
హైదరాబాద్, వెలుగు: సీనియర్ ఐఏఎస్ అధికారి రొనాల్డ్ రోస్ తెలంగాణలోనే సేవలు కొనసాగించేందుకు కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ (క్యాట్) బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల విభజన తర్వాత కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ (డీవోపీటీ) రొనాల్డ్‌ను ఏపీకి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఆదేశాల మేరకు ఏపీలో రిపోర్ట్ చేసిన ఆయన, కొన్ని కారణాలతో తిరిగి తెలంగాణకు వచ్చారు. అయితే, మళ్లీ ఏపీకి వెళ్లాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో ఆయన తప్పక ఏపీలో రిపోర్ట్ చేశారు. దానిపై మళ్లీ రొనాల్డ్ రోస్ క్యాట్‌ను ఆశ్రయించారు. తెలంగాణలోనే కొనసాగేలా డీవోపీటీని ఆదేశించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేయగా, క్యాట్ తాజాగా ఆయనకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఈ ఆదేశాలతో రొనాల్డ్‌కు పెద్ద ఊరట లభించినట్లైంది. దీంతో ఏపీలో కొనసాగుతున్న ఆయన త్వరలోనే మళ్లీ తెలంగాణలో రిపోర్ట్ చేయనున్నారు. రొనాల్డ్ తో పాటు ఆమ్రపాలి కూడా మళ్లీ తెలంగాణకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
శివశంకర్ మళ్లీ క్యాట్‌కు.. డీవోపీటీకి హెచ్చరిక!
2013 బ్యాచ్ ఐఏఎస్ అధికారి శివశంకర్ లోథేటి కూడా తెలంగాణ కేటాయింపుపై డీవోపీటీ జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ మరోసారి క్యాట్‌ను ఆశ్రయించారు. గతంలో ఒకసారి క్యాట్‌ను ఆశ్రయించగా, ఫిబ్రవరి 28న శివశంకర్‌ను ఏపీకి కేటాయించాలని, నాలుగు వారాల్లో ఉత్తర్వులు జారీ చేయాలని డీవోపీటీని ఆదేశించింది. అయితే, డీవోపీటీ ఆ ఆదేశాలను అమలు చేయకపోవడంతో శివశంకర్ కంటెంప్ట్ పిటిషన్ దాఖలు చేశారు. డీవోపీటీ 12 వారాల గడువు కావాలని కోరగా, దాన్ని తిరస్కరించిన క్యాట్, నాలుగు వారాల్లో ఉత్తర్వులు జారీ చేయాలని, లేకుంటే వ్యక్తిగతంగా హాజరు కావాలని డీవోపీటీని హెచ్చరించింది. తన నివాసాన్ని తెలంగాణగా తప్పుగా పరిగణించారని, జన్మస్థలం, విద్యాభ్యాసం కంటే ఉత్తర ప్రత్యుత్తరాల చిరునామాను ఆధారం చేసుకున్నారని శివశంకర్ పిటిషన్‌లో పేర్కొన్నారు.