నీట్‌పేపర్‌‌ లీక్‌ కేసులో ఇద్దరి అరెస్టు

నీట్‌పేపర్‌‌ లీక్‌ కేసులో ఇద్దరి అరెస్టు

న్యూఢిల్లీ: నీట్ యూజీ పేపర్  లీక్  కేసులో ఇద్దరిని సెంట్రల్  బ్యూరో ఆఫ్  ఇన్వెస్టిగేషన్  (సీబీఐ) అరెస్టు చేసింది. నిందితులను సీబీఐ అధికారులు గురువారం బిహార్ లోని పాట్నాలో అదుపులోకి తీసుకున్నారు. వారిని మనీష్​ కుమార్, అశుతోష్​ గా గుర్తించారు. మనీష్  తన కారులో స్టూడెంట్లను తరలించి వారు ఒక స్కూల్ లో ఉండేందుకు ఏర్పాట్లు చేశాడు. అక్కడ కనీసం 12 మంది విద్యార్థులకు లీకైన పేపర్  ఇచ్చాడు. స్టూడెంట్లు ఆ పేపర్ ను బట్టీ పట్టారు. 

అశుతోష్​ ఆ స్టూడెంట్లకు తన ఇంట్లో వసతి సౌకర్యాలు కల్పించాడు. ఈ వ్యవహారంలో సీబీఐ అధికారులు మనీష్, అశుతోష్ ను గురువారం విచారణకు పిలిచారు. వారిని ప్రశ్నించిన తర్వాత అరెస్టు చేశారు. ఇక ఈ కేసులో ఆరు ఎఫ్ఐఆర్ లను సీబీఐ నమోదు చేసింది. పేపర్  లీక్  కేసును సీబీఐకి అప్పగిస్తామని కేంద్ర ప్రభుత్వం అంతకుముందు ప్రకటించింది. అలాగే సీబీఐ అరెస్టులకు ముందు ఈ కేసులో పలువురు అనుమానితులను బిహార్, మహారాష్ట్ర, ఢిల్లీలో పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. వారిలో ఒక అభ్యర్థి కూడా ఉన్నాడు. తనతో పాటు మరికొందరికి నీట్  ఎగ్జామ్  ముందు రోజు క్వశ్చన్  పేపర్  కాపీ అందిందని అతను చెప్పాడు.

ఓఎంఆర్ షీట్లపై ఎన్టీఏకు సుప్రీం నోటీసులు

నీట్ యూజీ పరీక్షలో అభ్యర్థులకు ఇచ్చిన ఓఎంఆర్  షీట్లపై అభ్యంతరాలు స్వీకరించేందుకు గడువు ఏమన్నా ఉందా అని నేషనల్  టెస్టింగ్  ఏజెన్సీ (ఎన్టీఏ) ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. టైమ్  లిమిట్  ఉంటే తెలియజేయాలని ఆదేశించింది. ఒక ప్రైవేట్  కోచింగ్  సెంటర్, కొంతమంది నీట్  అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్ పై జస్టిస్  మనోజ్  మిశ్రా, జస్టిస్ ఎస్ వీఎన్  భట్టితో కూడిన వెకేషన్  బెంచ్  విచారణ జరిపి ఎన్టీఏకు నోటీసులు జారీచేసింది.

ప్రైవేట్  కోచింగ్  సెంటర్, అభ్యర్థుల తరపున సీనియర్  అడ్వొకేట్  ఆర్.బసంత్  వాదనలు వినిపించారు. నీట్  ఎగ్జామ్ కు హాజరైన కొంతమంది స్టూడెంట్లకు వారి ఓఎంఆర్  షీట్లు రాలేదని ఆయన చెప్పారు.  ఎన్టీఏ అడ్వొకేట్  స్పందిస్తూ.. ఓఎంఆర్  షీట్లను వెబ్ సైట్ లో అప్ లోడ్  చేశామని, ఇప్పటికే వాటిని అభ్యర్థులకు ఇచ్చామని పేర్కొన్నారు.

 ఓఎంఆర్  షీట్లపై అభ్యంతరాలకు ఏమన్నా గడువు ఉందా? అని బెంచ్  ప్రశ్నించగా.. తాను కొన్ని ఇన్ స్ట్రక్షన్లు తీసుకోవాలని ఎన్టీఏ అడ్వొకేట్  సమాధానం ఇచ్చారు. అలాగే ఆ పిటిషన్ ను పెండింగ్  మ్యాటర్లతో లిస్టు చేయాలని బెంచ్ ను ఆయన కోరారు. త్వరలోనే పిటిషన్ కు రిప్లై ఇస్తామని తెలిపారు. అయితే, అభ్యంతరాల స్వీకరణకు ఎలాంటి గడువు లేదని బసంత్  పేర్కొన్నారు. ఇరు పక్షాల వాదనలు విన్న బెంచ్.. విచారణను వచ్చే నెల 8వ తేదీకి వాయిదా వేసింది.