ప్రకృతి ప్రసాదించిన వాటిని నాశనం చేయడం వల్ల తినడానికి మంచి తిండి, తాగడానికి స్వచ్ఛమైన నీళ్లు కరువైనట్టే ఇప్పుడు పీల్చడానికి మంచి గాలి కూడా దొరక్కుండా పోతోంది. ఊపిరాడక ఎన్నో నగరాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. ముఖ్యంగా మన దేశంలోని కొన్ని సిటీల్లో ఎయిర్ పొల్యూషన్ వల్ల లక్షల మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఇంత జరుగుతున్నా.. మార్పు రావడం లేదు. కాలుష్యం స్థాయిలు తగ్గడం లేదు. ముందు ముందు స్వచ్ఛమైన గాలి కొనుక్కోకుండా ఉండాలంటే ఈ పొల్యూషన్‌కు చెక్ పెట్టాల్సిందే.
రాజేష్ ఢిల్లీలో ఉంటున్నాడు. ప్రతి రోజూ హెల్దీ ఫుడ్ తింటాడు. ఉదయం లేవగానే రోడ్డు మీదకి వస్తాడు. రోజంతా ఆఫీసుల చుట్టూ తిరుగుతూ సేల్స్ ఆర్డర్స్ తీసుకురావడం అతని పని. రోజూ రోడ్ల మీద తన బైక్‌ను పరుగెత్తిస్తుంటాడు. ఒకరోజు అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. అతనితో పాటు వాళ్ల కుటుంబం అంతా షాక్ అయ్యారు. ఎందుకంటే అతనిది చాలా హెల్దీ లైఫ్‌స్టయిల్. అయినప్పటికీ గుండెపోటు రావడమేంటి అనుకున్నారు. అయితే.. లైఫ్‌స్టయిల్ హెల్దీగా ఉంటే సరిపోదు. మనచుట్టూ హెల్దీ వాతావరణం కూడా ఉండాలి. ఎయిర్ పొల్యూషన్ వల్లే అతను అనారోగ్యం పాలయ్యాడు. అందువల్లే గుండెపోటు వచ్చి ఉండొచ్చని చెప్పారు డాక్టర్లు.
మన దేశంలో రద్దీగా ఉండే చాలా నగరాల్లో పరిస్థితి ఇదే. ఎయిర్ పొల్యూషన్ వల్ల శ్వాసకోశ సమస్యలే కాకుండా గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్, ఆర్థరైటిస్ లాంటి వ్యాధులు కూడా వచ్చే ప్రమాదం ఉందని శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయి. కొన్ని నెలల క్రితం ఐదవ వార్షిక వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ –2022 విడుదలైంది. దీని ప్రకారం.. మన దేశం ప్రపంచంలో ఎనిమిదో అత్యంత కలుషితమైన దేశంగా నిలిచింది. వార్షిక సగటు పీఎం2.5 ప్రతి క్యూబిక్ మీటరుకు53.3 మైక్రోగ్రాములు ఉంది.
డబ్ల్యూహెచ్‌వో సిఫార్సు చేసిన స్థాయిల కంటే ఇది10 రెట్లు ఎక్కువ. ఇక ఢిల్లీ విషయానికి వస్తే.. ప్రపంచంలోనే నాలుగో అత్యంత కలుషితమైన నగరంగా, రెండో అత్యంత కలుషితమైన రాజధాని నగరంగా ఉంది. ఇక్కడ వార్షిక సగటు పీఎం2.5(ఫైన్ పార్టిక్యులేట్ మ్యాటర్) ప్రతి క్యూబిక్ మీటరుకు 92.6 మైక్రోగ్రాములుగా ఉంది. ఇలా రోజురోజుకూ పెరుగుతున్న ఎయిర్ పొల్యూషన్ ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా మారింది. అంతెందుకు అధిక కాలుష్య స్థాయిలు కొన్ని నగరాల్లో ప్రజల ఆయుష్షుని దాదాపు పదేండ్లు తగ్గిస్తున్నాయి.
ఢిల్లీలో గాలి కాలుష్యం గురించి చాలా రోజుల నుంచి వార్తల్లో వింటూనే ఉన్నాం. కానీ... ఇప్పుడు అదొక్కటే కాదు. దేశంలోని చాలా నగరాల్లో గాలి కాలుష్యం పెరుగుతోంది. ఎంతోమంది అనారోగ్యానికి గురవుతున్నారు. ఈ సమస్య మన దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉంది. గాలి కాలుష్యం వల్ల వరల్డ్ వైడ్‌గా ప్రతి సంవత్సరం సగటున 70 లక్షల మంది చనిపోతున్నారనేది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) అంచనా.
గాలి కాలుష్యం వల్ల స్ట్రోక్, గుండె జబ్బులు, ఊపిరితిత్తుల క్యాన్సర్, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మొనరీ వ్యాధులు, న్యుమోనియా, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. ఇదిలా కొనసాగితే.. ఆర్థిక వ్యవస్థ మీద, ప్రజల క్వాలిటీ ఆఫ్ లైఫ్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ముఖ్యంగా మహిళలు, నవజాత శిశువులు, చిన్న పిల్లల మీద ఆ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ అనర్థాల గురించి డబ్ల్యూహెచ్‌వో ప్రపంచ దేశాలను పదే పదే హెచ్చరిస్తోంది.
