ధరణి అప్లికేషన్లు పెండింగ్​ పెడితే సస్పెన్షనే

ధరణి అప్లికేషన్లు పెండింగ్​ పెడితే సస్పెన్షనే
  •    తహసీల్దార్లకు సీసీఎల్​ఏ నవీన్ ​మిట్టల్​ హెచ్చరిక
  •     ప్రజలను సతాయిస్తే ఊరుకోబోమని వార్నింగ్​
  •     సీరియస్​గా తీసుకోవాలని కలెక్టర్లకు సూచన
  •     అప్లికేషన్ల స్టేటస్​కు సంబంధించి డ్యాష్​ బోర్డు ఏర్పాటు
  •     రాష్ట్రవ్యాప్తంగా 1.87 లక్షల అప్లికేషన్లు పెండింగ్​

హైదరాబాద్, వెలుగు: ధరణి అప్లికేషన్లను వెంట వెంటనే పరిష్కరించాలని, రైతులను సతాయించే విధంగా తహసీల్దార్లు వ్యవహరిస్తే వేటు తప్పదని సీసీఎల్ఏ, రెవెన్యూ ప్రిన్సిపల్​సెక్రటరీ నవీన్​మిట్టల్​హెచ్చరించారు. ఇంకెంత కాలం రైతులను తిప్పుకుంటారని, తీరు మార్చుకోకపోతే సస్పెన్షన్​ను ఎదుర్కోవాల్సి ఉంటుందని వార్నింగ్​ ఇచ్చారు. నెలల తరబడి ధరణి అప్లికేషన్లను పరిష్కరించాలని నిత్యం రివ్యూలు చేస్తూ ఆదేశాలు ఇస్తున్నా.. కొందరు తహసీల్దార్లు అసలు పట్టించుకోలేదని ప్రభుత్వం దృష్టికి వచ్చినట్టు చెప్పారు. 

శనివారం సెక్రటేరియెట్​నుంచి ధరణిపై జిల్లా కలెక్టర్లతో నవీన్​ మిట్టల్​ రివ్యూ చేశారు. ధరణి పెండింగ్​అప్లికేషన్లపై ఇప్పటికే రెండుసార్లు స్పెషల్​ డ్రైవ్​ నిర్వహించామని, ముఖ్యమైన అంశంగా పరిగణనలోకి తీసుకుని దరఖాస్తులు పరిష్కరించాలని చెప్పామని అన్నారు. అయినా కొన్ని జిల్లాల్లో అసలు ఫైల్స్​ ముందుకు కదలడం లేదని సీరియస్​ అయ్యారు. పనిచేయని వారిని పక్కకు పెట్టాలని, నిర్లక్ష్యంగా ఉండే వారిని సస్పెండ్​ చేయాలని సీఎం రేవంత్​రెడ్డి నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని తెలిపారు. 

నిర్లక్ష్యం వహించే తహసీల్దార్లు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. జిల్లా కలెక్టర్లు కూడా కొందరు ధరణి విషయంలో అంటీముట్టనట్టు వ్యవహరించడం సరికాదని చెప్పారు. తహసీల్దార్లు, ఆర్డీవోలు, అడిషనల్​ కలెక్టర్లు, కలెక్టర్లు ఎవరికి వాళ్లకు.. ఎక్కడికక్కడ లాగిన్​లు క్రియేట్​ చేసినందున సమస్యలను కూడా అదేస్థాయిలో పరిష్కరించాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 1.87 లక్షల అప్లికేషన్లు ధరణిలో పెండింగ్​లో ఉన్నాయని, అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 36,463 ఉన్నాయని వివరించారు. ఇక సీఎం ప్రజావాణిలో 13,513 అప్లికేషన్లు వచ్చాయని, వాటిని కూడా త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు.

2 వారాల్లో 24,778 అప్లికేషన్లే పరిష్కరిస్తరా?

ఈ నెల 14న సీసీఎల్ఏ నవీన్​​ మిట్టల్​ అన్ని జిల్లాల కలెక్టర్లతో ఉదయం నుంచి సాయంత్రం వరకు వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించారు. అప్పుడే దరఖాస్తుల పరిష్కారంపై జిల్లా కలెక్టర్లు, ఆర్డీవోలు, తహసీల్దార్లకు  స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అయితే, రెండు వారాల టైంలో కేవలం 24,778 అప్లికేషన్లు మాత్రమే క్లియర్​ చేయడంపై నవీన్​ మిట్టల్​ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు తెలిసింది. 

ధరణి పోర్టల్​లో ప్రాబ్లం ఉందంటే అన్నింటినీ సరిచేసుకుంటూ వచ్చామని, ఇప్పుడు ఏ సమస్య లేకున్నా కూడా తహసీల్దార్లు పనిచేయకపోవడమేంటని ప్రశ్నించారు. ప్రధానంగా 10 వేల పైన అప్లికేషన్స్​ పెండింగ్​లో ఉన్న వాటిలో యదాద్రి భువనగిరి,  మేడ్చల్​ మల్కాజ్​గిరి, రంగారెడ్డి, సిద్దిపేట, సంగారెడ్డి, వికారాబాద్​, నల్గొండ, కరీంనగర్​ జిల్లాలు ఉన్నాయని, ఆయా జిల్లాల్లో కోర్టు కేసు సమస్యలు ఉన్నవి తప్ప మిగతావన్నీ వేగంగా పరిష్కరించాలని సూచించారు. అప్లికేషన్ల స్టేటస్ కు సంబంధించి జిల్లా, రాష్ట్రస్థాయిలో డ్యాష్​ బోర్డు ఏర్పాటు చేస్తున్నామని, ఎక్కడ స్లో ఉన్నా అక్కడ చర్యలు తప్పవని హెచ్చరించారు. 

ఆలేరు తహసీల్దార్​పై సీఎంవోకు కంప్లయింట్

రాష్ట్రంలోని కొందరు తహసీల్దార్లపై వివిధ స్థాయిల్లో కంప్లయింట్స్​ వచ్చినట్టు తెలిసింది. వీటిపై కూడా సీసీఎల్ఏ నవీన్​ మిట్టల్​ సీరియస్​అయ్యారు. ముఖ్యంగా యదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు తహసీల్దార్​పై పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందాయి. సీఎంకు కూడా ఆ తహసీల్దార్​పై కంప్లయింట్స్​అందినట్టు తెలిసింది. ధరణి అప్లికేషన్లకు సంబంధించి ఒక్క అప్లికేషన్​ను కూడా పరిష్కరించడం లేదని, రైతులెవరైనా కార్యాలయానికి వస్తే వారితో దురుసుగా ప్రవర్తిస్తున్నట్టు ముఖ్యమంత్రికి ఫిర్యాదు అందింది.

నెలల తరబడి తిరుగుతున్నామని, తమ ధరణి అప్లికేషన్​పై రిపోర్ట్​ పంపాలని కోరితే, వారి ముందే అప్లికేషన్లను చించేస్తూ ఆన్​లైన్​లో రిజెక్ట్​ చేస్తున్నారని పలువురు బాధితులు ప్రభుత్వానికి కంప్లయింట్​ చేశారు. ఈ విషయమై నవీన్​ మిట్టల్​ తీవ్ర అగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. త్వరలోనే ఆయనపై చర్యలు తీసుకోనున్నట్టు సమాచారం.