క్యాటరింగ్ వ్యాపారి హత్య కేసు.. చాకచక్యంగా చేధించిన పోలీసులు

క్యాటరింగ్ వ్యాపారి హత్య కేసు.. చాకచక్యంగా చేధించిన పోలీసులు

అల్వాల్ లో క్యాటరింగ్ వ్యాపారి హత్య కేసు రహస్యాన్ని అల్వాల్ పోలీసులు చాకచక్యంగా చేధించారు. ఏసీపీ రాములు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇంట్లో పని చేసే వ్యక్తి యజమాని ఇంటిపై కన్నేసి సంపదను దోచుకెళ్లేందుకు వేసిన పథకంలో భాగంగా యజమానిని హత్య చేసినట్లు పేట్ బషీర్ బాద్ ఏసీపీ రాములు తెలిపారు. క్యాటరింగ్ వ్యాపారి అన్వర్ ను హత్యra చేసిన నిందితుడు మనోజ్ రాయల్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. 

కానాజిగూడ ఇందిర నగర్ కు చెందిన క్యాటరింగ్ వ్యాపారి అన్వర్ ఇంట్లో పని చేసే మనోజ్ రాయల్ అనే వ్యక్తి చెడు వ్యసనాలకు బానిసై ఆర్థిక ఇబ్బందుల కారణంగా హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఉత్తరాఖండ్ కు చెందిన మనోజ్ రాయల్ అన్వర్ వద్ద పని చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.తన యజమానికి ఉన్న సంపదను కొల్లగొట్టాలని పథకం ప్రకారం హత్య చేసినట్లు విచారణలో వెల్లడైంది. 

ఈ నెల 13 న అన్వర్  బంధువులు చనిపోవడంతో కుటుంబ సభ్యులు మధ్యప్రదేశ్ కు వెళ్ళగా..అన్వర్ తిరిగి ఆల్వాలోని ఇంటికి త్వరగా వచ్చినట్లు పేర్కొన్నారు.అన్వర్ కుటుంబ సభ్యులు ఇంట్లో లేని సమయాన్ని ఆసరాగా తీసుకొని అన్వర్ కు అతిగా మద్యం తాగించిన మనోజ్  గోడకు తలను బలంగా గుద్ది హతమార్చాడు. 

అన్వర్ మరణించాడని ధృవీకరించుకున్నానంతరం వెంటనే ఏటీఎం కార్డు,  నగదు,బంగారం, ద్విచక్రవాహం తీసుకుని పరారైనట్లు పోలీసులు తెలిపారు. ఏటీఎం కార్డు తో పాటు అన్వర్ ఫోన్ ఉపయోగించి రెండు లక్షల వరకు డబ్బు డ్రా చేసినట్లు గుర్తించారు. ఏటీఎం సీసీ కెమెరాలలో నగదు తీసుకెళుతున్నట్లు గుర్తించి మనోజ్ ను  పోలీసులు పట్టుకుని విచారించగా తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడని పేట్ బషీర్బాద్ ఏసిపి రాములు తెలిపారు.