
- పన్ను చెల్లింపుదారుల నుంచి లంచం డిమాండ్ చేస్తున్నట్టు గుర్తింపు
హైదరాబాద్, వెలుగు: ఆదాయపు పన్ను చెల్లింపుదారులను బెదిరిస్తున్న ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులపై సీబీఐ కేసు నమోదు చేసింది. హైదరాబాద్ రేంజ్–1కు చెందిన ఆరుగురు అధికారులు సహా మరో ప్రైవేట్ వ్యక్తిపై ఈ నెల 27న ఎఫ్‌ఐఆర్ రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నది. వారి నివాసాల్లో గురు, శుక్రవారాల్లో సోదాలు నిర్వహించింది.2023 జూన్ 23కు సంబంధించి ఐటీ రిటర్న్‌ల కంటే అధిక పన్ను రీఫండ్ పొందుతున్న వారికి సంబంధించి మాస్టర్ ఎక్సెల్ లిస్ట్‌ను తయారు చేశారు.
లిస్ట్‌లో ఉన్న వారికి నోటీసులు పంపించేందుకు అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ ఆదేశించారు. ఐతే ఈ డ్రైవ్‌ను నిలిపివేయాలని అప్పటి ఇన్‌కమ్ ట్యాక్స్ రేంజ్–1 అడిషనల్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. అడిషనల్ కమిషనర్ ఆదేశాలను ఐటీ అధికారులు ఖమర్ అలం ఖాన్, మనీష్ శిక్రావాల్ ధిక్కరించారు. లిస్ట్‌లో ఉన్న ట్యాక్స్ పేయర్ల సమాచారంతో మరో ఎక్సెల్ షీట్‌ను రూపొందించారు. పాన్ నంబర్ల ఆధారంగా సంబంధిత వ్యక్తులకు కాల్స్ చేశారు.
అలాగే, ఇద్దరికీ చెందిన అధికారిక ఈ మెయిల్ అకౌంట్ల ద్వారా మెయిల్స్కూడా పంపించి.. క్లెయిమ్ చేసిన రీఫండ్‌కు అవసరమైన పత్రాలను సమర్పించాలని కోరారు. అనంతరం ఔలం ఖాన్, సిక్రావాల్ ఇతర ఐటీ అధికారులైన గుల్నాజ్ రవూఫ్, కుతాడి శ్రీనివాస్ రావు, మొహమ్మద్ జావీద్, ప్రైవేట్ వ్యక్తి పి. భగత్ (చార్టర్డ్ అకౌంట్)తో కలిసి కుట్ర పన్నారు. వీరు పన్ను చెల్లింపుదారులకు ఫోన్ చేసి.. మెయిల్‌కు రిప్లై ఇవ్వాలని.. తక్షణమే స్పందించకుంటే భారీ జరిమానాలు తప్పవని బెదిరిస్తూ.. లంచం డిమాండ్ చేశారు. దీంతో వీరిపై సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నది.