భద్రాచలం మన్యంలో రైతులకు దూరంగా సీసీఐ సెంటర్

  •     రవాణా ఖర్చులు తడిసిమోపెడు 
  •     దళారులకు అధికారుల వత్తాసు
  •     ఏఎంపీ స్టాఫ్​ టీఆర్​ దందా

భద్రాచలం,వెలుగు: భద్రాచలం మన్యంలో కాటన్​కొనుగోళ్లలో గోల్​మాల్​ జరుగుతోంది. సీసీఐ, మార్కెట్​ కమిటీ అధికారులు.. పత్తి వ్యాపారులు కలసి ఆదివాసీ రైతులను నిలువునా ముంచేస్తున్నారు. కాటన్​ కార్పొరేషన్​(సీసీఐ) కొనుగోలు కేంద్రాన్ని రైతులకు అనువుగా ఉండే భద్రాచలం వ్యవసాయ మార్కెట్​ కమిటీలో కాకుండా ఎక్కడో దూరంగా ఉన్న జిన్నింగ్​ మిల్లులో ఏర్పాటు చేశారు.

జిన్నింగ్​మిల్లు యాజమాన్యానికి మేలు చేసేందుకే సీసీఐ, మార్కెట్​కమిటీ అధికారులు కొనుగోలు కేంద్రాన్ని దూరంగా ఏర్పాటు చేశారని, అక్కడికి పత్తిని తరలించాలంటే ఖర్చు తడిసిమోపెడవుతుందని భావించిన రైతులు మార్కెట్ యార్డులోనే వ్యాపారులకు తక్కువ ధరకే పత్తిని అమ్ముకున్నారు. అదే పత్తిని దళారులు, వ్యాపారులు సీసీఐ సెంటర్​కు తరలించి మద్దతు ధరకు అమ్ముకున్నారు. 

 ట్రాన్స్​పోర్ట్​ భారం

 భద్రాచలం వ్యవసాయ మార్కెట్​ కమిటీ పరిధిలో భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల మండలాలున్నాయి. భద్రాచలంలోనే సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే అ మండల్లాల్లోని రైతులకు దూరభారం ఉండేదికాదు. దీనివల్ల రైతులకు లాభం కలగడమేకాకుండా అక్కడ పనిచేసే హమాలీలకు కూడా ఉపాధి దొరుకుతుంది. కానీ జిన్నింగ్​ మిల్లు ఉందన్న సాకుతో పినపాక నియోజకవర్గ పరిధిలోని అశ్వాపురం మండలం నెల్లిపాక బంజరలో సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించింది.

దీనివల్ల ఆదివాసీ రైతులు అక్కడి పత్తిని తీసుకెళ్లాలంటే ట్రాన్స్​పోర్ట్​ ఖర్చుల భారం పెరుగుతుంది. చర్ల,దుమ్ముగూడెం సరిహద్దు గ్రామాల రైతులు 70 కిలోమీటర్ల దూరం వరకు పత్తి తీసుకురావాల్సిఉంటుంది . ఖర్చులు భరించి కొందరు ఆదివాసీ రైతులు సరుకు తీసుకొచ్చినా తేమ శాతం పేరుతో కొర్రీలు పెడుతున్నారు. క్వింటాలుకు 10 కిలోల చొప్పున తరుగు తీస్తున్నారు. సెంటర్​లో ఉన్న ఏఎంసీ స్టాఫ్ కూడా అనేక సాకులతో రైతులకు ఇబ్బంది పెడుతున్నారు.

ఇ బాధ భరించలేక వ్యాపారులకే ఎంతకోఒక రేటుకు అమ్ముకుంటున్నారు. భద్రాచలం మార్కెట్​ యార్డులో సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే నెల్లిపాక బంజరలో ఉన్న జిన్నింగ్​ మిల్లుకు పత్తిని సీసీఐ ఖర్చుతో ట్రాన్స్ పోర్టు చేయాల్సిఉంటుంది. ఈ భారాన్ని తప్పించుకునేందుకు మిల్లులో కొనుగోలు కేంద్రం పెట్టారు. వీరికి ఏఎంసీ ఆఫీసర్లు సహకరిస్తున్నారు. ఫలితంగా రైతులకు నష్టం జరుగుతోంది. 
 
దళారులకు టీఆర్ వరం​

భద్రాచలం వ్యవసాయ మార్కెట్​ కమిటీ స్టాఫ్​టెంపరరీ రిజిస్ట్రేషన్​​ (టీఆర్) పేరిట రైతులను మోసగిస్తున్నారు. కౌలు రైతులకోసం ప్రవేశపెట్టిన ఈ విధానం దళారులకు వరంగా మారింది. కౌలు రైతులకు పట్టాదారు పుస్తకాలు ఉండవు కాబట్టి, వారి పంటను అమ్ముకోవడానికి టీఆర్ విధానం తెచ్చారు.టీఆర్​ ఉంటే పట్టాదారు పాస్​బుక్​, బ్యాంకు ఖాతా బుక్​, ఆధార్​ ఏమీ అవసరం లేదు.

కౌలు రైతులు చాలావరకు సరుకు సీసీఐకి తీసుకురావడం లేదు. దీంతో కౌలు రైతుల పేరిట దళారులుటీఆర్​ లు తీసుకుంటున్నారు. రైతులనుంచి తక్కువ ధరకు కొన్న పత్తిని టీఆర్ ద్వారా మద్దతుధరకు సీసీఐకి అమ్ముకుంటున్నారు. ఒక్కో టీఆర్​ ఇచ్చేందుకు వ్యవసాయ మార్కెట్​ కమిటీ స్టాఫ్​ దళారుల నుంచి రూ.వేయి నుంచి రూ.2వేలు తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు భద్రాచలం వ్యవసాయ మార్కెట్ స్టాఫ్​ 315 టీఆర్​లు జారీ చేశారు. 

సీసీఐ లూజు పత్తి కొంటోంది

 సీసీఐ లూజు పత్తిని కొంటోంది. అందుకే మిల్లుల్లోనే కొనుగోలు కేంద్రాలు పెట్టాలన్న ఆర్డర్స్ ఉన్నాయి. టీఆర్​లు వ్యవసాయశాఖ జారీ చేసిన సర్టిఫికేట్ల ప్రకారమే ఇస్తాం. 
- ఎంఏ అలీం, డీఎంఓ, భద్రాద్రికొత్తగూడెం

అక్రమాలు అరికట్టాలి

 పత్తి కొనుగోళ్లలో అక్రమాలు అరికట్టాలి. మార్కెట్​ యార్డుల్లోనే కొనుగోలు కేంద్రాలు ఉండాలి. దీనివల్ల రైతులకు లాభం. సీసీఐ నిర్ణయం వల్ల రైతులు నష్టపోతున్నారు. దళారులు బాగుపడుతున్నారు. 
- యలమంచి వంశీకృష్ణ, రైతు సంఘం నాయకులు