ఈ మధ్య మరీ ఎక్కువైంది
మన దగ్గర ఎయిర్ పొల్యూషన్ సమస్య ఎప్పటినుంచో ఉన్నా.. ఈ మధ్య మరీ వేగంగా పెరుగుతోంది. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లోని కొన్ని ప్రధాన నగరాలు కొన్ని వారాలుగా కాలుష్యం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాయి. విషపూరితమైన పొగమంచు నగరాలను కప్పివేస్తోంది. ఢిల్లీ, ముంబైతో పాటు చాలా సిటీలు కాలుష్య నగరాల లిస్ట్‌లో చేరాయి. అంతేకాదు.. అధ్వాన్నమైన ఎయిర్ క్వాలిటీ ఉన్న టాప్ 10 నగరాల్లో 6 రాజస్తాన్‌లోనే ఉన్నాయి.
నవంబర్ 14, 2023న సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సీపీసీబీ) ఇచ్చిన డాటా ప్రకారం.. 242 నగరాల్లో ఎయిర్ క్వాలిటీని చెక్ చేస్తే.. వాటిలో 32 నగరాల్లో ఎయిర్ క్వాలిటీ చాలా అధ్వానంగా ఉందని తేలింది. మరో 64 నగరాల్లో కూడా ఎయిర్ క్వాలిటీ తక్కువగా ఉంది. కాగా106 నగరాల్లో పరిస్థితి కాస్త పర్వాలేదు. మొత్తం 242 నగరాల్లో కేవలం 40 నగరాలు మాత్రమే సేఫ్ జోన్‌లో ఉన్నాయి. అంతేకాదు.. నవంబర్14న ఉదయం 6.30 గంటలకు చెక్ చేసిన రియల్ టైం డాటా ప్రకారం.. రాజస్తాన్‌లోని భరత్‌పూర్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 405గా నమోదై.. ఢిల్లీని దాటేసింది.
అంటే దేశంలో అత్యంత కాలుష్య నగరం అన్నమాట. ఆ తర్వాత స్థానాల్లో ఎక్యూఐ 404తో చురు, ధోల్‌పూర్‌లు ఉన్నాయి. ఇవి కూడా రాజస్తాన్‌లోనే ఉన్నాయి. దీన్నిబట్టి ఢిల్లీతోపాటు చాలా నగరాల్లో ఎయిర్ పొల్యూషన్ విపరీతంగా ఉన్నట్టు అర్ధమవుతోంది. కానీ ఎక్కువ జనాభా ఉన్న సిటీ, పెద్ద నగరం, దేశ రాజధాని కావడం వల్ల ఢిల్లీ గురించి వార్తల్లో ఎక్కువగా వింటుంటాం.
సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ డాటా బట్టి గత కొన్ని వారాలుగా ఇండో–-గంగా మైదానంలోని చాలా నగరాల్లో గాలి నాణ్యత తగ్గుతూ వస్తోంది. దాంతోపాటు ఈ మధ్యే దీపావళి పండుగ రావడంతో కాలుష్యం మరింత పెరిగింది. పండుగ రోజు కాల్చిన టపాసుల నుంచి వెలువడిన కలుషితాలు, చెత్తను కాల్చడం ద్వారా వచ్చిన కలుషితాలు గాల్లోకి చేరి ఎయిర్ క్వాలిటీని మరింత దెబ్బతీశాయి.
ఢిల్లీలో పరిస్థితి
దీపావళికి ముందు ఢిల్లీలో వర్షం కురవడం వల్ల ఎయిర్ పొల్యూషన్ కాస్త తగ్గింది. కానీ.. మళ్లీ దీపావళి ఉత్సవాలతో కథ మొదటికి వచ్చేసింది. దీపావళి మరుసటి రోజు నుంచే ఢిల్లీని పొగమంచు దట్టంగా ఆవరించింది. ఎయిర్ క్వాలిటీ విపరీతంగా తగ్గింది. ఢిల్లీలో సగటు ఏక్యూఐ కాస్త తక్కువగా ఉన్నా కొన్ని ప్రాంతాల్లో మాత్రం పొల్యూషన్ చాలా ఎక్కువగా నమోదైంది. సిటీలోని చాలా ప్రాంతాల్లో కాలుష్య స్థాయిలు 400కు పైగా ఉన్నాయి.
రెండేళ్లుగా ఢిల్లీలో పీఎం2.5 కాలుష్యం బాగా పెరిగింది. అక్టోబర్ 2021లో చూసినప్పుడు దీని గాఢత 74.0 μg/m3గా ఉంది. అదే అక్టోబర్ 2023 నాటికి సుమారుగా 54% పెరిగి 113.9 μg/m3కి చేరుకుంది. ఈ లెవల్స్ కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, ప్రపంచ కాలుష్య నియంత్రణ మండలి సూచించిన సేఫ్టీ పరిమితుల కంటే చాలా ఎక్కువ.
ముంబైలో కూడా..
ముంబైలో గాలి నాణ్యత కూడా రోజురోజుకూ క్షీణిస్తోంది. ముంబై పీఎం 2.5 స్థాయిలు 2019 అక్టోబర్‌లో మీటర్ క్యూబ్ కు 27.7 మైక్రో గ్రాములు గా ఉన్నాయి. సరిగ్గా నాలుగేండ్ల తర్వాత చూస్తే.. మీటర్ క్యూబ్ కు 58.3 మైక్రో గ్రాముల వరకు పెరిగింది.అంటే.. 110% పెరిగాయి.
