CBI arrests Kejriwal : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ట్విస్ట్..కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసిన సీబీఐ

CBI arrests Kejriwal : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ట్విస్ట్..కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసిన సీబీఐ

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను తీహార్ జైలు నుంచి సీబీఐ అరెస్ట్ చేసింది. తీహార్ జైలులో ఉన్న అరవింద్ కేజ్రీవాల్‌ను సీబీఐ సోమవారం విచారించి ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించిన వాంగ్మూలాన్ని నమోదు చేసింది. రేపు  (జూన్ 26) సంబంధిత ట్రయల్ కోర్టులో అరవింద్ కేజ్రీవాల్‌ను హాజరుపరిచేందుకు సీబీఐకి అనుమతి లభించింది. రేపు (బుధవారం) కోర్టులో హాజరుపరచ నున్నారు.

కేజ్రీవాల్‌కి హైకోర్టు షాక్ 

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్  లో అరవింద్ కేజ్రీవాల్‌కి ఢిల్లీ హైకోర్టు షాకిచ్చింది. కింది కోర్టు ఇచ్చిన బెయిల్‌పై స్టే విధించింది. విచారణ సందర్భంగా హైకోర్టు రూస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన బెయిల్ అసమంజసమైనదిగా పేర్కొంది. హైకోర్టు నిర్ణయంపై ఆప్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 

 ఏంటీ ఎక్సైజ్ స్కాం?

నవంబర్ 17, 2021న కొత్త ఎక్సైజ్ పాలసీని అమలు చేయడం ద్వారా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుతామని ఢిల్లీ ప్రభుత్వం పేర్కొంది. జూలై 2022లో అప్పటి ఢిల్లీ చీఫ్ సెక్రటరీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు ఎక్సైజ్ పాలసీలో అవకతవకలకు సంబంధించి నివేదిక సమర్పించారు.

ఎల్జీ విచారణకు సిఫారసు 

చీఫ్ సెక్రటరీ నివేదిక ఆధారంగా కొత్త ఎక్సైజ్ పాలసీ (2021-22) అమలులో నిబంధనల ఉల్లంఘనలు , విధానపరమైన లోపాలను ఉన్నాయని లెఫ్టినెంట్ గవర్నర్ 2022 జూలై 22న సీబీఐ విచారణకు సిఫారసు చేశారు. సీబీఐ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. దర్యాప్తును సిఫార్సు చేసిన తర్వాత, జూలై 30, 2022న, ఢిల్లీ ప్రభుత్వం కొత్త ఎక్సైజ్ పాలసీని ఉపసంహరించుకుంది , పాత విధానాన్ని పునరుద్ధరించింది.

కేజ్రీవాల్‌పై ఆరోపణలేంటి?

ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఎక్సైజ్ కుంభకోణానికి ప్రధాన సూత్రధారి అని, ప్రధాన కుట్రదారు అని ED ఆరోపిస్తోంది. కొందరికి లబ్ధి చేకూర్చేందుకు కుట్ర పన్నారని, ఈ ప్రయోజనం కోసం మద్యం వ్యాపారుల నుంచి లంచం ఇవ్వాలని డిమాండ్‌ చేశారని తెలిపింది. గోవా అసెంబ్లీ ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ నేరాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఉపయోగించిందని ఇందులో కేజ్రీవాల్ ప్రధాన సూత్రధారి అని చెప్పింది.