మోడీకి వ్యతిరేకంగా సీసీజీ లేఖ ఓ కుట్ర

మోడీకి వ్యతిరేకంగా సీసీజీ లేఖ ఓ కుట్ర

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ దేశంలో విద్వేష రాజకీయాలు చేస్తున్నారంటూ కాన్ స్టిట్యూషనల్ కండక్ట్ గ్రూప్ (సీసీజీ) పేరుతో 108 మంది మాజీ బ్యూరోక్రాట్లు రాసిన బహిరంగ లేఖ కుట్రపూరితమైనదని పేర్కొంటూ మరో గ్రూప్ లేఖ రాసింది. మోడీకి మద్దతుగా 'కన్సర్న్ డ్ సిటిజన్స్' పేరుతో రాసిన ఈ లేఖపై 8 మంది మాజీ జడ్జీలు, 97 మంది బ్యూరోక్రాట్లు, 92 మంది మాజీ ఆర్మీ అధికారులు సంతకాలు చేశారు. దేశంలో మోడీకి లభిస్తున్న మద్దతు, ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం నేపథ్యంలో సీజీజీ పూర్తి నిరాశలో మునిగిపోయి ప్రజా తీర్పుకు వ్యతిరేకంగా ఆ లేఖ రాసినట్లుగా ఉందని ఆరోపించింది. వాళ్ల కోపం, వేదన కేవలం ఒక వ్యక్తి మీదే కాదు, వాస్తవానికి వాళ్లే విద్వేష రాజకీయాలకు ఆజ్యం పోస్తున్నారు అని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వాన్ని తప్పుడు ధోరణిలో చిత్రీకరిస్తూ పూర్తిగా పక్షపాతంగా సీసీజీ లేఖ ఉందని చెప్పారు. పశ్చిమ బెంగాల్​లో ఎన్నికల తర్వాత చెలరేగిన హింసపై స్పందించలేదేమని ప్రశ్నించారు. వేరే పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో జరుగుతున్న దాడుల గురించి ఎందుకు మాట్లాడట్లేదని అన్నారు. హిజాబ్, హలాల్ మీద ఉన్న ఆసక్తి ఇతర అంశాల మీద లేదెందుకని అడిగారు. లేఖలో వాళ్లు వాడిన పదజాలం చూస్తే వెస్ట్రన్ మీడియా చాయలు కనిపిస్తున్నాయని, అంతర్జాతీయ లాబీల ప్రోత్సాహంతోనే లేఖ రాసినట్లుగా ఉందని వాళ్లు ఆరోపించారు. విదేశీయుల కుట్రలో ఈ లేఖ ఒక భాగమని కన్సర్న్ డ్  సిటిజన్స్ పేర్కొన్నారు.