- కస్టమ్స్ డ్యూటీ క్లియర్ చేసేందుకు రూ.50 వేలు డిమాండ్
- కెనరా బ్యాంక్ ఉద్యోగి, ముగ్గురు ఆఫీసర్లపై సీబీఐ కేసు
- శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ సహా, బీహార్,పంజాబ్‌లో తనిఖీలు,
- రూ. 4.76 లక్షలు స్వాధీనం
హైదరాబాద్, వెలుగు : కస్టమ్స్ డ్యూటీ క్లియరెన్స్ కోసం లంచం తీసుకున్న నలుగురు ఆఫీసర్లపై సీబీఐ కేసు నమోదు చేసింది. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ సహా బీహార్‌లోని ముజఫర్‌పూర్, పంజాబ్‌లోని మాన్సాల్లో కలిపి మొత్తం ఐదు చోట్లా సీబీఐ ఆఫీసర్లు సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో రూ.4.76 లక్షలతో పాటు వివిధ రకాల డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు. సీబీఐ ఆఫీసర్లు తెలిపిన వివరాల ప్రకారం... శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో పనిచేస్తున్న ఇద్దరు కస్టమ్స్, మరో సెంట్రల్ ఎక్సైజ్ ఇన్ స్పెక్టర్ కలిసి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ప్యాసింజర్స్‌ను టార్గెట్ చేశారు.
అక్టోబర్5న జెడ్డా నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఓ ప్రయాణికుడికి కస్టమ్స్ డ్యూటీ క్లియరెన్స్ ఇచ్చేందుకు రూ.50 వేలు లంచం తీసుకున్నారు. దీంతో బాధితుడు సీబీఐ ఆఫీసర్లకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన ఆఫీసర్లు ప్రాథమికంగా వివరాలు సేకరించి, ఆఫీసర్ల సొంత గ్రామాల్లోనూ తనిఖీలు చేపట్టారు. ఈ కేసులో సంబంధం ఉన్న రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ కెనరా బ్యాంక్ ఆఫీసర్‌తో పాటు, మొత్తం నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.