ఫాంహౌస్ కేసులో కేసీఆర్ సర్కారుకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసుకు సీబీఐకు అప్పగిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈనేపథ్యంలో ఫాం హౌస్ కేసులో ఏం జరగబోతోందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇటువంటి తరుణంలో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ తన విశ్లేషణను ‘వీ6’తో పంచుకున్నారు..
‘‘తాజాగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు.. సిట్ ఇప్పటివరకు ఫాం హౌస్ కేసుకు సంబంధించి సేకరించిన ఆధారాలను సీబీఐకి అప్పగించాల్సి ఉంటుంది. హైకోర్టు ఆర్డర్ కాపీలు సిట్ కు, సీబీఐకి అందుతాయి. ఆ తర్వాత వాళ్లు ఆర్డర్స్ కు అనుగుణంగా నడుచుకుంటారు. సీబీఐ వాళ్లు వచ్చిన సిట్ నుంచి కేసు తమ చేతుల్లోకి తీసుకుంటారు. అయితే ఆలోపు రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనేది వేచిచూడాలి. ఒకవేళ ఈ హైకోర్టు ఆర్డర్ సింగిల్ బెంచ్ ఇచ్చి ఉంటే.. దానిపై హైకోర్టు డివిజన్ బెంచ్ కు వెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెళ్లే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ ఆర్డర్స్ ను హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చి ఉంటే.. రాష్ట్ర సర్కారు సుప్రీంకోర్టు తలుపు తట్టే అవకాశాలు కూడా ఉంటాయి’’ అని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ అభిప్రాయపడ్డారు.
పైకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం వెళ్తుందా ? లేదా ? వేచి చూడాలి
‘‘ పైకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం వెళ్తుందా ? లేదా ? అనేది వేచి చూడాలి. ఒకవేళ పైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం వెళితే అక్కడి నుంచి ఎలాంటి ఆదేశాలు వస్తాయనేది కూడా చూడాలి. హైకోర్టు ఆర్డర్ కాపీలు రాగానే ఈ కేసును సీబీఐ టేకోవర్ చేస్తుంది. ఇప్పటివరకు ఈ కేసులో సేకరించిన ఆధారాల గురించి సిట్ అధికారులు, సీబీఐ అధికారులకు విడమర్చి చెబుతారు. అనంతరం సీబీఐ మళ్లీ ఫ్రెష్ గా కేసు రిజిస్టర్ చేసుకుంటుంది. సిట్ వాళ్లు ఇచ్చే ఆధారాలను చార్జిషీట్ లో పెట్టాలా ? వద్దా ? అనేది సీబీఐ డిసైడ్ చేస్తుంది. భవిష్యత్తులో సీబీఐ చేసే దర్యాప్తులో మరింత బలమైన ఆధారాలు దొరికితే వాటిని కూడా చార్జిషీటులో చేరుస్తారు. అంతమాత్రాన ఇప్పటివరకు సిట్ దర్యాప్తు చేసి సేకరించిన ఆధారాలను కొట్టిపారేయలేం. వాటిని కూడా సీబీఐ పరిగణనలోకి తీసుకుంటుంది’’ అని ఆయన పేర్కొన్నారు.
గతంలో ఇదే తరహా కేసులలో..
‘‘ తమిళనాడులో పళనిస్వామి సీఎంగా ఉన్నప్పుడు ఇచ్చిన ఒక రోడ్డు కాంట్రాక్టు కేసును మద్రాసు హైకోర్టు సీబీఐకి బదిలీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై సుప్రీంకోర్టుకు వెళితే.. సుప్రీంకోర్టు, హైకోర్టు ఆర్డర్ ను కొట్టేసింది. ఇక పశ్చిమ బెంగాల్ లో టీచర్స్ రిక్రూట్మెంట్ స్కాం ను హైకోర్టు సీబీఐకి అప్పగించింది. అది సీబీఐకి ఇవ్వకూడదని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళితే.. ఆ కేసును సీబీఐకి అప్పగించడమే కరెక్టు అని తీర్పు వచ్చింది’’ అని గతంలో ఈ తరహా కేసుల్లో చోటుచేసుకున్న పరిణామాల గురించి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ వివరించారు.