మన దగ్గరా అంతే..
హైదరాబాద్, కోల్‌కతాలో కూడా ఎయిర్ పొల్యూషన్ పెరుగుతోంది. 2022తో పోలిస్తే.. 2023లో పీఎం 2.5 స్థాయిల్లో18.6 శాతం పెరుగుదల కనిపించింది. కోల్‌కతాలో 40.2 శాతం పెరుగుదల నమోదైంది.
హైదరాబాద్‌లో ఇతర పెద్ద నగరాలతో పోలిస్తే.. ఎయిర్ పొల్యూషన్ కాస్త తక్కువగానే ఉంటుంది. కానీ.. దీపావళి సంబరాల వల్ల రాత్రికి రాత్రే హైదరాబాద్‌లో గాలి నాణ్యత తగ్గిందని ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ప్రకారం.. సిటీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పండుగ తర్వాత171గా ఉంది. సగటు ఇండెక్స్ తక్కువగానే ఉన్నా కొన్ని ప్రాంతాల్లో మాత్రం చాలా ఎక్కువగా నమోదైంది.
తగ్గుతున్న ఆయుర్దాయం
తెలంగాణలో పెరుగుతున్న వాయు కాలుష్య స్థాయిలు ప్రజల ఆయుర్దాయాన్ని కూడా తగ్గిస్తున్నాయి. చికాగో యూనిర్సిటీలోని ఎనర్జీ పాలసీ ఇనిస్టిట్యూట్ ఇచ్చిన ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ నివేదిక ప్రకారం.. తెలంగాణలో ప్రజల ఆయుర్దాయం3.2 ఏండ్లు తగ్గే ప్రమాదం ఉందని తేలింది. మన దగ్గరే ఇలా ఉంటే మరి ఢిల్లీ పరిస్థితి ఏంటి అంటారా? అక్కడివాళ్ల ఆయుర్దాయం 11.9 ఏండ్లకు పైగా తగ్గే అవకాశం ఉందంటున్నారు ఎక్స్‌పర్ట్స్. అయితే.. దక్షిణ భారత దేశంలో మాత్రం ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణలోనే ఎక్కువ పొల్యూషన్ ఉన్నట్టు తెలిసింది. రాష్ట్ర వార్షిక సగటు పీఎం 2.5 స్థాయిలు 38.2కి చేరుకున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇది ఐదుకి మించకూడదని నిర్ణయించింది. అంటే మన దగ్గర చాలా ఎక్కువగా ఉంది.
హైదరాబాద్ చుట్టుపక్కల
హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో కొన్నేండ్ల నుంచి ఎయిర్ పొల్యూషన్ సమస్య వేధిస్తూనే ఉంది. గాలి మాత్రమే కాదు.. భూమిలోని నీళ్లు కూడ కలుషితం అవుతున్నాయి.హైదరాబాద్ శివారులోని పాశమైలారం, పటాన్ చెరు, బొల్లారం, జీడిమెట్ల, నాచారం, బాలానగర్, కాటేదాన్.. లాంటి పారిశ్రామిక వాడల్లో ఎప్పుడూ ఘాటు వాసనలు వస్తుంటాయి. అయితే.. ఈ ప్రాంతాలన్నీ ఒకప్పుడు సిటీకి చాలా దూరంగా ఉండేవి. కానీ.. సిటీ విస్తరిస్తుండడంతో అవి కూడా సిటీలో భాగంగా మారిపోయాయి. అక్కడి పరిశ్రమల నుంచి వచ్చే వాసనలు, పొగతో గాలి కలుషితం అవుతోంది. ఆ గాలినే అక్కడివాళ్లు పీల్చుకుంటున్నారు. దీనిపై పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు కంప్లయింట్ కూడా ఇచ్చారు స్థానికులు.
డయాబెటిస్ వస్తుందా?
షుగర్ ఎలా వస్తుందంటే ఏ డాక్టరైనా ఏంచెప్తారు? అందరూ దీనికి ముఖ్య కారణం లైఫ్‌స్టయిల్ అనే చెప్తారు. కానీ.. పొల్యూషన్ వల్ల కూడా చక్కెర వ్యాధి బారిన పడతారట. కలుషితమైన గాలిని పీల్చడం వల్ల టైప్ –2 డయాబెటిస్ వచ్చే ప్రమాదాలు పెరుగుతాయని ఇండియాలో చేసిన ఒక స్టడీలో వెల్లడైంది. ఈ విషయాన్ని బీఎంజే ఓపెన్ డయాబెటిస్ రీసెర్చ్ అండ్ కేర్ జర్నల్‌లో ప్రచురించారు. ఈ విషయాన్ని దాదాపు ఏడేండ్ల పాటు చెన్నై, ఢిల్లీలోని 12,000 మంది పెద్దలపై రీసెర్చ్ చేశారు.
