నకిలీ జీఎస్టీ రిజిస్ట్రేషన్లపై నజర్​

నకిలీ జీఎస్టీ రిజిస్ట్రేషన్లపై నజర్​
  • 2 నెలల పాటు స్పెషల్​ డ్రైవ్​

న్యూఢిల్లీ:  నకిలీ జీఎస్టీ రిజిస్ట్రేషన్‌‌‌‌లను గుర్తించడానికి సీబీఐసీ రెండు నెలల పాటు ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టనుంది.  నకిలీ ఐటీసీ క్లెయిమ్‌‌‌‌లను తొలగించడంతోపాటు సూత్రధారులను/లబ్దిదారులను గుర్తించేందుకు చర్యలు తీసుకుంటుంది. నకిలీ/అసలైన రిజిస్ట్రేషన్‌‌‌‌లు వస్తువులు లేదా సేవల సరఫరా లేకుండానే ఇన్‌‌‌‌వాయిస్‌‌‌‌లను జారీ చేయడం ద్వారా ఇన్‌‌‌‌పుట్ టాక్స్ క్రెడిట్ (ఐటీసీ)లను మోసపూరితంగా బదిలీ చేస్తున్నారు.  నకిలీ రిజిస్ట్రేషన్లు,  నకిలీ ఐటీసీ పాస్ కోసం బోగస్ ఇన్‌‌‌‌వాయిస్‌‌‌‌ల జారీ సీబీఐసీకి తీవ్రమైన సమస్యగా మారింది.

దీనివల్ల  ప్రభుత్వానికి విపరీతంగా నష్టం వాటిల్లుతుందని సీబీఐసీ  జీఎస్టీ పాలసీ విభాగం తెలిపింది. “అనుమానాస్పద/నకిలీ జీఎస్టీఐఎన్​లను గుర్తించడానికి రంగంలోకి దిగుతున్నాం.  వెరిఫికేషన్ల ద్వారా నకిలీ బిల్లర్‌‌‌‌లను తొలగిస్తాం. ఇందుకోసం ఈ నెల 16 నుంచి 15 జూలై  వరకు దేశవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తాం. జీఎస్టీ ఎకోసిస్టమ్​లో లోపాలను తొలగించడం ద్వారా ప్రభుత్వానికి నష్టం రాకుండా చూస్తాం” అని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్​డైరెక్ట్​ ట్యాక్సెస్​ అండ్​ కస్టమ్స్ (సీబీఐసీ)   తెలిపింది. ప్రస్తుతం 1.39 కోట్ల మంది పన్ను చెల్లింపుదారులు వస్తు సేవల పన్ను (జీఎస్‌‌‌‌టీ) కింద రిజిస్టర్​ అయ్యారు.  

మోసపూరిత జీఎస్టీ గుర్తింపు సంఖ్యల (జీఎస్టీఐఎన్​లు) ను డేటా ఎనలిటిక్స్​, రిస్క్​ పారామీటర్స్​ ద్వారా గుర్తిస్తారు. జీఎస్టీఎన్ కూడా ఇటువంటి మోసపూ రిత జీఎస్టీఐఎన్​లను గుర్తించి వివరాలను సంబంధిత రాష్ట్ర/కేంద్ర పన్ను పరిపాలనకు తెలియజేస్తుంది.  అధికారులు వెరిఫికేషన్​ నిర్వహించి తగిన చర్యలు తీసుకుంటారు. 

వెంటనే వెరిఫికేషన్​..

జీఎస్టీ కింద నకిలీ/బోగస్ రిజిస్ట్రేషన్ పొందేందుకు ఇతర వ్యక్తుల గుర్తింపును దుర్వినియోగం చేయడంపై ఈ ఏడాది ఏప్రిల్​ 24న జరిగిన రాష్ట్ర  కేంద్ర జీఎస్టీ అధికారుల జాతీయ సమన్వయ సమావేశంలో చర్చించారు.  అనుమానాస్పద జీఎస్టీఐఎన్​ల విషయం అధికారుల దృష్టికి రాగానే వెరిఫికేషన్​ చేపడతారు. అది మోసపూరిత రిజిస్ట్రేషన్​ అని తేలితే చర్యలు తీసుకుంటారు.  

నకిలీ జీఎస్టీఐఎన్​ వెనుక ఉన్న వారిపై చర్యలు ఉంటాయి.  బకాయిలను రికవరీ చేస్తారు. అవసరమైతే  ఆస్తి/బ్యాంక్ ఖాతాలను తాత్కాలికంగా అటాచ్‌‌‌‌ చేస్తామని సీబీఐసీ తెలిపింది. ఎన్​ఏ షా అసోసియేట్స్ పార్ట్​నర్​ పరాగ్ మెహతా మాట్లాడుతూ, స్పెషల్​ డ్రైవ్​వల్ల నకిలీ రిజిస్ట్రేషన్లు,  నకిలీ ఐటీసీల బెడద తొలగిపోతుందని,  జీఎస్టీ  ప్రయోజనాలు అర్హులకు మాత్రమే దక్కుతాయని అన్నారు.  అయితే నిజమైన అసెస్సీలకు ఇబ్బంది కలగకుండా చూడాలని అన్నారు.