
న్యూఢిల్లీ: రూ. 70 వేల కోట్ల విలువైన మీడియా సామ్రాజ్యాన్ని సృష్టించేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్, వాల్ట్ డిస్నీతో కుదుర్చుకున్న విలీనం ఒప్పందానికి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) బుధవారం ఆమోదం తెలిపింది. ఈ రెండు కంపెనీలు ఆరు నెలల క్రితమే డీల్‌ను ప్రకటించాయి. దీనిని పరిశీలించిన సీసీఐ కొన్ని మార్పులను సూచించగా, కంపెనీలు వాటికి అంగీకరించాయి.
దీంతో గ్రీన్‌సిగ్నల్ వచ్చింది. అయితే ఆ మార్పులేంటో మాత్రం వెల్లడించలేదు. ఈ ఒప్పందం ప్రకారం, ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్‌తోపాటు దాని అనుబంధ సంస్థలకు విలీనం అయ్యాక ఏర్పడే కంపెనీలో 63.16 శాతం వాటా ఉంటుంది. రిలయన్స్‌కు రెండు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్స్, పలు టీవీ చానెల్స్ ఉన్నాయి. వాల్ట్ డిస్నీకి సంయుక్త సంస్థలో మిగిలిన 36.84 శాతం వాటా ఉంటుంది. ఇది మనదేశంలో అతిపెద్ద మీడియా హౌస్ అవుతుంది. జపాన్‌కు చెందిన సోనీ , నెట్‌ఫ్లిక్స్ వంటి ప్రత్యర్థులతో పోరాడేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ జాయింట్ వెంచర్‌లో దాదాపు 11,500 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టడానికి అంగీకరించింది.