నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలకం : ఎస్పీ రావుల గిరిధర్

వనపర్తి టౌన్, వెలుగు: నేరాల నియంత్రణతో పాటు నిందితులను గుర్తించడంలో సీసీ కెమెరాల పాత్ర కీలకమని వనపర్తి ఎస్పీ రావుల గిరిధర్  పేర్కొన్నారు. గురువారం పట్టణంలోని శంకర్ గంజ్ లో కాలనీవాసుల సాయంతో ఏర్పాటు చేసిన 16 సీసీ కెమెరాలను ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని పట్టణాలు, గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, షాపు ఓనర్లు సెంట్రల్  లాకింగ్  సిస్టం అమర్చుకోవాలని కోరారు.

కాలనీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల కొత్త వ్యక్తులు వచ్చినా, దొంగతనాలు జరిగినా ఈజీగా గుర్తించవచ్చని తెలిపారు. పట్టణంలోని బంగారు షాపుల ఓనర్లు తమ దుకాణాల్లో సీసీ కెమెరాలు, సెంట్రల్  లాకింగ్  సిస్టం ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. 14వ వార్డు కౌన్సిలర్  బ్రహ్మం చారి, బులియన్  మర్చంట్  అధ్యక్షుడు అనిల్ కుమార్, సెక్రటరీ వేణాచారి, శంకర్ గంజ్ కాలనీవాసుల సహకారంతో రూ.3.50 లక్షలతో 16 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. సీఐ కృష్ణ,  టౌన్ ఎస్సై హరిప్రసాద్  పాల్గొన్నారు.