- బెయిల్ పిటిషన్లపై విచారణ వాయిదా వేసిన సీబీఐ స్పెషల్ కోర్టు
న్యూఢిల్లీ, వెలుగు: లిక్కర్ స్కామ్‌లో అరెస్టయిన అభిషేక్ బోయినపల్లి, శరత్ చంద్రా రెడ్డి, బినోయ్ బాబు, విజయ్ నాయర్లకు సీబీఐ స్పెషల్ కోర్టు మరో 14 రోజులపాటు జ్యుడీషియల్ రిమాండ్ పొడిగించింది. మద్యం కుంభకోణంలో ఈడీ, సీబీఐ అరెస్టు చేసిన ఈ నలుగురు ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. కోర్టు గతంలో ఈ నలుగురికి విధించిన జ్యుడీషియల్ రిమాండ్ సోమవారంతో ముగిసింది.
దీంతో అభిషేక్ బోయినపల్లి, శరత్ చంద్రారెడ్డి, బినోయ్‌బాబు, విజయ్ నాయర్లను ఈడీ అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీబీఐ స్పెషల్ కోర్టు జడ్జి నాగ్ పాల్ ముందు హాజరుపరిచారు. ఈ కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్నందున నిందితుల రిమాండ్ పొడిగించాలని కోర్టును ఈడీ కోరింది. దీంతో నలుగురికి జ్యుడీషియల్ రిమాండ్ పొడిగిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. తదుపరి విచారణను జనవరి 2కు వాయిదా వేసింది.
బినోయ్ బాబు బెయిల్ పిటిషన్‌పై 59 పేజీల నివేదిక
లిక్కర్ కేసులో అరెస్టయిన తమకు బెయిల్ మంజూరు చేయాలని నలుగురు నిందితులు వేర్వేరుగా పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. బినోయ్ బాబు బెయిల్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని గతంలో జడ్జి నాగ్ పాల్ ఆదేశాలిచ్చారు. దీనిపై సోమవారం ఈడీ తరఫు సీనియర్ అడ్వొకేట్ నవీన్ కుమార్ మట్ట 59 పేజీల నివేదికను కోర్టుకు సమర్పించారు. అయితే దాన్ని స్టడీ చేసేందుకు టైమ్కావాల్సి ఉండడంతో తదుపరి విచారణను జనవరి 9కి వాయిదా వేశారు. అభిషేక్ బోయినపల్లి, విజయ్ నాయర్ బెయిల్ పిటిషన్లపై విచారణను జనవరి 4కు వాయిదా వేశారు. గత శనివారం (డిసెంబర్ 17) శరత్ చంద్రా బెయిల్ పిటిషన్ పై విచారణను జనవరి 7కు వాయిదా వేస్తూ ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే.