ఫాంహౌస్ కేసు: ప్రభుత్వానికి ఐదు సార్లు లేఖ రాసిన సీబీఐ

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసు వివరాలు అప్పగించాలంటూ సీబీఐ అధికారులు ప్రభుత్వానికి మరోసారి లేఖ రాశారు. ఈ కేసుకు సంబంధించి ఫైళ్లు ఇవ్వాలని  సీఎస్ శాంతి కుమారికి ఈ నెల 6న సీబీఐ అధికారులు లేఖ రాశారు.  కేసు వివరాలు ఇవ్వాలని ఇప్పటికే  రాష్ట్ర ప్రభుత్వానికి సీబీఐ నాలుగు సార్లు లేఖ రాసింది.  మొదటి లేఖ గతేడాది 31న రాయగా.. జనవరి 5, 9, 11న  మిగతా లేఖలు రాసింది. లేటెస్ట్ గా రెండు రోజుల క్రితం సీబీఐ,  ప్రభుత్వానికి మరో లేఖ రాసింది.

ఈ కేసును సీబీఐకి అప్పగించాలంటూ  2022 అక్టోబర్ 26న హైకోర్ట్ ఆదేశించింది.   కేసును దర్యాప్తు చేస్తున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం..  సిట్ను రద్దు చేసిన న్యాయస్థానం తక్షణమే దాన్ని సీబీఐకి అప్పగించాలని ఆదేశించింది. సిట్ వద్ద ఉన్న వివరాలు, ఇప్పటి వరకు జరిపిన దర్యాప్తునకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని  సీబీఐకు ఇవ్వాలని చెప్పింది.

అయితే హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలంటూ ప్రభుత్వం  సుప్రీంను ఆశ్రయించగా అక్కడ కూడా నిరాశే ఎదురైంది. హైకోర్ట్ తీర్పుపై స్టే ఇచ్చేందుకు సీజేఐ ధర్మాసనం నిరాకరించింది. కేసును విచారించి మెరిట్స్ ఉంటే హైకోర్టు తీర్పును రివర్స్ చేస్తామని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ స్పష్టం చేశారు. కేసును ఫాస్ట్ ట్రాక్ చేయాలన్న ప్రభుత్వ అభ్యర్థనను ధర్మాసనం తోసిపుచ్చింది. తదుపరి విచారణను ఈ నెల 17కు వాయిదా వేసింది.