సీబీఐ అధికారులు 20 నిమిషాలే ప్రశ్నించారు: మంత్రి గంగుల

కరీంనగర్, వెలుగు: సీబీఐ ఆఫీసులో 20 నిమిషాలు మాత్రమే ప్రశ్నించారని.. మళ్లీ మళ్లీ పిలవడం బాగుండదని కాసేపు ఉండండి అంటే ఆగామని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్​లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనుల పురోగతిని ఆదివారం పరిశీలించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. కొద్ది రోజుల కింద ఢిల్లీలో జరిగిన సీబీఐ విచారణ వివరాలు వెల్లడించారు. ఇటీవల అరెస్టయిన శ్రీనివాస్ అనే వ్యక్తి  తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితుడని.. శ్రీనివాస్ కాపు సంఘంలో తిరిగేవాడని.. ధర్మేందర్ అనే వ్యక్తి చెప్తే కలిసేందుకు అతను ఉన్న దగ్గరికి వెళ్లి పరిచయం చేసుకున్నామని చెప్పారు. మున్నూరు కాపు కులంలో ఐపీఎస్ కదా అని గర్వంగా ఫీల్ అయ్యామని.. శ్రీనివాస్ భార్య కూడా ఐఏఎస్ అనడంతో ఆమెను కూడా అందరికీ పరిచయం చేయాలని కోరామన్నారు. 

ఆ రోజు మరుసటి రోజు గంటసేపు మామూలుగా మాట్లాడడం తప్ప అంతకు మించి ఏమీ లేదని మంత్రి చెప్పారు. వారం కిందట కలిసినపుడు శ్రీనివాస్ తో దిగిన ఫొటో సీబీఐ అధికారుల వద్ద ఉందన్నారు. మంత్రి కదా అని తనను కూడా విచారణకు పిలిచారని.. తన ఫొటోలు, కాల్ లిస్ట్ ఉందన్నారు. సీబీఐ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు తన బావ ఎంపీ వద్ది రాజు రవిచంద్ర, తాను చెప్పిన సమాధానాలు ఒకటే అన్నారు. శ్రీనివాస్ తనను ఎలాంటి పనులు అడగలేదని.. అతడిని తాను కూడా పనులు చేయాలని అడగలేదని క్లారిటీ ఇచ్చారు. రవిచంద్రకి అతనితో మూడేండ్ల నుంచి పరిచయం ఉందన్నారు. అదే పరిచయంతో శ్రీనివాస్ ఇంట్లో పెళ్లికి రవిచంద్ర రూ.15 లక్షలు అప్పు ఇప్పించారని తెలిసిందని.. ఇదే విషయాన్ని సీబీఐ విచారణలో చెప్పామని వివరించారు. తాము ఏ పనయినా నేరుగా మాట్లాడుతామని.. మధ్యవర్తులతో మాట్లాడాల్సిన పనిలేదన్నారు.