
- ఫోన్, ఈ–కామర్స్ కంపెనీలపై సీసీఐ ఫైర్
- కుమ్మక్కై అక్రమంగా ఉత్పత్తులను లాంచ్ చేసినట్టు స్పష్టీకరణ
- మందలించడంతోపాటు జరిమానా విధించే అవకాశం
న్యూఢిల్లీ: శామ్‌సంగ్, షావోమీ వంటి కొన్ని స్మార్ట్‌ఫోన్ కంపెనీలు తమ భారతీయ వెబ్‌సైట్‌లలో ప్రత్యేకంగా ఉత్పత్తులను లాంచ్ చేయడానికి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌తో కుమ్మక్కయ్యాయని కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) కనుగొంది.
ఈ ప్రొడక్టులు రిటైల్ షాపుల్లో దొరక్కుండా చేశాయని, ఇది యాంటిట్రస్ట్ చట్టాలను ఉల్లంఘించినట్టేనని స్పష్టం చేసింది. ఎంపిక చేసిన సెల్లర్లకు ప్రాధాన్యత ఇవ్వడం, ఉత్పత్తుల ధర బాగా తగ్గించడం వంటి పద్ధతులు ఇతర వ్యాపారాలను దెబ్బతీశాయంటూ కుండబద్దలు కొట్టింది.
సీసీఐ నిర్వహించిన యాంటీట్రస్ట్ పరిశోధన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ స్థానిక పోటీ చట్టాలను ఉల్లంఘించాయని గ్రహించింది. ఎంపిక చేసిన సెల్లర్లకు, కొన్ని లిస్టింగ్స్‌కు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడం, ఉత్పత్తుల ధరలను బాగా తగ్గించడం వంటి పద్ధతులు ఇతర కంపెనీలను దెబ్బతీశాయి.
శామ్‌సంగ్, షావోమీ, మోటరోలా, రియల్మీ, వన్‌ప్లస్ కంపెనీల భారతీయ యూనిట్లు అమెజాన్లోనే ప్రత్యేకంగా ఫోన్లను లాంచ్చేశాయి. శామ్‌సంగ్, షావోమీ, మోటరోలా, వివో, లెనెవో, రియల్మీ కంపెనీలు ఫ్లిప్‌కార్ట్ ఇట్లాంటి అక్రమాలకు పాల్పడ్డాయి.
ఇలాంటి విధానాలు న్యాయమైన పోటీకి వ్యతిరేకంగా మాత్రమే కాకుండా వినియోగదారుల ప్రయోజనాలకు కూడా వ్యతిరేకమని సీసీఐ అదనపు డైరెక్టర్ జనరల్ జీవీ శివ ప్రసాద్ ఆగస్టు 9 నాటి రిపోర్ట్ లో రాశారు.
స్మార్ట్‌ఫోన్ కంపెనీలు అక్రమాలకు పాల్పడుతున్నట్టు గతంలోనూ ఆరోపణలు వచ్చాయి. సీసీఐ విమర్శలపై స్పందించడానికి షావోమీ నిరాకరించింది. ఇతర స్మార్ట్‌ఫోన్ తయారీదారులు, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, సీసీఐ కూడా కామెంట్ చేయలేదు.
చైనా కంపెనీలదే హవా
కౌంటర్ పాయింట్ రీసెర్చ్ డేటా ప్రకారం, దక్షిణ కొరియాకు చెందిన శామ్‌సంగ్, చైనాకు చెందిన షియోమీ భారతదేశంలోని రెండు అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ ప్లేయర్లు. రెండింటికి కలిసి దాదాపు 36శాతం మార్కెట్ వాటా ఉంది.
చైనాకు చెందిన వివోకు 19శాతం వాటా ఉంది. భారతదేశ ఈ–-రిటైల్ మార్కెట్ 2023 నాటికి 57–-60 బిలియన్ డాలర్ల నుంచి 2028 నాటికి 160 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని కన్సల్టెన్సీ సంస్థ బైన్ అంచనా వేసింది.
సీసీఐ ఇన్వెస్టిగేషన్ ఫలితాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లకు కీలకమైన వృద్ధి మార్కెట్‌లో పెద్ద ఎదురుదెబ్బ అని ఎనలిస్టులు చెబుతున్నారు. ఇవి ఆఫ్‌లైన్ వ్యాపారాలను దెబ్బతీసినందుకు చాలాకాలంగా చిన్న రిటైలర్ల ఆగ్రహాన్ని ఎదుర్కొంటున్నాయి.
ఇదిలా ఉంటే, వేర్‌హౌసింగ్, మార్కెటింగ్ వంటి సేవలను రాయితీ ధరలను అందించడానికి రెండు కంపెనీలు తమ విదేశీ పెట్టుబడులను ఉపయోగించాయని కూడా సీసీఐ పేర్కొంది.
రాబోయే వారాల్లో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, రిటైలర్ అసోసియేషన్, స్మార్ట్‌ఫోన్ కంపెనీల నుంచి కమిషన్ వివరణలను తీసుకోనుంది. కంపెనీలు తమ వ్యాపార పద్ధతులను మార్చాలని ఆదేశించడంతోపాటు జరిమానాలు విధించవచ్చని తెలుస్తోంది..