మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదురుకుంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి విషయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కర్నూలులోని విశ్వభారతి ఆసుపత్రికి సీబీఐ అధికారులు చేరుకున్నారు. శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా ముందస్తుగా కర్నూల్ ఎస్పీతో చర్చించారు. 2023 మే 22 సోమవారం రోజున విచారణకు హాజరుకావాలంటూ అవినాష్‌రెడ్డికి సీబీఐ నోటీసులు పంపింది.
అయితే తాను సోమవారం విచారణకు రాలేనంటూ అవినాష్‌రెడ్డికి సీబీఐ అధికారులకు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో సీబీఐ అధికారులే ఆసుపత్రికి చేరుకున్నారు. అవినాష్‌రెడ్డిని సీబీఐ అధికారులు ఏక్షణమైనా అరెస్టు చేస్తారేమోనని ప్రచారం జరుగుతోంది. దీంతో ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు. విశ్వభారతి ఆసుపత్రి మార్గంలో రాకపోకలపై ఆంక్షలు విధించారు.
అటు విశ్వభారతి ఆసుపత్రి వద్దకు వైసీపీ కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు. పోలీసులు వారిని వెనక్కి పంపుతున్నారు. కాగా ఇటీవల అవినాష్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మికి గుండెపోటు వచ్చిందని ఆమెను విశ్వభారతి ఆసుపత్రిలో చేర్పించారు. గత నాలుగు రోజులుగా అవినాష్ రెడ్డి అక్కడే ఉంటున్నారు.
అవినాష్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మి హెల్త్ బులిటెన్ ను డాక్టర్లు రిలీజ్ చేశారు. మరికొన్ని రోజులు ఆమెకు ఐసీయూలోనే చికిత్స చేయాలని సూచించారు. ఇంకా ఆమెకు బీపీ కంట్రోల్ లోకి రాలేదని, పరిస్థితి విషమంగానే ఉందని వెల్లడించారు.