
సినిమాల కంటెంట్ విషయంలో ఎన్ని మార్పులొచ్చినప్పటికీ.. కమర్షియల్ సినిమా విషయంలో మాత్రం స్పెషల్ సాంగ్ అనేది కంపల్సరీనే. హీరోయిన్స్ కూడా స్పెషల్ సాంగ్స్‌లో మెరిసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ తరహా పాటలను తెరకెక్కించడంలో తమిళ దర్శకుడు సుందర్ సి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఆయన గత చిత్రం ‘అరణ్యనై 4’లో తమన్నా, రాశీఖన్నాలతో చేయించిన ‘అచ్చచ్చో’ పాటను ప్రేక్షకులు ఇంకా మర్చిపోలేదు.
తను హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేస్తున్న ‘గ్యాంగర్స్’ చిత్రం నుంచి స్పెషల్ సాంగ్‌ను ఇటీవల విడుదల చేశారు. ‘కుప్పన్’ అంటూ సాగే ఈ పాటకు కేథరిన్ థ్రెస్సా గ్లామర్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. గత ఐదారేళ్లుగా తమిళంలో సినిమాలు తగ్గించిన కేథరిన్.. ఈ చిత్రంతో రీఎంట్రీ ఇస్తోంది. ఈ తరహా పాటలు తనకు కొత్తేమీ కాదు.
గతంలో ‘జయ జానకీ నాయక’ చిత్రంలో స్పెషల్ సాంగ్ చేసిందామె. పదిహేనేళ్ల గ్యాప్ తర్వాత , సుందర్ సితో వడివేలు నటిస్తున్న సినిమా ఇది. ఈ కామెడీ థ్రిల్లర్ ఏప్రిల్ 24న విడుదల కానుంది. మరి ఈ పాటతో తిరిగి తమిళంలో కేథరిన్ బిజీ అవుతుందేమో చూడాలి!