
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితతో పాటుగా పలువురిపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. దీనిపై ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టనుంది. ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న కవితతను 2024 మార్చి 15న హైదరాబాద్ లో ఈడీ అరెస్ట్ చేసింది. మరోవైపు కవిత జ్యుడీషియల్ కస్టడీని జులై 3 వరకు రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది.
అటు కవితతో పాటుగా మరో నలుగురిపై ఈడీ దాఖలు చేసిన సప్లిమెంటరీ చార్జిషీట్ పై విచారణను రౌస్ ఎవెన్యూ కోర్టు జులై 3కు వాయిదా వేసింది. కవితతో పాటు మరో నలుగురు నిందితుల పాత్రపై మే 10న ఈడీ దాదాపు 8 వేల పేజీలతో 6వ సప్లిమెంటరీ ప్రాసిక్యూషన్ ఫిర్యాదు (అనుబంధ చార్జిషీట్) ను ఈడీ దాఖలు చేసింది.
ఇందులో ఎమ్మెల్సీ కవిత, ఆప్ గోవా ప్రచారాన్ని నిర్వహించిన ముగ్గురు ఉద్యోగులు (చారియట్ ప్రొడక్షన్స్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్) దామోదర్ శర్మ, ప్రిన్స్ కుమార్, చణ్ ప్రీత్ సింగ్, ఇండియా ఎహెడ్ న్యూస్ చానల్ మాజీ ఉద్యోగి అరవింద్ సింగ్ ను చార్జిషీట్లో నిందితులుగా పేర్కొంది. ఈ పిటిషన్ ను గత నెల 29న ట్రయల్ కోర్టు పరిగణనలోకి తీసుకుంటున్నట్టు వెల్లడించింది. అలాగే, నిందితులను కోర్టులో ప్రొడ్యూస్ చేయాలని ఆదేశించింది.