వాళ్ల రక్తంలో షుగర్ లెవల్స్‌ని అప్పుడప్పుడు చెక్ చేశారు. కాలుష్యం స్థాయిలను తెలుసుకోవడం కోసం శాటిలైట్ బేస్‌డ్ హైబ్రిడ్ ఎక్స్‌పోజర్ మోడల్‌ని ఇందులో ఉపయోగించారు. ఈ స్టడీ చేస్తున్నప్పుడు ప్రతి రోజు ఢిల్లీ, చెన్నైల్లోని రోజువారీ సగటు పీఎం2.5 సాంద్రతలను రికార్డ్ చేశారు. ఈ రీసెర్చ్ ప్రకారం.. గాలి కాలుష్యం వల్ల పట్టణ ప్రాంతాల్లో షుగర్ బాధితులు సంఖ్య రెట్టింపు అయిందని తేలింది. ఈ రీసెర్చ్‌లో ఎక్కువకాలం కలుషిత ప్రాంతాల్లో నివసించే వాళ్ల శరీరంలో మిగిలిన వారికంటే 20 నుండి 22 శాతం ఎక్కువ షుగర్ లెవల్స్ ఉన్నట్టు గుర్తించారు.
పసికందులకూ ప్రమాదమే!
అప్పుడే పుట్టిన పిల్లలు చాలా సున్నితంగా ఉంటారు. అందుకే శిశువు పుట్టిన మొదటి ఆరు నెలల్లో గాలి కాలుష్యానికి గురయితే.. పిల్లల పేగుల్లోని బ్యాక్టీరియాపై ఎఫెక్ట్ పడుతుంది. దానివల్ల అలర్జీలు, ఊబకాయం, డయాబెటిస్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఆ ప్రభావం మెదడు మీద కూడా ఉంటుంది. ఈ విషయం అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో బౌల్డర్ చేసిన రీసెర్చ్‌లో తెలిసింది. పుట్టినప్పుడు పిల్లల పేగుల్లో బ్యాక్టీరియా చాలా తక్కువగా ఉంటుంది.
తర్వాత మొదటి రెండు నుండి మూడు ఏండ్లలో తల్లి పాలు, ఘనాహారం, యాంటీబయాటిక్స్, ఎన్విరాన్‌మెంట్ ఎఫెక్ట్స్ వల్ల బ్యాక్టీరియా డెవలప్‌మెంట్ జరుగుతుంది. వాటి వల్లే జీవక్రియలు జరుగుతాయి. అవి జీర్ణాశయంలోని ఆహారం, రసాయనాలను విచ్ఛిన్నం చేయడంలో సాయం చేస్తాయి. ఇన్సులిన్ సెన్సిటివిటీ, రోగనిరోధక శక్తి, మానసిక స్థితి.. ఇలాంటి అనేక వ్యవస్థలను ప్రభావితం చేస్తాయి. అయితే.. గాలి కాలుష్యానికి గురైన పిల్లల్లో మాత్రం మంచి బ్యాక్టీరియా తక్కువగా డెవలప్ అయ్యిందన్నారు రీసెర్చర్లు.
లంగ్ క్యాన్సర్
గాలి కాలుష్యం వల్ల లంగ్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని ఒక పరిశోధనలో తేలింది. ప్రపంచవ్యాప్తంగా చాలామందికి పొగ తాగకుండానే లంగ్ క్యాన్సర్ వస్తుంటుంది. దానికి కారణం గాలి కాలుష్యమేనని ఎక్స్‌పర్ట్స్ చెప్తున్నారు. వయసు పెరిగే కొద్దీ శరీర కణాల్లో క్యాన్సర్‌కు కారణమయ్యే మార్పులు జరగడం మామూలే. కానీ.. అవి ఎప్పుడూ నిద్రాణ స్థితిలో ఉంటాయి. గాలి కాలుష్యం వల్ల ఊపిరితిత్తుల్లో ఉండే ఇలాంటి కణాలు యాక్టివ్ అవుతాయి. దాంతో క్యాన్సర్‌కు దారి తీస్తుంది. ఈ విషయాన్ని లండన్‌లోని ఫ్రాన్సిస్ క్రిక్ ఇన్‌స్టిట్యూట్ రీసెర్చర్లు చెప్పారు.
పొగ తాగని వారికి కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్ ఎందుకు వస్తోంది? అనే విషయాన్ని తెలుసుకునేందుకు ఈ రీసెర్చర్లు పరిశోధనలు చేశారు. 2020లో ప్రపంచవ్యాప్తంగా సుమారు 18 లక్షల మంది ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో చనిపోయినట్లు డబ్ల్యూహెచ్‌ఓ లెక్కలు చెప్తున్నాయి. వాళ్లలో కొంతమందికి స్మోకింగ్ అలవాటు లేదు. వాళ్లంతా గాలి కాలుష్యం వల్లే క్యాన్సర్ బారిన పడ్డారు. కాలుష్యమైన గాలిలో ఉండే పీఎం 2.5 కణాలు ఊపిరితిత్తుల్లో ఇంటర్‌ల్యుకిన్–1 బీటా అనే సైటోకిన్ విడుదల అవుతుంది.
దాంతో ఇన్‌ఫ్లమేషన్ మొదలవుతుంది. ఆ తర్వాత ఆ డ్యామేజ్‌ను నివారించేందుకు ఊపిరితిత్తుల్లోని కణాలు యాక్టివేట్ అవుతాయి. యాభై ఏండ్ల వ్యక్తుల్లో ప్రతి ఆరు లక్షల కణాల్లో ఒక కణం, క్యాన్సర్ కారక మ్యుటేషన్లను కలిగి ఉంటుంది. ఎప్పుడూ నిద్రాణంగా ఉండే ఆ కణాలు యాక్టివేట్ కావడం వల్ల గడ్డలు ఏర్పడతాయి.
