లీకుల లింకులెక్కడ?: నీట్​పై రంగంలోకి సీబీఐ

లీకుల లింకులెక్కడ?: నీట్​పై రంగంలోకి సీబీఐ
  • 4 రాష్ట్రాల్లో కదులుతున్న డొంక
  • బిహార్​లోని పాట్నా, గుజరాత్​లోని గోద్రాకు స్పెషల్ టీమ్స్
  • మహారాష్ట్రలో ఇద్దరు అనుమానితులను విచారించిన పోలీసులు 
  • జార్ఖండ్​లోని ప్రైవేట్ స్కూల్ నుంచి పేపర్ లీక్ అయినట్టు నిర్ధారణ  
  • నీట్ రీఎగ్జామ్​కు 750 మంది డుమ్మా.. గ్రేస్ మార్కులు కలిపిన 
  • 1,563 మంది అభ్యర్థులకు గాను 813 మంది హాజరు 

న్యూఢిల్లీ / పాట్నా: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీకేజీ వ్యవహారాన్ని తేల్చేందుకు సీబీఐ రంగంలోకి దిగింది. దీనిపై ఆదివారం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా స్పెషల్ టీమ్స్ ను ఏర్పాటు చేసి, పేపర్ లీక్ లింకులపై దృష్టిపెట్టింది. ఆ టీమ్ లను బిహార్ లోని పాట్నా, గుజరాత్ లోని గోద్రాకు పంపించింది. నీట్ పేపర్ లీక్ అయినట్టు ఈ రెండు చోట్ల పోలీసులు కేసులు నమోదు చేయడంతో స్పెషల్ టీమ్స్ ను ఆయా ప్రాంతాలకు పంపించింది. మరోవైపు బిహార్​లోని పాట్నా, గుజరాత్​లోని గోద్రాలో నమోదైన పోలీస్ కేసులను సీబీఐకి అప్పగిస్తూ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నోటిఫికేషన్లు విడుదల చేశాయి. 

కాగా, నీట్ పేపర్ లీక్ అయినట్టు ఆరోపణలు రావడం, దేశవ్యాప్తంగా నిరసనలు తీవ్రం కావడంతో ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ శనివారం రాత్రి కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో గుర్తుతెలియని వ్యక్తులపై ఐపీసీ సెక్షన్ 120–బీ (క్రిమినల్ కుట్ర), 420 (చీటింగ్) తదితర సెక్షన్ల కింద సీబీఐ కేసు నమోదు చేసింది. ‘‘నీట్ పేపర్ లీకేజీ ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం కోరింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాం. ఈ కుట్ర చేసిందెవరు? ఇందులో ఎవరెవరు ఉన్నారు? ప్రభుత్వ సంస్థలు, ఉద్యోగుల ప్రమేయం ఉన్నదా? తదితర విషయాలను తేలుస్తాం” అని సీబీఐ అధికార ప్రతినిధి తెలిపారు.

నీట్ పేపర్ మహారాష్ట్రలోనూ లీక్ అయినట్టు తెలుస్తున్నది. పేపర్ లీకేజీ కేసులో ఇద్దరు టీచర్లను అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. లాతుర్ జిల్లాకు చెందిన సంజయ్ తుకారాం జాదవ్, జలీల్ ఉమర్ ఖాన్ పఠాన్ గవర్నమెంట్ స్కూల్ లో టీచర్లు. వీళ్లిద్దరూ కలిసి ప్రైవేట్ కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్నారు. అయితే నీట్ పేపర్ లీకేజీలో సంజయ్, జలీల్ హస్తం ఉందన్న అనుమానంతో నాందేడ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) పోలీసులు వాళ్లను శనివారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నారు. కొన్ని గంటల పాటు విచారించి ఇంటికి పంపించారు. మళ్లీ అవసరమైతే విచారణకు రావాలని ఆదేశించారు. 

మరో 17 మంది డిబార్.. 

గ్రేస్ మార్కులు కలిపిన 1,563 మంది అభ్యర్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఆదివారం ఏడు సెంటర్లలో నీట్ రీఎగ్జామ్ నిర్వహించింది. అయితే ఈ పరీక్షకు దాదాపు సగం మంది అభ్యర్థులు డుమ్మా కొట్టారు. 1,563 మందికి నీట్ రీఎగ్జామ్ నిర్వహించగా 813 మంది (52 శాతం) హాజరయ్యారని ఎన్టీఏ తెలిపింది. మరో 750 మంది గైర్హాజరయ్యారని చెప్పింది. మే 5న నీట్ ఎగ్జామ్ జరిగినప్పుడు కొన్ని సెంటర్లలో టైమ్ కోల్పోయిన అభ్యర్థులకు ఎన్టీఏ గ్రేస్ మార్కులు కలిపింది. అయితే ఆ తర్వాత నీట్ లో అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు రావడంతో పాటు గ్రేస్ మార్కులపైనా వివాదం నెలకొంది. 

ఈ క్రమంలో గ్రేస్ మార్కులు కలిపిన అభ్యర్థులకు మళ్లీ ఎగ్జామ్ నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కాగా, నీట్ లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో మరికొంత మందిని ఎన్టీఏ డిబార్ చేసింది. బిహార్ లో మే 5న పరీక్షకు హాజరైన మరో 17 మందిని డిబార్ చేసినట్టు ఎన్టీఏ ఆదివారం ప్రకటించింది. ఇంతకుముందు 63 మందిని డిబార్ చేసిన ఎన్టీఏ.. శనివారం గుజరాత్ లోని గోద్రాలోనూ 30 మందిని డిబార్ చేసింది. ఇదిలా ఉండగా ఎన్టీఏ వెబ్ సైట్, ఇతర పోర్టల్స్ అన్నీ సురక్షితంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. హ్యాక్ అయ్యాయంటూ వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని చెప్పారు.

