కోల్‎కతా వైద్యురాలి హత్య కేసులో ట్విస్ట్.. బెంగాల్ సర్కార్ అప్పీల్‎ను వ్యతిరేకించిన సీబీఐ

కోల్‎కతా వైద్యురాలి హత్య కేసులో ట్విస్ట్.. బెంగాల్ సర్కార్ అప్పీల్‎ను వ్యతిరేకించిన సీబీఐ

కోల్‎కతా వైద్యురాలి హత్యాచార కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో దోషి సంజయ్ రాయ్‎కు సీల్ధా జిల్లా కోర్టు జీవిత ఖైదు విధించడాన్ని సవాల్ చేస్తూ వెస్ట్ బెంగాల్ సర్కార్ హైకోర్టును ఆశ్రయించడాన్ని సీబీఐ వ్యతిరేకించింది. కేసు దర్యాప్తు చేసిన ఏజెన్సీగా దోషి శిక్షను సవాల్ చేసే అధికారం సీబీఐకి మాత్రమే ఉంటుందని.. ఈ విషయంలో అప్పీల్ దాఖలు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని సీబీఐ పేర్కొంది. కోల్‎కతాలోని ఆర్జీకర్ హాస్పిటల్ అండ్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్ అత్యంత దారుణంగా హత్యాచారానికి గురైన విషయం తెలిసిందే. 

ఈ కేసులో సంజయ్ రాయ్‎ను దోషిగా తేల్చిన సీల్ధా జిల్లా కోర్టు.. అతడికి చనిపోయేంత వరకు జైల్లోనే ఉండేలా  జీవిత ఖైదు శిక్ష విధించింది. సీల్ధా జిల్లా కోర్టు తీర్పును బెంగాల్ ప్రభుత్వం హైకోర్టులో సవాల్ చేసింది. వైద్యురాలిపై దారుణానికి ఒడిగట్టిన దోషికి జీవిత ఖైదు కాకుండా ఉరి శిక్ష విధించాలని బెంగాల్ సర్కార్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‎పై 2025, జనవరి 22న కోల్ కతా హైకోర్టు విచారణ చేపట్టింది. 

Also Read :- మిడిల్ క్లాస్ రాగం అందుకున్న కేజ్రీవాల్

ఈ సందర్భంగా తమ వాదనలు వినిపించిన సీబీఐ.. ‘ఈ కేసును మేం విచారించినందున  దోషి శిక్షను సవాలు చేసే అధికారంప్రాసిక్యూటింగ్ ఏజెన్సీగా మాకు మాత్రమే ఉంది.. అప్పీల్ దాఖలు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు’ అని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం తరుఫున అడ్వకేట్ జనరల్ వాదిస్తూ.. ‘ఈ కేసులో ప్రాథమిక ఎఫ్‌ఐఆర్‌ను రాష్ట్ర పోలీసులు దాఖలు చేశారు, ఆ తర్వాత కేసును సీబీఐకి బదిలీ చేశారు’ అని కోర్టుకు తెలియజేశారు. ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన కోల్‎కతా పోలీసులకు దోషి శిక్షను సవాల్ చేసే అధికారం ఉంటుందని వాదించారు.

 అలాగే.. లా అండ్ ఆర్డర్ రాష్ట్ర అధికార పరిధిలో ఉందని పేర్కొన్నారు. ఇరు వర్గాల వాదనలు విన్న దేబాంగ్షు బసక్, ఎండీ షబ్బర్ రషీదీలతో కూడిన డివిజన్ బెంచ్.. రాష్ట్ర ప్రభుత్వ అప్పీల్‌ను విచారణకు అంగీకరించాలా వద్దా అనే దానిపై  సీబీఐ, బాధితురాలి ఫ్యామిలీ, దోషి సంజయ్ రాయ్ సమర్పించిన అఫిడవిట్లను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అనంతరం కేసు విచారణను వాయిదా వేశారు. దీంతో కోల్ కతా  కోర్టు నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.