అనేక సమస్యలు
పీఎం 2.5 ఎక్కువగా ఉన్న గాలిని పీల్చడం వల్ల ఆస్తమా లాంటి సమస్యలు వస్తాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు చాలా రకాల దీర్ఘకాలిక వ్యాధులు వచ్చేందుకు కారణం అవుతుంది అంటున్నారు. ఇక షుగర్, శ్వాసకోశ వ్యాధులు, గుండె సమస్యలతో బాధపడుతున్న వాళ్లపై ఎయిర్ పొల్యూషన్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. రక్తనాళాలు దెబ్బతినే ప్రమాదం కూడా ఉంది. కొందరిలో పేగుల్లోని మంచి బ్యాక్టీరియా తగ్గిపోయే ప్రమాదం ఉంది.
గుండెపోటు
గాలి కాలుష్యం గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. పీఎం2.5 కణాల వల్ల గుండె కొట్టుకునే వేగంలో మార్పులు, కార్డియాక్ ఇస్కీమియా లాంటి సమస్యలు తలెత్తుతాయి. కళ్లు, ముక్కు, గొంతు, ఊపిరితిత్తుల్లో చికాకుతో పాటు దగ్గు, తుమ్ములు పెరుగుతాయి.
* * *
గాలి కాలుష్యం అంటే ఏంటి?
ప్రాణులకు హాని చేసే విషవాయువులు గాలిలో కలవడాన్నే గాలి కాలుష్యం అంటారు. ఇది కొన్నిసార్లు కంటికి కనిపిస్తుంది. కొన్నిసార్లు కనిపించకపోవచ్చు. అయితే.. ముఖ్యంగా అమ్మోనియా, సల్ఫర్ డయాక్సైడ్ , నైట్రోజన్ ఆక్సైడ్లు, కార్బన్ డై ఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, మీథేన్, క్లోరోఫ్లోరోకార్బన్ లాంటివి గాలిలో కలిసి కలుషితం చేస్తున్నాయి. ఇవి వ్యవసాయం, పరిశ్రమలు, పవర్ ప్లాంట్లు, ఇండ్లు, గృహోపకరణాలు, వెహికల్స్.. లాంటివాటివల్ల గాలిలో కలుస్తున్నాయి.
ఫాజిల్ ఫ్యూయెల్స్
థర్మల్ పవర్ తయారుచేసేందుకు కొన్ని రకాల ఫ్యాక్టరీల్లో బొగ్గుని మండిస్తారు. దానివల్ల సల్ఫర్ డయాక్సైడ్ లాంటి ప్రమాదకరమైన వాయువులు వాతావరణంలో కలుస్తాయి. కొన్ని పవర్ ప్లాంట్లలో పెట్రోలియంని కూడా మండిస్తుంటారు. ఇలాంటి వాటి వల్ల గాలి విపరీతంగా కాలుష్యం అయిపోతుంది. రోడ్లపై నడిచే లక్షల కార్లు, ట్రక్కుల్లో వాడే డీజిల్ మండడం వల్ల కూడా గాలి కలుషితం అవుతుంది. అంతెందుకు బైక్ నుంచి విమానం వరకు ఏ ఇంజిన్ నడవాలన్నా ఏదో ఒక ఫ్యుయెల్ కావాలి. ఏ ఫ్యూయెల్ మండినా గాలి కాలుష్యం జరుగుతుంది. ఫ్యుయెల్స్ వల్ల ముఖ్యంగా కార్బన్ మోనాక్సైడ్ లాంటివి ఎక్కువగా గాలిలో కలుస్తాయి. బొగ్గును కాల్చే విద్యుత్ ప్లాంట్లు, డీజిల్ జనరేటర్లు, రసాయన, మైనింగ్ పరిశ్రమల్లో వాడే ఫ్యూయెల్స్ కూడా వాతవరణాన్ని కలుషితం చేస్తున్నాయి.
ఇండోర్ బర్నింగ్
ఇంటి నుంచి గాలి కాలుష్యం ఎలా అవుతుంది? కాలుష్యాన్ని విడుదలచేసే రసాయనాలు ఏమీ వాడం కదా అనుకోవచ్చు. కానీ వంట చేయడానికి ఫాజిల్ ఫ్యూయెల్స్, కలప, ఇతర బయోమాస్ బేస్‌డ్ ఫ్యూయల్స్‌ని వాడి మంట పెడుతుంటారు. ఇవన్నీ గాలి కాలుష్యానికి ఎంతోకొంత కారణం అవుతాయి. అంతేకాదు.. ప్రతి ఏడాది ఇండోర్ ఎయిర్ పొల్యూషన్ వల్ల ప్రపంచవ్యాప్తంగా దాదాపు 38 లక్షల మంది చనిపోతున్నట్టు ఎక్స్‌పర్ట్స్ అంచనా. ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏంటంటే. ఇండోర్ బర్నింగ్ వల్ల చనిపోయేవాళ్లలో ఎక్కువమంది అభివృద్ధి చెందిన దేశాల్లోనే ఉన్నారు.