జార్ఖండ్ స్కూల్ నుంచి లీక్..

 జార్ఖండ్ హజారీబాగ్ లోని ప్రైవేట్ స్కూల్ నుంచి నీట్ క్వశ్చన్ పేపర్ ముఖియా గ్యాంగ్ చేతికి చేరిందని బిహార్ పోలీసులు తెలిపారు. ‘‘పాట్నాలో స్టూడెంట్లను ఉంచిన సేఫ్ హౌస్ లో సగం కాలిన క్వశ్చన్ పేపర్లను స్వాధీనం చేసుకున్నాం. వాటిని నీట్ క్వశ్చన్ పేపర్ తో సరిపోల్చి చూశాం. ఈ రెండింటి ద్వారా పేపర్ లీక్ అయినట్టు నిర్ధారించాం” అని చెప్పారు. క్వశ్చన్ పేపర్ల రవాణాలో నిబంధనలను ఉల్లంఘించినట్టు గుర్తించామని.. దీనికి సంబంధించి బ్యాంక్ అధికారులు, కొరియర్ కంపెనీ ఉద్యోగులను విచారిస్తున్నామని పేర్కొన్నారు.   

సీబీఐ టీమ్ పై బిహార్​లో దాడి.. 

యూజీసీ నెట్ పేపర్ లీకేజీ కేసును కూడా సీబీఐ దర్యాప్తు చేస్తున్నది. ఇందులో భాగంగా సీబీఐ అధికారులు బిహార్ లోని ఓ గ్రామానికి వెళ్లగా, వాళ్లపై గ్రామస్తులు దాడికి పాల్పడ్డారు. నలుగురు అధికారులు, ఒక మహిళా కానిస్టేబుల్ తో కూడిన సీబీఐ టీమ్.. సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా నిందితుడిని పట్టుకునేందుకు నవాడా మున్సిపాలిటీలోని కాసియాది అనే గ్రామానికి వెళ్లింది. అయితే వాళ్లను నకిలీ అధికారులంటూ గ్రామస్తులు దాడికి పాల్పడ్డారు. వెహికల్స్ ను ధ్వంసం చేశారు. ఇదంతా సెల్ ఫోన్ లో రికార్డు చేశారు. సీబీఐ అధికారులు వెంటనే లోకల్ పోలీసులకు ఫోన్ చేయడంతో వాళ్లు వచ్చి రక్షించారు. దాదాపు 200 మంది దాడికి పాల్పడ్డారని, వాళ్లందరిపై కేసులు నమోదు చేశామని పోలీస్ ఆఫీసర్ అంబరీశ్ రాహుల్ తెలిపారు. నిందితుల్లో నలుగురిని అరెస్టు చేశామని చెప్పారు. కాగా, లోకల్ పోలీసుల ఆధ్వర్యంలో సీబీఐ టీమ్ తమ దర్యాప్తు పూర్తి చేసింది. లొకేషన్ ఆధారంగా రెండు సెల్ ఫోన్లను సీజ్ చేసింది. 

మరో ఐదుగురు అరెస్టు..

నీట్ పేపర్ లీకేజీ కేసులో మరో ఐదుగురిని బిహార్ పోలీసులు అరెస్టు చేశారు. వాళ్లను నలందా జిల్లాకు చెందిన బల్​దేవ్ కుమార్, ముఖేశ్ కుమార్, పంకూ కుమార్, రాజీవ్ కుమార్, పరమ్​జిత్ సింగ్​గా గుర్తించారు. వీరిలో బల్​దేవ్ కుమార్ పేపర్ లీకేజీలో కీలక నిందితుడైన సంజీవ్ కుమార్ అలియాస్​ లుతన్ ముఖియా గ్యాంగ్ సభ్యుడని పోలీసులు తెలిపారు. ‘‘నీట్ ఎగ్జామ్​కు ముందు రోజే సాల్వ్​డ్ క్వశ్చన్ పేపర్ పీడీఎఫ్ ఫార్మాట్​లో బల్​దేవ్ కుమార్​కు అందింది. దాన్ని అతడు ప్రింట్ తీసి, పాట్నా రామ్​కృష్ణానగర్​లోని సేఫ్ హౌస్​లో ఉంచి స్టూడెంట్లకు అందజేశాడు” అని చెప్పారు. బల్​దేవ్ కుమార్, అతని అనుచరులకు జార్ఖండ్​లోని దేవ్​ఘర్​లో ఆశ్రయమిచ్చినందుకు రాజీవ్ కుమార్, పంకూ కుమార్, పరమ్​జిత్ సింగ్​ను అరెస్టు చేశామని పేర్కొన్నారు. వాళ్లకు ట్యాక్సీ డ్రైవర్ ముఖేశ్ కుమార్ ట్రాన్స్ పోర్ట్ సౌకర్యం కల్పించాడని, అందుకే అతణ్ని కూడా అదుపులోకి తీసుకున్నామని వివరించారు. కాగా, బిహార్ పోలీసులు ఇంతకుముందు 13 మందిని అరెస్టు చేశారు. దీంతో ఈ కేసులో అరెస్టు అయినోళ్ల సంఖ్య 18కి చేరింది.