కేంద్రప్రభుత్వ ఆధ్వర్యంలో 21 ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ సంస్థల్లో దాదాపు 5000 ఎంబీఏ (పీజీ ప్రోగ్రాం) సీట్లతో పాటు టాప్ బిజినెస్ స్కూల్స్‌లో 2025-2027 బ్యాచ్ ఎంబీఏ అడ్మిషన్స్ కోసం క్యాట్ (కామన్ అడ్మిషన్ టెస్ట్)- 2024 నోటిఫికేషన్ విడుదలైంది. నవంబర్ 24న దేశవ్యాప్తంగా ఈ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో పరీక్ష సిలబస్, ఎగ్జామ్ ప్యాటర్న్, ప్రిపరేషన్ టిప్స్ తెలుసుకుందాం..
క్యాట్ పరీక్షలో మంచి పర్సెంటైల్ సాధించాలంటే ప్రధానంగా దృష్టి పెట్టాల్సిన అంశం కోర్ కాన్సెప్ట్‌లను అవగాహన చేసుకోవడమే. ఇందుకుగాను వీలైనన్ని మోడల్ పేపర్స్, ప్రీవియస్ పేపర్లు సాధన చేస్తూ ఏ ప్రశ్నలు ఎందుకు అర్థం కాలేదో వివరణలు తెలుసుకోవడం, కాన్సెప్ట్‌లు అర్థం చేసుకొని ప్రిపేరవ్వడం చేయాలి. ముఖ్యంగా క్యాట్ ఎగ్జామ్ లో పాటించాల్సింది టైమ్ మేనేజ్‌మెంట్. కాబట్టి తక్కువ సమయంలో ఎక్కువ ప్రశ్నలు సాధించేలా ప్రాక్టీస్ చేయడం ఉత్తమం.
ముందు స్పష్టమైన సమాధానాలు రాయాలి. చివర్లో కన్‌ఫ్యూజ్డ్ క్వశ్చన్స్ లేదా టైమ్ టేకన్ ప్రశ్నలు చేయడానికి ప్రయత్నించాలి. టాప్ ఐఐఎంలలో సీటు సాధించాలంటే ప్రతి సెక్షన్ నుంచి కనీసం 22 నుంచి 25 ప్రశ్నలు సాధించాల్సి ఉంటుంది. ముఖ్యంగా సెక్షనల్ కటాఫ్ సాధించడంతో పాటు మంచి స్కోర్ ఉంటేనే కాల్ లెటర్స్ అందుకునే అవకాశం ఎక్కువ.
ఏ సెక్షన్లో ఏముంటాయ్
వెర్బల్ ఎబిలిటీ, రీడింగ్ కాంప్రహెన్షన్ : వెర్బల్ ఎబిలిటీపై 8 ప్రశ్నలు (పేరా జంబుల్స్-2, పేరా సమ్మరీ-2, పేరా కంప్లిషన్/ సెంటెన్స్ ప్లేస్‌మెంట్-2, ఆడ్ సెంటెన్స్-2), రీడింగ్‌కాంప్రహెన్షన్‌పై 16 ప్రశ్నలు (4 ప్యాసేజీలు) వస్తాయి. రోజూ 3-5 రీడింగ్ కాంప్రహెన్షన్ (ఆర్‌సీ) ప్యాసేజీలు సాధన చేయాలి. క్యాట్ ఆధారిత ఆర్‌సీలతో పాటు ఇంగ్లీష్ పఠనం అవసరం కాబట్టి ఆన్‌లైన్‌లో లభించే అంతర్జాతీయ ఇంగ్లీష్ దినపత్రికలు, మ్యాగజీన్లు చదవాలి. రోజూ కొన్ని కొత్త ఆంగ్ల పదాలను నేర్చుకుంటూ పద జాలంపై పట్టు పెంచుకోవాలి.