వ్యవసాయం
వ్యవసాయ గాలి కాలుష్యం ప్రధానంగా అమ్మోనియా (NH 3 ) రూపంలో జరుగుతుంది. పొలాలు, పశువుల వ్యర్థాల నుంచి గాలిలో చేరుతుంది. పరిశ్రమల నుండి వచ్చే నైట్రోజన్, సల్ఫర్ ఆక్సైడ్స్ ఉద్గారాలతో చర్య జరుపుతుంది. దాని వల్ల చాలా ప్రమాదం జరుగుతుంది. యూరప్‌లో ఇలా ఏర్పడిన కాలుష్యం పీఎం 2.5 లో 55 శాతం ఉంటుంది. అమెరికాలో కూడా సగం వరకు గాలి కాలుష్యం ఇలానే జరుగుతుంది. కానీ.. మన దేశంలో మాత్రం ఇది కాస్త వేరుగా ఉంది.
వ్యవసాయం వల్ల గాలి కాలుష్యం జరిగే తక్కువ దేశాల్లో మనది కూడా ఒకటి.
తగలబెట్టడం: ఇదివరకు వరి కర్రలను కిందివరకు కోసి కుప్పగా వేసి, పశువులతో తొక్కించి వడ్లు తీసేవాళ్లు. ఇప్పుడు టెక్నాలజీ పెరగడంతో మెషిన్లతోనే కోస్తున్నారు. అలా కోయడం వల్ల వరి కర్రలు సగంలోనే కట్ అవుతాయి. దాంతో మిగిలిన కర్రలను రైతులు పొలాల్లోనే కాల్చేస్తున్నారు. ఇది కూడా కాలుష్యం పెరగడానికి కారణం అవుతోంది.
చెత్త నుంచి మీథేన్
సిటీల్లో చెత్తను సేకరించి ఒక చోట డంప్ చేస్తుంటారు. అలాంటి వ్యర్థాల నుంచి మీథేన్ గ్యాస్ విడుదల అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా 40 శాతం వ్యర్థాలను బహిరంగంగా కాల్చేస్తున్నారని అంచనా. దానివల్ల కూడా గాలి కాలుష్యం జరుగుతుంది. పట్టణాలు, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ సమస్య చాలా తీవ్రంగా ఉంది. వ్యవసాయ, మునిసిపల్ వ్యర్థాలను బహిరంగంగా కాల్చడం ఇప్పటికీ166 దేశాల్లో ఉంది.
ఇండస్ట్రియల్ డస్ట్
ఇండస్ట్రీల నుంచి కార్బన్ మోనాక్సైడ్, హైడ్రోకార్బన్లు, రసాయనాలు గాలిలోకి విడుదల కావడం కూడా గాలి కాలుష్యానికి కారణమే. ముఖ్యంగా తయారీ పరిశ్రమల వల్ల గాలి నాణ్యత తగ్గుతోంది.
మైనింగ్ ఆపరేషన్
ఖనిజాల కోసం చేసే పెద్ద పెద్ద మైనింగ్‌లు కూడా పొల్యూషన్ కారకాలే. ముఖ్యంగా మైనింగ్ కోసం పెద్ద పెద్ద యంత్రాలు, రసాయనాలు వాడడం వల్ల గాలి కాలుష్యం అవుతుంది. ముఖ్యంగా మైనింగ్ టైంలో ధూళి గాలిలోకి విడుదల అవుతుంది. దీనివల్ల ఆ చుట్టుపక్కల ఉండే జనాభా, కార్మికుల ఆరోగ్యం దెబ్బతింటుంది.
తుఫానులు
గాలి కాలుష్యం కేవలం మనిషి చేసిన తప్పుల వల్లే కాదు.. ప్రకృతి వల్ల కూడా అంటే... అగ్నిపర్వత విస్ఫోటనాలు, దుమ్ము తుఫానుల లాంటి వాటి వల్ల కూడా జరుగుతుంది. ఈ తుఫానుల వల్ల సూక్ష్మ కణాలు వేల మైళ్ల దూరం ప్రయాణిస్తాయి. ఇవి వ్యాధికారకాలను, హానికరమైన పదార్థాలను కూడా తీసుకెళ్తాయి. దీనివల్ల దీర్ఘకాలిక శ్వాసకోశ సమస్యలు వస్తాయి.
ఏం జరుగుతుంది?
గాలి కాలుష్యం వల్ల మనుషుల ఆరోగ్యానికే కాదు.. ప్రకృతి ఆరోగ్యానికి ముప్పు తప్పదు అంటున్నారు పర్యావరణవేత్తలు. గాలి కాలుష్యం ప్రకృతి మీద చాలా రకాలుగా ప్రభావం చూపిస్తుంది.
గ్లోబల్ వార్మింగ్
ఇప్పుడు మనుషుల ముందున్న ప్రధాన సమస్య గ్లోబల్ వార్మింగ్. దీని వల్ల మనుషులతో పాటు సమస్త జీవరాశికి ఇబ్బంది కలుగుతోంది. భూమి వేడెక్కడం వల్ల అకాల వర్షాలు, మహాసముద్రాల్లో మంచు కరగడం, సముద్ర మట్టాలు, ఉష్ణోగ్రతలు పెరగడం లాంటి ప్రకృతి విపత్తులు ఎన్నో వస్తున్నాయి. వీటన్నింటికీ పరోక్షంగా గాలి కాలుష్యం కూడా కారణమే. ఎందుకంటే.. భూమి వేడెక్కడంలో గాలి కాలుష్య పాత్ర కూడా ఎంతో ఉంది.
