![వామనరావు దంపతుల హత్య కేసు దర్యాప్తునకు రెడీ](https://static.v6velugu.com/uploads/2025/02/cbi-says-to-supremecourt-ready-to-advocate-vamanarao-couples-asssestion-case-investigation_sJSrQ6OjEX.jpg)
- సుప్రీంకోర్టుకు తెలిపినదర్యాప్తు సంస్థ సీబీఐ
- తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో సంచలనం సృష్టించిన న్యాయవాద దంపతులు గట్టు వామనరావు, నాగమణి హత్య కేసును సుప్రీంకోర్టు ఆదేశిస్తే... దర్యాప్తు చేయడానికి తాము సిద్ధమేనని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) సుప్రీంకోర్టుకు నివేదించింది. 2021 ఫిబ్రవరి 17న పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కలవచర్లలో కారులో వెళ్తున్న అడ్వొకేట్ వామనరావు, ఆయన సతీమణి నాగమణిని నడిరోడ్డుపై దుండగులు అత్యంత దారుణంగా హత్య చేశారు.
ఆ దంపతుల హత్యపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలంటూ వామనరావు తండ్రి గట్టు కిషన్‌రావు అదే ఏడాది సెప్టెంబరులో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై గతంలో విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం... కేసును సీబీఐకి అప్పగించాలన్న అంశంపై అభిప్రాయం చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.
ఈ పిటిషన్ మంగళవారం మరోసారి జస్టిస్ సుందరేశ్, జస్టిస్ రాజేశ్ బిందల్ తో కూడిన బెంచ్ ముందుకు విచారణకు వచ్చింది. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశిస్తే దర్యాప్తు చేయడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని సీబీఐ తరపు అడ్వొకేట్ బెంచ్ కు నివేదించారు. మరోవైపు పిటిషనర్ తరఫున సీనియర్ అడ్వొకేట్ మేనకా గురుస్వామి వాదనలు వినిపిస్తూ.. అందరూ చూస్తుండగానే న్యాయవాద దంపతుల హత్య జరిగిందన్నారు.
దీనికి సంబంధించిన వీడియోలన్నీ ఉన్నాయని మరోసారి ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఆ వీడియోలు అన్ని మీడియా చానెళ్లలో ప్రసారం అయ్యాయని, అంతకుమించిన సాక్ష్యాధారాలు ఇంకేం కావాలన్నారు. చివరికి, మరణ వాంగ్మూలంలో చెప్పినప్పటికీ ఆ వ్యక్తులను విచారించలేదని, కేసు దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పిటిషన్ తరపు అడ్వొకేట్ మేనకా గురుస్వామి వాదనలపై... పుట్టా మధుకర్ తరపున సీనియర్ న్యాయవాది నిఖిల్ గోయల్ దీనికి అభ్యంతరం తెలిపారు.
మరణ వాంగ్మూలంలో దంపతులిద్దరు ఎవరి పేరును ప్రస్తావించలేదని బెంచ్ కు నివేదించారు. ఈ కేసులో తమ వాదనలు వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని పుట్ట మధు కోరుతూ... ఇంటర్ లోక్యుటరీ అప్లికేషన్ (ఐఏ) దాఖలు చేశారు. ఈ కేసులో తనను ఇరికించాలని చూస్తున్నారని చెప్పారు. మరణ వాంగ్మూలాన్ని ట్రాన్స్ క్రిప్ట్ చేసి ధర్మాసనానికి అందిస్తామని, అందుకు తమకు టైం కావాలని అభ్యర్థించారు. మధుకర్ పిటిషన్ ను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు పేర్కొన్న ధర్మాసనం... తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.