న్యూఢిల్లీ: హోటళ్లు, లగ్జరీ బ్రాండ్ విక్రయాలు, ఆసుపత్రులు, ఐవీఎఫ్ క్లినిక్‌లు వంటి వ్యాపార రంగాల్లో జరుగుతున్న భారీ నగదు లావాదేవీలను తనిఖీ చేయాలని సీబీడీటీ, ఐటీ డిపార్ట్‌మెంట్‌ని కోరింది. రూ.రెండు లక్షలకు పైగా నగదు రూపంలో జరిగే లావాదేవీలను ఆర్థిక సంస్థలు ఆర్థిక లావాదేవీల స్టేట్‌మెంట్ (ఎస్ఎఫ్టీ) ద్వారా వెల్లడించాలని ఆదేశించినా, పెద్దగా ఫలితం కనిపించడం లేదని బోర్డు ఐటీ విభాగానికి తెలిపింది.
హోటళ్లు, బాంక్వెట్ హాళ్లు, లగ్జరీ బ్రాండ్ రిటైలర్లు, ఐవీఎఫ్ క్లినిక్‌లు, ఆసుపత్రులు, డిజైనర్ బట్టల దుకాణాలు, ఎన్‌ఆర్‌ఐ కోటా మెడికల్ కాలేజీ సీట్ల వంటి కొన్ని వ్యాపారాలను డిపార్ట్‌మెంట్ గుర్తించింది. వీటిలో పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలు జరుగుతున్నాయని గ్రహించింది. ఈ లావాదేవీల గురించి తెలుసుకోవాలని ఐటీశాఖకు సూచించింది. 2023–-24 ఆర్థిక సంవత్సరంలో పన్ను ఎగవేతలను తనిఖీ చేసేందుకు పన్ను శాఖ దేశవ్యాప్తంగా 1,100 సోదాలు నిర్వహించింది. ఫలితంగా దాదాపు రూ. రూ. 2,500 కోట్ల ఎగవేతలను గుర్తించింది.