ఆమ్ల వర్షం
ఫాజిల్ ఫ్యూయెల్స్(శిలాజ ఇంధనం)ని కాల్చినప్పుడు సల్ఫర్ ఆక్సైడ్లు, నైట్రోజన్ ఆక్సైడ్లు లాంటి ప్రమాదకరమైన పదార్థాలు వాతావరణంలోకి విడుదలవుతాయి. వర్షం పడినప్పుడు, నీటి బిందువులు గాలిలోని ఆ కాలుష్య కారకాలతో చర్య జరిపి ఆమ్లాన్ని విడుదల చేస్తాయి. తర్వాత అది ఆమ్ల వర్షంగా భూమిపై పడుతుంది. దాని ప్రభావం మనుషుల మీదే కాదు.. జంతువులు, వ్యవసాయం మీద కూడా పడుతుంది.
యూట్రోఫికేషన్
యూట్రోఫికేషన్ అంటే.. కొన్ని కాలుష్య కారకాల్లో ఉన్న నైట్రోజన్ పెద్ద మొత్తంలో సముద్ర ఉపరితలంపై పేరుకుపోయి, ఆల్గేగా మారి, చేపలు, మొక్కలు, ఇతర జీవ జాతులకు హాని కలిగించడమే. ఇండస్ట్రీల ద్వారా వాతావరణంలోకి ఈ రసాయనం విడుదల అవుతుంది. దానివల్ల సరస్సులు, చెరువుల్లో ఆకుపచ్చ ఆల్గే పెరుగుతుంది.
ఓజోన్ పొర
భూమి స్ట్రాటో ఆవరణలో ఓజోన్ ఉంటుంది. ఇది జీవులకు హాని కలిగించే అతినీలలోహిత (యూవీ) కిరణాల రేడియేషన్ నుంచి కాపాడుతుంది. వాతావరణంలో హైడ్రో క్లోరోఫ్లోరో కార్బన్‌లు, క్లోరోఫ్లోరో కార్బన్‌లు పెరగడం వల్ల ఓజోన్ పొర క్షీణిస్తోంది. ఓజోన్ పొర సన్నబడినప్పుడు లేదా దెబ్బతిన్నప్పుడు యూవీ కిరణాలు భూమి పైకి నేరుగా పడతాయి. దీని వల్ల చర్మ, కంటి సమస్యలు వస్తుంటాయి. యూవీ రేడియేషన్ వల్ల పంటలు కూడా దెబ్బతింటాయి.
ఏం చేస్తే తగ్గుతుంది?
గాలి కాలుష్యం తగ్గడానికి ప్రత్యేకంగా ఏమీ చేయనక్కర్లేదు. ఎలాంటి పనుల వల్ల కాలుష్యం పెరుగుతుందో తెలుసుకుని ఆ పనులు మానేస్తే చాలు.
పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్
గాలి కాలుష్యానికి ప్రధాన కారణాల్లో వెహికల్స్ నుంచే వచ్చే పొగ ఒకటి. అందుకే వెహికల్స్ వాడకం తగ్గించాలి. ఇంట్లో ఉన్న నలుగురు నాలుగు వెహికల్స్ వాడకుండా పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్ వాడడం బెటర్. ఒక్క వ్యక్తి కోసం ఒక కారు వాడడం వల్ల ఫ్యుయెల్ వాడకం చాలా వరకు పెరుగుతుంది. అందువల్ల ఒక్కరే వెళ్లాల్సి వచ్చినప్పుడు పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్ వాడుకోవాలి. పైగా ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి. వీలైనంత వరకు వాటిని వాడేందుకు ట్రై చేయాలి.
లైట్లు ఆఫ్ చేయాలి
విద్యుత్తు వినియోగం తగ్గించడం వల్ల కూడా పర్యావరణానికి మేలు చేసిన వాళ్లం అవుతాం. ఎందుకంటే.. ఎలక్ట్రిసిటీ తయారు చేయడానికి ప్రపంచవ్యాప్తంగా పెద్ద మొత్తంలో బొగ్గుని కాల్చాల్సి వస్తుంది. కాబట్టి ఎలక్ట్రానిక్ వస్తువులు, లైట్లు అవసరం లేనప్పుడు ఆఫ్ చేసి పెట్టుకోవాలి.
కాల్చడం తగ్గించాలి
చెత్తను కాల్చడం కూడా గాలి కాలుష్యానికి ముఖ్యమైన కారణమే. సిగరెట్లు తాగడం వల్ల కూడా గాలి కాలుష్యం అవుతుంది. కాబట్టి వీలైనంత వరకు ప్రకృతికి హాని కలగని విధానాల్లోనే చెత్తను రీసైకిల్ చేయాలి. సిగరెట్లు తాగడం మానేయాలి.
