హైదరాబాద్, వెలుగు: సింగరేణి స్కూళ్లలో తొలిసారిగా సీబీఎస్ఈ సిలబస్‌ను ప్రవేశపెట్టనున్నట్లు సంస్థ సీఎండీ ఎన్. బలరాం తెలిపారు. తొలిసారిగా రామగుండం 2 ఏరియాలోని సెక్టర్ 3 స్కూల్లో అతి త్వరలోనే సీబీఎస్ఈ సిలబస్‌ను ప్రవేశపెడతామని చెప్పారు. సింగరేణి ఆధ్వర్యంలో నడుస్తున్న 9 స్కూళ్లు, ఇంటర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ, పీజీ కాలేజీ, పాలిటెక్నిక్ కాలేజీల పనితీరుపై శనివారం హైదరాబాద్‌లోని సింగరేణి భవన్లో వీడియో కాన్ఫరెన్స్ద్వారా సమీక్ష చేశారు.
అన్ని స్కూళ్లలో నిరుడు సాధించిన టెన్త్ ఫలితాలపై ఆరా తీశారు. వంద శాతం రిజల్ట్ సాధించిన సెక్టర్ 3, భూపాలపల్లి స్కూళ్ల యాజమాన్యాలను బలరాం అభినందించారు. మిగిలిన స్కూళ్లు కూడా విద్యార్థుల చదువులపై ప్రత్యేక శ్రద్ధ, చొరవ తీసుకోవాల్సిందిగా ప్రిన్సి పాళ్లను ఆదేశించారు. సింగరేణి విద్యా సంస్థలను దేశంలోనే ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థలుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత టీచర్లు, ప్రిన్సిపాళ్లు, కరెస్పాండెంట్లపై ఎక్కువగా ఉందన్నారు. సింగరేణి విద్యా సంస్థల్లో దాదాపు 7500 మంది చదువుకుంటున్నారని, నిరుడు 94% ఫలితాలు సాధించినట్లు జీఎం (ఎడ్యుకేషన్) నికోలస్ వివరించారు.