మరోసారి కవిత అరెస్ట్.. ఏప్రిల్ 12న తీహార్ జైలు నుంచి సీబీఐ ఆఫీసుకు

మరోసారి  కవిత అరెస్ట్.. ఏప్రిల్ 12న తీహార్ జైలు నుంచి సీబీఐ ఆఫీసుకు
  • ఈ సారి సీబీఐ వంతు
  • లిక్కర్ స్కాం అవినీతి కేసులో యాక్షన్
  • రేపు తీహార్ జైలు నుంచి సీబీఐ ఆఫీసుకు 
  • కోర్టులో హాజరు పర్చనున్న అధికారులు
  • 10 రోజుల పాటు కస్టడీ కోరుతు పిటిషన్!


న్యూ ఢిల్లీ: లిక్కర్ స్కాం కేసులో నిందితురాలిగా తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను సీబీఐ అరెస్టు చేసింది. ఈ మేరకు రేపు తీహార్ జైలు నుంచి సీబీఐ ఆఫీసుకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కోర్టులో హాజరు పర్చడంతోపాటు పది రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పిటిషన్ వేసేందుకు సీబీఐ సిద్ధమైంది. ఆమె తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరుతూ రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించిన విషయంత తెలిసిందే. ఆమె బయటికి వెళ్తే సాక్షాలను తారుమారు చేస్తారని, బెయిల్ ఇవ్వవద్దని ఈడీ కోర్టుకు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఈడీ వాదనతో ఏకీభవించిన కోర్టు కవితకు మధ్యంతర బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది.

6న జైలులో ప్రశ్నించిన సీబీఐ

ఈ నెల 6న తీహార్ జైలులో ఉన్న కవితను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. కోర్టు ఆదేశాల ప్రకారం తీహార్ జైలుకు వెళ్లిన అధికారులు కవితను ఇంటరాగేషన్ చేశాకే ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. అయితే అంతకుముందు కవిత తనకు సీబీఐ విచారణ నుంచి మినహాయించాలని కోరుతూ కోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్ విచారణకు స్వీకరించే లోపే కవితను సీబీఐ అధికారులు ప్రశ్నించడం గమనార్హం. 

అరెస్టుల పరంపర ఇలా..

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను మార్చి 15న ఈడీ అరెస్టు చేసింది. ప్రివెన్షన్ ఆఫ్​ మనీలాండరింగ్ యాక్టు ప్రకారం కవితను అరెస్టు చేసిన ఈడీ తొలుత ఏడు రోజులు  ఆ తర్వాత మూడు రోజులు కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించింది. తర్వాత  కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో ఆమె  ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు. లిక్కర్ స్కాం కేసులో అవినీతిపై విచారిస్తున్న   సీబీఐ ఇటీవలే ఆమెను ప్రశ్నించింది. సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌తో కలిసి కవిత కుట్ర చేశారని సీబీఐ పేర్కొంది. సౌత్ గ్రూపుకు ఆప్‌కు మధ్య కవిత దళారిగా వ్యవహరిస్తూ 100 కోట్ల ముడుపులు చెల్లించడంలో  కీలకపాత్ర పోషించారని సీబీఐ అభియోగం మోపింది. అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది. ఐపీసీ 120బీ కింద కుట్ర కోణంలోనూ విచారణ జరుపుతోంది. ఈ క్రమంలోనే  కవితను అరెస్ట్‌ చేసినట్టు సీబీఐ ఇవాళ ప్రకటించింది. రేపు కవితను జ్యుడీషియల్ కస్టడీ నుంచి సీబీఐ హెడ్ క్వార్టర్స్‌ తరలిస్తారు. ఆ వెంటనే కోర్టులో ప్రవేశపెట్టి 10  రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరేందుకు సీబీఐ రెడీ అవుతోంది.