లాజికల్ రీజనింగ్, డేటా ఇంటర్‌ప్రెటేషన్ : ఇందులో లాజికల్ రీజనింగ్‌పై (ఎల్‌ఆర్) 10 ప్రశ్నలు, డేటా ఇంటర్‌ప్రెటేషన్‌పై (డీఐ) 10 ప్రశ్నలు ఇస్తున్నారు. వీటిలో అరేంజ్‌మెంట్స్, బార్ గ్రాఫ్‌లు, కాలమ్ గ్రాఫ్స్‌లు, టేబుల్ ఆధారిత ప్రశ్నలు, లైన్, పై చార్టులు అడుగుతారు. నంబర్స్ ఆధారిత, వెన్ డయాగ్రమ్ లాంటి ఎల్‌ఆర్ ప్రశ్నలు, ముఖ్యంగా గేమ్స్ అండ్ టోర్నమెంట్స్ ఇస్తున్నారు. దీనిపై పట్టు కోసం రెగ్యులర్‌గా ఎల్‌ఆర్ ప్రశ్నలు, డీఐ సెట్స్ గత సంవత్సరపు ప్రశ్నల సరళితో ప్రాక్టీస్ చేయాలి. డీఐ విభాగంలో మంచి స్కోరు సాధించాలంటే మొదటగా క్వాంట్‌పై (అర్థమెటిక్ + మ్యాథ్స్) సబ్జెక్టుపై పట్టు బిగించాలి. రోజూ కాల్‌క్యులేషన్స్, కంపారిజన్స్, లాజికల్ డిడక్షన్స్ సాధన అవసరం. పరీక్ష లోపు కనీసం 50 ఎల్‌ఆర్, డీఐ సెట్స్‌పై ప్రాక్టీస్ చేయాలి.
బేసిక్స్‌పై పట్టుండాలి : మొదట అన్ని సబ్జెక్టుల బేసిక్స్ అంశాలపై పట్టు బిగించాలి. క్యాట్ ప్రిపరేషన్ స్థూలంగా రెండుగా ఉంటుంది. సబ్జెక్టుల సిలబస్ పూర్తి చెయ్యడం, టెస్టుల సాధన. ఈ రెండూ ఏక కాలంలో చెయ్యాలి. ఆన్‌లైన్ టెస్టుల సాధన రెగ్యులర్‌గా చెయ్యాలి. ఒక టాపిక్ పూర్తయ్యాక దానిపై వెంటనే కొన్ని టెస్టులూ, తర్వాత సెక్షన్‌వారీగా.. ఇలా మొత్తం సిలబస్‌పై క్రమం తప్పకుండా ఆన్‌లైన్ మాక్ టెస్టులు రాసి విశ్లేషణ చేసుకోవాలి. రోజువారీ ప్రణాళిక, వారాంతపు సమీక్షలతో పాటు సానుకూల దృక్పథంతో నిత్యం సాధన చేస్తే క్యాట్‌లో మంచి స్కోరును సాధించవచ్చు.
వర్బల్ ఎబిలిటీ అండ్ రీడింగ్ కాంప్రహెన్సన్ : ఇందులో ప్యాసేజస్ ఇచ్చి దానిలోని సమాచారం ఆధారంగా ప్రశ్నలు అడుగుతారు. ప్రధానంగా జంబుల్డ్ పేరాగ్రాఫ్, పేరా సమ్మరీ, జంబుల్డ్ సెంటెన్సెస్ అనే టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. సినానిమ్స్, ఆంటోనిమ్స్, క్లోజ్ పాసేజ్, వెర్బల్ రీజనింగ్, ఇన్ఫరెన్సెస్, ఫ్యాక్ట్స్, జడ్జ్‌మెంట్స్ వంటి అంశాలను కూడా ప్రాక్టీస్ చేయడం మంచిది. గ్రామర్, వొకాబులరీ ప్రశ్నలు ఇచ్చినా, ఇవ్వకున్నా మిగిలిన ప్రశ్నలు అవగాహన చేసుకొని సమాధానాలు రాయాలంటే వాటిపై పట్టు సాధించాలి. పేపర్స్‌లోని ఎడిటోరియల్స్ పదే పదే చదవడం ద్వారా అర్థం చేసుకునే వేగం పెరగడంతో పాటు గ్రామర్, సెంటెన్స్ స్ర్టక్చర్, ముఖ్యమైన వొకాబులరీ వంటివి కూడా నేర్చుకోవచ్చు.
డీఐ, లాజికల్ రీజనింగ్ : డేటా ఇంటర్‌ప్రిటేషన్ లో ప్రధానంగా క్యాలిక్యులేషన్ బేస్డ్, కౌంటింగ్ బేస్డ్, లాజిక్ బేస్డ్, స్ర్టక్చర్ బేస్డ్ ప్రశ్నలిస్తారు. బ్యాంక్ పరీక్షల్లో ఇచ్చే డీఐ కంటే కాస్త భిన్నమైన ప్రశ్నలు ఇందులో ఇస్తారు. బార్ గ్రాఫ్‌లు, ఫ్లో చార్టులు, పై చార్టులు, టేబుల్స్, లైన్‌ఛార్ట్స్, వెన్ డయాగ్రామ్స్, కేస్‌లెట్స్ లో డేటా ఇచ్చి వాటి ఆధారంగా ప్రశ్నలు అడుగుతారు.
ఇందుకు గాను క్యాట్ ప్రీవియస్ పేపర్లలో వచ్చిన ప్రశ్నల ఆధారంగా ప్రామాణిక పుస్తకాల్లోని మోడల్ క్వశ్చన్స్ సాధన చేయాలి. ఈ సెక్షన్ లో ఎక్కువగా టైమ్ తీసుకునే ప్రశ్నలే ఇస్తారు. లాజికల్ రీజనింగ్ లో క్లాక్స్, నంబర్ అండ్ లెటర్ సిరీస్, బైనరీ లాజిక్, సీటింగ్ అరేంజ్‌మెంట్, బ్లడ్ రిలేషన్స్,
క్యాలెండర్స్, క్యూబ్స్ వంటి టాపిక్ లపై క్వశ్చన్స్ అడుగుతారు. అభ్యర్థులు లాజికల్ గా ఆలోచించి సమాధానాలు రాయాలి.
క్వాంటిటేటివ్ ఎబిలిటీ : ప్యూర్ మ్యాథ్స్ తో పాటు అర్థమెటిక్ అంశాల నుంచి క్వశ్చన్స్ వస్తాయి. జామెట్రీ, ఆల్జీబ్రా, అర్థమెటిక్, అడ్వాన్స్‌డ్ మ్యాథమెటిక్స్ అనే ప్రధాన విభాగాలలోని ఫార్ములాలు బాగా నేర్చుకొని ప్రాక్టీస్ చేయాలి. దాదాపు అన్ని ప్రశ్నలు క్యాలిక్యులేటెడ్ బేస్ గా ఉంటాయి కాబట్టి చాప్టర్‌వైజ్ గా సాధన చేయాలి. సమాధానాలు వందశాతం ఖచ్చితత్వంతో సాధించాల్సి ఉంటుంది. అర్థమెటిక్ విభాగంలో నంబర్స్, పర్సెంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్
సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, రేషియో, ప్రపొర్షనాలిటీ, టైమ్ డిస్టెన్స్, టైమ్ వర్క్, మిక్సర్స్, యావరేజస్ పార్ట్‌నర్‌షిప్ టాపిక్స్ నుంచి అన్నిటికంటే ఎక్కువగా 14 నుంచి 18 ప్రశ్నలిచ్చే అవకాశం ఉంది. ఆల్బీబ్రాలో 6 నుంచి 8, అడ్వాన్స్‌డ్ మ్యాథమెటిక్స్ లో 4 నుంచి 6, జామెట్రీలో 6 నుంచి 9 ప్రశ్నలు ఎక్స్‌పెక్ట్ చేయవచ్చు.
నోటిఫికేషన్
అర్హత : కనీసం 50 శాతం మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగు లకు 45%). డిగ్రీ చివరి సంవత్సరం పరీక్షలకు హాజరయ్యేవారూ దరఖాస్తు చేసుకోవచ్చు.
అప్లికేషన్స్ : అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో సెప్టెంబర్ 13 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రూ.2500 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.1250) పరీక్ష ఫీజు చెల్లించాలి. - హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ పరీక్ష కేంద్రాలు ఉంటాయి. నవంబర్ 24న పరీక్ష నిర్వహిస్తారు. ఫలితాలు 2025, జనవరి రెండో వారంలో విడుదల చేస్తారు. పూర్తి వివరాలకు www.iimcat.ac.in వెబ్సైట్లో సంప్రదించాలి.
ఎగ్జామ్ ప్యాటర్న్: ఆన్‌లైన్ పరీక్షలో వెర్బల్ ఎబిలిటీ, రీడింగ్ కాంప్రహెన్షన్ నుంచి 24 ప్రశ్నలు, లాజికల్ రీజనింగ్, డేటా ఇంటర్‌ప్రిటేషన్ నుంచి 20 ప్రశ్న లు,
క్వాంటిటేటివ్ ఎబిలిటీ : 22 ప్రశ్నల తో మొత్తం 66 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 2 గంటలు ఉంటుంది. ఒక్కో ప్రశ్నకు 3 మార్కులు. ప్రతి తప్పు సమాధానానికీ 1 మార్కు తగ్గిస్తారు.