూర్తి కావాలి. ఉన్న 2 గంటల సమయంలో తన సామర్థ్యానికి తగ్గ ప్రశ్నలను ఎంపిక చేసుకొని విజయం సాధించాలి. విజయానికి దోహదపడేది- ఆన్‌లైన్ మాక్ టెస్టుల సాధన. పరీక్ష లోపు కనీసం 50 మాక్ ఎగ్జామ్స్ రాయాలి. రాసినవాటిలో తప్పులు ఎందుకు పోతున్నాయో విశ్లేషించి గ్రహించాలి. తద్వారా క్రమేణా స్కోరు మెరుగుపడుతుంది. మాక్ టెస్టుల్లో భాగంగా ప్రీవియస్ పేపర్స్ ప్రాక్టీస్ చేయాలి. ఇలా పరీక్షపై పూర్తి అవగాహనతో ప్రణాళికాబద్ధంగా సిద్ధమయితే క్యాట్‌లో మంచి స్కోరు సులువుగా సాధించవచ్చు.
నోటిఫికేషన్
దరఖాస్తులు : అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో సెప్టెంబర్ 13 వరకు దరఖాస్తు చేసుకోవాలి. క్యాట్ పరీక్ష నవంబర్ 26న నిర్వహిస్తారు. రిజల్ట్స్ జనవరి రెండో వారంలో విడుదల చేస్తారు.
అర్హత : ఏదైనా డిగ్రీలో 50 శాతం మార్కులు (జనరల్, ఓబీసీ). 45 శాతం మార్కులు (ఎస్‌సీ, ఎస్‌టీ, డీఏ) ఫైనల్ ఇయర్ డిగ్రీ విద్యార్థులు అర్హులే.
పూర్తి వివరాలకు www.iimcat.ac.in వెబ్సైట్లో సంప్రదించాలి. క్యాట్‌తో పాటు జాట్ (జేవియర్ ఆప్టిట్యూడ్ టెస్ట్), స్నాప్ (సింబయాసిస్ నేషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్) లాంటి చాలా ప్రవేశపరీక్షల్లో దాదాపుగా ఇదే సిలబస్ కామన్‌గా ఉంటుంది. అందుకే క్యాట్ సన్నద్ధత అన్ని బిజినెస్ స్కూల్స్ ఎంట్రెన్స్‌లకు ఉపయోగకరంగా ఉంటుంది.