2026 నుంచి ఏడాదికి రెండు సార్లు CBSE పదో తరగతి పరీక్షలు

2026 నుంచి ఏడాదికి రెండు సార్లు CBSE పదో తరగతి పరీక్షలు

న్యూఢిల్లీ: సీబీఎస్ఈ సిలబస్లో జరిగే పదో తరగతి పరీక్షలపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. 2026 విద్యా సంవత్సరం నుంచి పదో తరగతి పరీక్షలను ఏడాదికి రెండుసార్లు నిర్వహించాలని సీబీఎస్ఈ బోర్డు నిర్ణయించింది. ఈ మేరకు రూపొందించిన డ్రాఫ్ట్లోని అంశాలకు సీబీఎస్ఈ బోర్డు మంగళవారం అధికారికంగా ఆమోదం తెలిపింది. ఈ డ్రాఫ్ట్లోని అంశాలను మార్చి 9 వరకూ పబ్లిక్ డొమైన్లో ప్రజలకు అందుబాటులో ఉంచాలని డిసైడ్ అయింది.

పబ్లిక్ నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్న తర్వాత ఇందుకు సంబంధించిన నియమనిబంధనలకు తుది మెరుగులు దిద్దాలని సీబీఎస్ఈ భావిస్తోంది. తొలి విడతలో భాగంగా 2026, ఫిబ్రవరి 17 నుంచి మార్చి 6 వరకూ పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తామని, రెండో విడతలో మే 5 నుంచి 20 వరకూ రెండో విడతలో టెన్త్ ఎగ్జామ్స్ నిర్వహిస్తామని సీబీఎస్ఈ స్పష్టం చేసింది. 2026లో దేశవ్యాప్తంగా 26 లక్షల 60 వేల మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనుండటం గమనార్హం.

ఈ రెండు సార్లు పదో తరగతి పరీక్షలు నిర్వహించే ఆలోచనపై సీబీఎస్ఈ కొన్ని కీలక విషయాలను వెల్లడించింది. సీబీఎస్ఈ విధానంలో తొలి విడతలో పదో తరగతి పరీక్షలు రాసి 11వ తరగతికి అర్హత సాధించలేకపోయిన విద్యార్థులు రెండో విడతలో రాసి అర్హత పొందే వెసులుబాటును సీబీఎస్ఈ కల్పించింది. మెరిట్ సర్టిఫికెట్ రెండో విడత పరీక్షలు రాశాక విద్యార్థులకు జారీ చేస్తామని తెలిపింది. ఐదు సబ్జెక్టుల్లో క్వాలిఫై అయిన విద్యార్థులను పాస్ అయినట్లు ప్రకటిస్తామని వెల్లడించింది. 1 నుంచి 5 సబ్జెక్టుల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు ‘ఇంఫ్రూవ్మెంట్ కేటగిరీ’ కింద జులై 2026లో పరీక్షలు నిర్వహిస్తామని సీబీఎస్ఈ బోర్డు పేర్కొంది.