ఫేక్ సీబీఐ అధికారి శ్రీనివాస్ కేసులో సీబీఐ నోటీసులు ఇచ్చిందని వస్తున్న వార్తలపై బీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ స్పందించారు. తనకు ఎలాంటి నోటీసులు రాలేదని స్పష్టం చేశారు. ఈ విషయంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని బొంతు రామ్మోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ కమ్యూనిటీ ఫంక్షన్ లో శ్రీనివాస్ పరిచయం అయ్యాడే తప్ప అతని కార్యకలాపాలతో తమకెలాంటి సంబంధం లేదని బొంతు స్పష్టం చేశారు. దర్యాప్తు సంస్థలు పిలిస్తే వెళ్లి సమాధానం చెప్తానని అన్నారు. ఒక్కరోజు తన ఫోన్ స్విచ్ఛాఫ్ ఉండటంతో తనను సీబీఐ అరెస్ట్ చేసిందని మీడియాలో వార్తలు రావడంపైనా ఆయన స్పందించారు. ఆరోగ్యం బాగోలేక ఫోన్ స్విచ్ఛాఫ్ చేస్తే ఇలాంటి కథనాలు రాయడం సరికాదని హితవు పలికారు.
కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తూ టీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేస్తోందని బొంతు ఆరోపించారు. బెట్టింగ్ వ్యవహారంలో తన ప్రమేయం లేదన్న ఆయన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎవరో తనకు తెలియదని చెప్పారు.