వరంగల్ సిటీ, వెలుగు: కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) రూల్స్ పేరుతో పత్తి రైతులను ఇబ్బందులు పెట్టడడం తగదని తెలంగాణ రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి మండిపడ్డారు. గురువారం కమిషన్ సభ్యులు కేవీఎన్ రెడ్డి, సునీల్, భవానిరెడ్డి, గోపాల్ రెడ్డితో కలిసి వరంగల్ ఏనుమాముల మార్కెట్ యార్డును సందర్శించారు. అనంతరం రైతులకు ప్రభుత్వ గిట్టబాటు ధర అమలవుతుందో లేదో తెలుసుకునేందుకు పలువురు రైతులతో మాట్లాడారు.
వ్యాపారులు రేటు తగ్గిస్తుంటే.. ఆఫీసర్లు పట్టించుకోవడంలేదని, మార్కెట్ పంట చోరీ జరుగుతుందని ఫిర్యాదు చేస్తే పట్టించుకోవట్లేదని చెప్పుకుని వాపోయారు. దీంతో కోదండరెడ్డి మార్కెట్ సెక్రటరీ నిర్మలపై అసహనం వ్యక్తం చేశారు. రైతులు మార్కెట్‍కు తీసుకొచ్చిన సరుకులకు అధికారులే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని, సీసీఐ అధికారులు తమ పనితీరు మార్చుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు రవీందర్‍రెడ్డి కలగజేసుకునే ప్రయత్నం చేయగా ఆయనపైనా అసహనం వ్యక్తం చేశారు. సీసీఐ సంస్థ లాభాల్లో ఉందని రైతులను నష్టాల్లో పడేయడం సరికాదన్నారు. మద్దతు ధరకు రైతు దగ్గర కొనుగోలు చేయాలని సూచించారు. గోనె సంచుల్లోని పత్తిని కూడా కొనుగోలు చేసేలా సీసీఐపై ఒత్తిడి తీసుకువస్తామని కోదండరెడ్డి హామీ ఇచ్చారు.
రైతులు ప్రకృతి వ్యవసాయం చేయండి
జమ్మికుంట : రైతులు ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారించాలని కోదండరెడ్డి సూచించారు. గురువారం ‘ ప్రపంచ నేలల దినోత్సవం’ సందర్భంగా కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రంలో ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి, గ్రామ నవ నిర్మాణ సమితి స్వర్ణోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథి హాజరై మాట్లాడారు.