భారత పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్, వాల్ట్ డిస్నీ వ్యాపార విలీనానికి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI) ఆమోదం తెలిపింది. విలీనానికి సంబంధించి ఈ ఇరు కంపెనీలు ఆరు నెలల క్రితమే ప్రకటన చేయగా.. తాజాగా సీసీఐ ఆమోదం ముద్ర వేసింది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, వయాకామ్ 18 ప్రైవేట్ లిమిటెడ్, డిజిటల్ 18 మీడియా లిమిటెడ్, స్టార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, స్టార్ టెలివిజన్ ప్రొడక్షన్స్ లిమిటెడ్‌లతో కూడిన ప్రతిపాదిత కలయికను కమిషన్ ఆమోదించింది. స్వచ్ఛంద సవరణలకు లోబడి ఈ ఒప్పందం ఉంటుంది అని సీసీఐ సోషల్ మీడియా వేదికగాప్రకటించింది. అయితే ఆ సవరణలు ఏంటి అనేది మాత్రం సీసీఐ వెల్లడించకపోవడం గమనార్హం.
C-2024/05/1155 Commission approves the proposed combination involving Reliance Industries Limited, Viacom18 Media Private Limited, Digital18 Media Limited, Star India Private Limited and Star Television Productions Limited, subject to the compliance of voluntary modifications. pic.twitter.com/S2JVzw2VgR
— CCI (@CCI_India) August 28, 2024
రూ. 70,350 కోట్ల విలువ
ఈ ఏడాది ఆరంభంలో రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన వయాకామ్, వాల్ట్ డిస్నీ కంపెనీ స్టార్ ఇండియాల మధ్య 8.5 బిలియన్ డాలర్ల(భారత కరెన్సీలో సుమారు సుమారు రూ. 70,350 కోట్ల)కు విలీన ఒప్పందం జరిగింది. ఈ విలీనం పూర్తైతే 120 టెలివిజన్ ఛానెళ్లు, రెండు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లతో కూడిన అంబానీ సంస్థ అతిపెద్ద మీడియా సంస్థగా అవతరించనుంది. విలీన సంస్థలో RIL 16.34 శాతం, వయాకామ్ 18 46.82 శాతం, డిస్నీ 36.84 శాతం వాటా కలిగి ఉండనున్నాయి.
చైర్‌పర్సన్‌గా నీతా అంబానీ
ఈ మీడియా వెంచర్‌కు వాల్ట్ డిస్నీ మాజీ ఎగ్జిక్యూటివ్ ఉదయ్ శంకర్ వైస్ చైర్‌పర్సన్‌గా వ్యవహరించనుండగా.. ముకేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ ఛైర్‌పర్సన్ పాత్రను పోషిస్తారు. కొత్త బోర్డులో 10 మంది సభ్యులు ఉంటారు. RIL ఐదుగురిని, డిస్నీ ముగ్గురు, ఇద్దరు స్వతంత్ర డైరెక్టర్లను నామినేట్ చేస్తుంది. 2024 చివరి త్రైమాసికంలో లేదా 2025 మొదటి త్రైమాసికంలో విలీనం పూర్తవుతుందని భావిస్తున్నారు.