టపాసులు తక్కువగా
టపాసులు కాల్చడం వల్ల పెద్దగా ఎఫెక్ట్ ఉండదని చాలామంది అనుకుంటారు. కానీ.. దాని ప్రభావం చాలానే ఉంటుంది. ఈ మధ్య దీపావళి పండుగ రోజు దేశవ్యాప్తంగా చాలా సిటీల్లో ఒక్కసారిగా ఎయిర్ పొల్యూషన్ పెరిగింది. కాబట్టి దీపావళి పండుగను టపాసుల శబ్దాలతో కాకుండా వెలుగుల పండుగగా చేసుకుంటే బాగుంటుంది. టపాసులు కాల్చడం వీలైనంత వరకు తగ్గించుకోవాలి. కాల్చాలి అనుకునేవాళ్లు పర్యావరణంపై వీలైనంత తక్కువ ఎఫెక్ట్ చూపించే క్రాకర్స్ కాల్చాలి. వీలైతే పర్యావరణానికి హాని చేయని గ్రీన్ క్రాకర్స్ వాడాలి.
ఢిల్లీలోని ఐటీవో ప్రాంతంలో ఏక్యూఐ 427, ఆర్కే పురంలో 422 , పంజాబీ బాగ్‌లో 432, ఐజీఐ విమానాశ్రయం దగ్గర 404, ద్వారకాలో 416, పట్‌పర్‌గంజ్‌లో 400, 417), సోనియా విహార్‌లో 413, రోహిణిలో 421, నెహ్రూ నగర్‌లో 434, ఆనంద్ విహార్‌లో 430గా నమోదైంది.
పీఎం 2.5 అంటే ఏంటి?
గాలి కాలుష్యం గురించి విన్నప్పుడల్లా పీఎం 2.5 గురించి వింటుంటాం. పీఎం అంటే.. పార్టిక్యులేట్ మ్యాటర్. 2.5 అంటే గాలిలో ఉండే సూక్ష్మ కణాల వ్యాసం 2.5 మైక్రోమీటర్లు లేదా అంతకంటే తక్కువగా ఉంది అని అర్థం. అంటే ఒక మీటర్ క్యూబ్ గాలిలో ఉండే 2.5 మైక్రో మీటర్లు లేదా అంతకంటే తక్కువ వ్యాసం ఉన్న కణాల గాఢత ఎంత ఉందో చెప్పేదే ఈ లెక్క. ఈ కణాలు ఆరోగ్యానికి చాలా హాని చేస్తాయి. ఇవి ముఖ్యంగా గుండె, ఊపిరితిత్తులు, శ్వాసనాళాల మీద ఎఫెక్ట్ చూపిస్తాయి.
ఏక్యూఐ ఎంత ఉంటే బెటర్?
0– 50 సేఫ్
51 –100 శాటిస్‌ఫ్యాక్టరీ
101 –200 మోడరేట్
201 –300 పూర్
301 – 400 వెరీ పూర్
401 – 450 సివియర్
450 కంటే ఎక్కువ ఉంటే సివియర్ ప్లస్
హైద్రాబాద్ లోని పదిహేను పొల్యూషన్ చెకింగ్ పాయింట్లలో.. యూఎస్ కాన్సులేట్ స్టేషన్‌లో అత్యధిక ఏక్యూఐ 341గా నమోదైంది. ఇదే అన్ని ప్రాంతాల కంటే అత్యంత అనారోగ్యకరమైన గాలి ఉన్న ప్రాంతం. కెపిహెచ్‌బి (237), జూ పార్క్ (213), న్యూ మలక్‌పేట్ (197), సోమాజిగూడ (177), సైదాబాద్ (170), కోటి (160), బంజారాహిల్స్ (107)లో నమోదయ్యాయి. కోకాపేట్ ప్రాంతంలో మాత్రం 30 ఏఐక్యూతో తక్కువ కాలుష్యం ఉంది.
మకాం మార్చిన సోనియా
గాలి కాలుష్యం వల్ల ఎంతోమంది ఇబ్బందులకు గురవుతుంటారు. చివరికి కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సోనియా గాంధీ కూడా గాలి కాలుష్యాన్ని తట్టుకోలేక ఢిల్లీ నుంచి తన మకాం మార్చారు. తాత్కాలికంగా కొన్ని రోజుల పాటు రాజస్తాన్‌లోని జైపూర్‌లో ఉండాలని డిసైడ్ అయ్యారు. సోనియా గాంధీతోపాటు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా జైపూర్‌కు వెళ్లిపోయారు. సోనియాగాంధీకి డాక్టర్లు ఇచ్చిన సలహా వల్లే ఆమె ఢిల్లీ నుంచి జైపూర్‌కు మారారని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ చెప్పారు. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు. గాలి కాలుష్యం ఎఫెక్ట్ ఎంతలా ఉంటుందో అని.
రంగు మారుతోంది!
ఆగ్రాలో ఉన్న తాజ్ మహల్ నుంచి హైదరాబాద్‌లో ఉన్న చార్మినార్ వరకు దేశంలోని ఎన్నో చారిత్రక కట్టడాలు గాలి కాలుష్యం వల్ల రంగు మారాయి. గాలి కాలుష్యం వల్ల తెల్లని తాజ్‌మహల్ కాస్త పసుపు రంగులోకి మారింది. అయితే.. ప్రభుత్వాలు వీటి కోసం ప్రత్యేకంగా కొన్ని చర్యలు తీసుకుంటున్నాయి. మన దగ్గర కూడా చార్మినార్ నల్లని పొర ఏర్పడటంతో చుట్టూ 300 మీటర్ల వరకు వెహికల్స్ తిరగడానికి అనుమతించడంలేదు.