సీసీఐ నిర్లక్ష్యం.. పత్తి రైతులకు శాపం పట్టించుకోని మార్కెటింగ్​ అధికారులు

సీసీఐ నిర్లక్ష్యం.. పత్తి రైతులకు శాపం పట్టించుకోని మార్కెటింగ్​ అధికారులు
  • సర్వర్ పునరుద్దరణపై లేని క్లారిటీ
  • దళారుల బారిన పడుతున్న పత్తి రైతులు

తాండూరు/ చెన్నూరు/ లక్ష్సెట్టిపేట, వెలుగు:సీసీఐ అధికారుల నిర్లక్ష్యంతో రైతులు తాము పండించిన పత్తిని అమ్ముకోవడానికి పాట్లు పడుతున్నారు. పది రోజులుగా పత్తి కొనుగోలులో కీలకమైన సర్వర్లు మొరాయించడంతో సీసీఐ కేంద్రాల్లో అమ్మకాలు నిలిచిపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉన్నా.. సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సర్వర్ల పునరుద్దరణపై అధికారులు ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడంతో రైతులు రోజుల తరబడి జిన్నింగ్​ మిల్లుల ముందు పడిగాపులు పడుతున్నారు.

సీసీఐ అధికారుల నిర్లక్ష్యం..

ప్రభుత్వం ఈ ఏడాది ప్రైవేట్​ జిన్నింగ్​ మిల్లుల్లోనే సీసీఐ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. మంచిర్యాల జిల్లాలోని తాండూరు, చెన్నూరు, లక్ష్సెట్టిపేట మార్కెట్​ యార్డుల పరిధిలోని జిన్నింగ్​ మిల్లుల్లో కొనుగోలు కేంద్రాలను తెరిచింది. సీసీఐ కేంద్రాల్లో 8 శాతం తేమ ఉంటే క్వింటాలుకు రూ.7,420 ధర నిర్ణయించింది. దీంతో రైతులు సీసీఐ కేంద్రాల్లో పత్తి అమ్ముతున్నారు. మొదటి నుంచి  ఏదో సాకుతో సీసీఐ అధికారులు పత్తిని కొనడానికి ఇబ్బంది పెడుతున్నారు. పత్తి నిల్వలు పేరుకు పోయాయనే సాకుతో కొన్ని రోజులు నిరవధికంగా కొనుగోళ్లు బంద్​ చేశారు.

సాంకేతిక లోపంతో నిలిచిన కొనుగోళ్లు..

10 రోజులుగా పత్తి కొనుగోలుకు సాంకేతిక కారణాలను సాకుగాచూపి సీసీఐ కేంద్రాలను బంద్​ చేశారు. పత్తిని అమ్ముకునే రైతులకు ఆధార్​నంబర్​ నమోదు చేస్తే ఓటీపీ రావడం లేదని  చెబుతూ, పత్తి కొనుగోలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో రైతులు జిన్నింగ్​ మిల్లులకు పత్తి తీసుకువచ్చి రోజుల తరబడి వేచి ఉంటున్నారు. దీంతో పత్తిని తెచ్చిన వాహనాలకు రవాణా చార్జీలతో పాటు రోజుకు రూ.500 నుంచి రూ.1000 వరకు వెయిటింగ్​ చార్జీల కింద చెల్లించి నష్టపోయారు.

పత్తి కొనుగోలు చేయాలని సీసీఐ కేంద్రాల ముందు రైతులు రాస్తారోకో, ధర్నాలు చేసినా, సీసీఐ, మార్కటింగ్​ అధికారులు, జిల్లా యంత్రాంగం పట్టించుకోవడం లేదు. పైగా దేశవ్యాప్తంగా సర్వర్​ ప్రాబ్లమ్​ ఉందని రైతులపైనే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా సీసీఐ అధికారులు ఆడుతున్న డ్రామా కావచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సీసీఐ కేంద్రాలకు రెండు రోజులుగా పత్తి బండ్లు రావడం తగ్గింది. సాంకేతిక సమస్య ఎప్పుడు పరిష్కరిస్తారనే విషయంలో అధికారుల నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో కొందరు రైతులు ప్రైవేట్​ జిన్నింగ్​ మిల్లుల్లో లేదంటే దళారులకు తక్కువ ధరకు పత్తి 
అమ్ముకుంటున్నారు. 

సమస్యను తీర్చాలి

పత్తి అమ్ముకోవడానికి సీసీఐ కేంద్రానికి వస్తే తిప్పలు తప్పడం లేదు. సాంకేతిక సమస్య ఉందని చెప్పి సీసీఐ ఆఫీసర్లు మోసం చేస్తున్నారు. దళారులకు పత్తి అమ్ముకున్నాను. సాంకేతిక సమస్యను తీర్చి పత్తి కొనాలి. 

- రాజలింగు, చిన్నబూద, బెల్లంపల్లి మండలం

14 రోజులుగా ఎదురుచూస్తున్నా..

నేను 15 ఎకరాల్లో పత్తి సాగు చేశాను. చెన్నూరు సీసీఐ సెంటర్​లో పత్తి అమ్ముదామని రెండు ట్రాక్టర్లలో తీసుకువచ్చాను. ట్రాక్టర్ కు రూ.4 వేల చొప్పున రూ.8 వేల కిరాయికి తీసుకొని వచ్చిన. ఇయ్యాల్టికి 14 రోజులు అవుతున్నా పత్తి కొంటలేరు. ఓపిక నశించి 35 కింటాళ్ల పత్తిని ఇయ్యాల ప్రైవేట్  వాళ్లకు రూ.6,500 క్వింటాల్​ చొప్పున అమ్మిన. క్వింటాకు రూ.వెయ్యి, వెహికల్​ వెయిటింగ్​ కింద రోజుకు రూ.వెయ్యి చొప్పున లాస్  వచ్చింది. - భూతం తిరుపతి, జనగామ, కోటపల్లి మండలం

సాఫ్ట్​వేర్​ ఓపెన్​ కావడం లేదు..

సీసీఐ కేంద్రాల్లో 10  రోజులుగా సాంకేతిక లోపంతో సాఫ్ట్​వేర్​ ఓపెన్​ కావడం లేదు. దేశవ్యాప్తంగా ఇదే సమస్య ఉందని సీసీఐ అధికారులు చెబుతున్నారు. సర్వర్​ లోపం ఎప్పుడు సరి చేస్తారో తెలియడం లేదు. కొనుగోలు కేంద్రాలకు పత్తిని తీసుకురావద్దని చెప్పినా వస్తున్నారు. ఈ విషయాన్ని జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాం.    

- ఎస్  భాస్కర్, మార్కెట్​ సెక్రటరీ, బెల్లంపల్లి