దేశ వ్యాప్తంగా తీవ్ర విషాదం నింపిన ఒడిశా రైలు ప్రమాద ఘటనపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)రంగంలోకి దిగింది. బాలాసోర్ కు చేరుకున్న సీబీఐ బృందం ఘటనా స్థలాన్ని పరిశీలిస్తోంది. అక్కడి అధికారులతో ప్రమాదానికి సంబంధించి అన్ని కోణాల్లో విచారిస్తోంది. అయితే ప్రమాద ఘటనపై సీబీఐ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
రైలు ప్రమాదంపై సీబీఐ విచారణకు రైల్వే బోర్డు జూన్ 4న సిఫార్సు చేసింది. ప్రమాదం జరిగిన తీరు, పరిస్థితులు చూసి పరిపాలనాపరమైన సమాచారం మేరకు రైల్వే బోర్డు సీబీఐకి విచారణకు సిఫార్సు చేస్తోందని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
జూన్ 2న రాత్రి మూడు రైళ్లు ఢీ కొన్ని ఈ ఘటనలో 275 మంది చనిపోయారు. 900 మందికి పైగా గాయపడ్డారు. ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న వారిలో ఇప్పటి వరకు 700 మంది కోలుకున్నారు. ఇంకా 200 మంది చికిత్స తీసుకుంటున్నారు.
మరో వైపు అధికారులకు మృతదేహాల గుర్తింపు సవాల్ గా మారింది. ఇంకా 100 మంది మృతదేహాలను గుర్తించలేదని చెప్పారు. వెబ్ సైట్ లో వివరాలు పెట్టిన రైల్వే అధికారులు మృత దేహాల కోసం ఎవరూ రాకపోతే ఖననం చేస్తామని ప్రకటించారు.