ఏ వస్తువు అయినా కొనాలంటే.. అందుకు తగ్గ డబ్బులు లేకపోతే నెలవారీగా ఈఎంఐ స్కీంలో కొంటాం.. ఇల్లు అయినా.. బండి అయినా.. టీవీ అయినా.. ఇంకేదైనా వస్తువును ఈఎంఐలో కొనటం కామన్.. ఫస్ట్ టైం దేశమే కాదు.. ప్రపంచం మొత్తం నివ్వెరపోయే విధంగా.. అవినీతి ప్రభుత్వ ఉద్యోగులు.. లంచం కోసం ఈఎంఐ పథకం తీసుకొచ్చారు.. సీబీఐ.. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సైతం అవాక్కయ్యేలా దేశ రాజధానిలో జరుగుతున్న అవినీతి బాగోతం గుట్టు రట్టు అయ్యింది.. లంచాలకూ ఈఎంఐ స్కీం పెట్టిన కథ ఏంటో పూర్తి తెలుసుకుందాం..
దేశ రాజధాని ఢిల్లీలో పోలీస్ వ్యవస్థకు కొందరు పోలీసు అధికారులు మాయని మచ్చ తెచ్చారు. ఈస్ట్ ఢిల్లీలోని పత్పర్ గంజ్ పోలీస్ స్టేషన్ పై సీబీఐ అధికారులు దాడులు చేయగా షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ స్టేషన్లోని ఇద్దరు హెడ్ కానిస్టేబుల్స్ లంచం తీసుకుంటూ దొరికిపోయారు. రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా సీబీఐ అధికారులు ఆ పోలీసులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. దొంగిలించిన మొబైల్ ఫోన్లు అమ్ముతుందనే కారణంగా ఒక మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు నుంచి తప్పించడానికి పోలీసులు ఆమె నుంచి రూ.50 వేలు లంచం ఆశించారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. తన దగ్గర అంత డబ్బు లేదని ఆ మహిళ అనడంతో.. ఆ ఇద్దరు కానిస్టేబుల్స్ ‘‘మరేం పర్లేదు.. మన పోలీస్ స్టేషన్లో ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది.. డౌన్ పేమెంట్గా రూ.11 వేలు కడితే సరిపోతుంది.. మిగతాది నెలవారీ వాయిదాల్లో కట్టుకోవచ్చు’’ అని ఆ మహిళకు బదులిచ్చారు. సదరు మహిళ పోలీసులు చెప్పిన సమాధానంతో విస్తుపోయింది. ఈ పోలీస్ స్టేషన్లో పోలీసులు లంచాలకు మరిగారని, అది కూడా ఈఎంఐ రూపంలో కట్టించుకుంటున్నారని సీబీఐకి సమాచారం అందింది.
జూన్ 21న సీబీఐ అధికారులు పోలీస్ స్టేషన్పై రైడ్ చేయగా ఈ ఈఎంఐ లంచాలకు మరిగిన ఢిల్లీ పోలీసులు బాగోతం బయటికొచ్చింది. ఈ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్స్ మాత్రమే కాదు సబ్ ఇన్స్పెక్టర్ కూడా ఈఎంఐ రూపంలో లంచాలు తింటున్నట్లు సీబీఐ అధికారులు తేల్చారు. ఫిర్యాదు చేయడానికి వచ్చిన ఒక బాధితుడి నుంచి ఎస్ఐ 3 లక్షల లంచం డిమాండ్ చేశాడు. బేరసారాల తర్వాల లంచం మొత్తాన్ని రూ.2 లక్షలకు ఒప్పందం చేసుకున్నాడు. ఈఎంఐల రూపంలో ఆ రూ.2 లక్షలు కట్టకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బాధితుడిని హెచ్చరించాడు. మొదటి ఇన్స్టాల్మెంట్లో భాగంగా సదరు ఎస్ఐ లక్ష రూపాయల లంచం తీసుకుంటుండగా సీబీఐ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఒక వివాదానికి సంబంధించిన కేసులో ఇదే ఎస్ఐ రూ.25 లక్షలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ పాతిక లక్షల్లో డౌన్ పేమెంట్ పేరుతో ఎస్ఐ రూ.5 లక్షలు కట్టించుకున్నట్లు తెలిసింది. మిగిలిన మొత్తాన్ని వాయిదాల రూపంలో కట్టాలని ఎస్ఐ బాధితుడికి చెప్పాడు. గడచిన 2 ఏళ్లలో ఢిల్లీ పోలీసులపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.