అరె ఆగండ్రా బయ్.. నేను రోడ్డు దాటాలె.. హన్మకొండ జిల్లాలో కొండ చిలువ చేసిన పని ఇది..!

అరె ఆగండ్రా బయ్.. నేను రోడ్డు దాటాలె.. హన్మకొండ జిల్లాలో కొండ చిలువ చేసిన పని ఇది..!

వరంగల్: బైక్పై రోడ్డు మీద వెళుతుండగా ఒక చిన్న పాము పిల్ల కనిపిస్తేనే హడలెత్తిపోతుంటాం. అలాంటిది.. 10 అడుగుల కొండచిలువ రోడ్డు దాటుతూ కనిపిస్తే.. ఇంకేమైనా ఉందా.. గుండెల్లో దడ పుడుతుంది. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో అదే జరిగింది. 10 అడుగుల కొండ చిలువ వాహనదారులను బెంబేలెత్తించింది. రాకపోకలను నిలిపేసింది.

చిన్న పామైతే పక్క నుంచి వెళ్లే అవకాశం ఉంటుంది గానీ ఏకంగా 10 అడుగుల కొండ చిలువ రోడ్డు దాటుతుండే సరికి ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. పరకాల-హుజురాబాద్ ప్రధాన రహదారిలో 10 అడుగుల కొండ చిలువ ఇలా గురువారం రాత్రి(డిసెంబర్ 19, 2024) స్థానికులను హడలెత్తించింది. రోడ్డు దాటుతూ కనిపించడంతో వాహనదారులు ఎక్కడి వాహనాలను అక్కడ నిలిపి వేసి కొండ చిలువ రోడ్డు దాటే వరకు వేచి ఉండక తప్పలేదు.

నవంబర్, 2024లో మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలో ఏకంగా ఇంటి పెరట్లో కొండ చిలువ కనిపించిది. గోలం లక్ష్మీ అనే మహిళకు చెందిన పెరటిలో గోడ పక్కన కొండ చిలువ ప్రత్యక్షమైంది. 10 అడుగుల కొండచిలువను చూసి స్థానికులు భయాందోళన చెందారు. పెరటి గోడ పక్కన ఖాళీ సంచులు, చెత్తచెదారం ఉండటంతో పంచాయతీ కార్మికులు చెత్తను సేకరించి ట్రాక్టర్లో తరలిద్దామని సంచులను తీశారు. కింద కొండచిలువ కనిపించడంతో వెంటనే అటవీ అధికారులకు సమాచారం అందించారు. బెల్లంపల్లి నుంచి స్నేక్​ క్యాచర్​ దినేశ్​​ను పిలిపించి కొండచిలువను పట్టించారు. అనంతరం  జోగాపూర్​ అటవీ ప్రాంతంలో సురక్షితంగా వదిలిపెట్టారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.