ఇస్కాన్‌‌ను నిషేధించలేమని స్పష్టం చేసిన ఢాకా హైకోర్టు

ఇస్కాన్‌‌ను నిషేధించలేమని స్పష్టం చేసిన ఢాకా హైకోర్టు

ఢాకా: బంగ్లాదేశ్‌‌లో హిందూ సంస్థ ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్‌‌నెస్ (ఇస్కాన్) కార్యకలాపాలను నిషేధించలేమని ఢాకా హైకోర్టు స్పష్టం చేసింది. దేశంలో ఇస్కాన్ ఇటీవలి యాక్టివిటీస్ పై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందో నివేదిక సమర్పించాలని అటార్నీ జనరల్‌‌ను ఆదేశించింది. దేశద్రోహం కేసులో ఇస్కాన్ సంస్థకు చెందిన చిన్మయ్ కృష్ణ దాస్ ను ఇటీవల బంగ్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్టుతో మంగళవారం నుంచి చెలరేగిన అల్లర్లలో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయిన అడ్వకేట్ సైఫుల్ ఇస్లాం మరణించాడు. 

ఇస్లాం అలీఫ్ హత్య, ఇస్కాన్ కు సంబంధించి 3 వేర్వేరు కేసులు నమోదు అయ్యాయి. వాటిని జస్టిస్ ఫరా మహబూబ్, జస్టిస్ దేబాశిశ్ రాయ్ చౌదరిలతో కూడిన బెంచ్ గురువారం విచారించింది. ప్రభుత్వం తరఫున అదనపు అటార్నీ జనరల్ అనీక్ ఆర్ హక్, డిప్యూటీ అటార్నీ జనరల్ అసద్ ఉద్దీన్ వాదిస్తూ.. ఈ కేసుల్లో ఇప్పటిదాకా 33 మందిని అరెస్టు చేసినట్లు కోర్టుకు తెలిపారు.చిన్మయ్ కృష్ణ దాస్‌‌ అరెస్టు తర్వాత హిందువులు నిరసనలు చేస్తున్నారని చెప్పారు. అందులో న్యాయవాది సైఫుల్ ఇస్లాం హత్యకు గురయ్యాడని ఆరోపించారు. అల్లర్లను ప్రేరేపిస్తున్న ఇస్కాన్‌‌ను నిషేధించాలని కోరారు. దీనిపై స్పందించిన కోర్టు.. ఇస్కాన్‌‌ను నిషేధించలేమని పేర్కొంది. 

దేశంలోని మైనారిటీల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయని.. ఈ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరింది. ఇస్కాన్‌‌ యాక్టివిటీస్ పై ప్రభుత్వం తీసుకున్న చర్యలపై నివేదిక సమర్పించాలని అటార్నీ జనరల్‌‌ను ఆదేశించింది. ప్రజల ఆస్తులను రక్షించడంలో ఇకముందు అయినా ప్రభుత్వం జాగ్రత్తగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు బెంచ్ పేర్కొంది. కాగా.. ఇస్కాన్‌‌ "రాడికల్ ఆర్గనైజేషన్" అని10 మందితో కూడిన సుప్రీంకోర్టు న్యాయవాదుల బృందం ఆరోపించింది. దాన్ని దేశంలో నిషేధించాలని కోరుతూ న్యాయవాదుల తరపున అల్ మామున్ రస్సెల్ బుధవారం బంగ్లాదేశ్ ప్రభుత్వానికి లీగల్ నోటీసు పంపారు. 

ప్రధాని మోదీతో జైశంకర్ భేటీ

ప్రధాని నరేంద్ర మోదీతో విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్‌‌ గురువారం భేటీ అయ్యారు. బంగ్లాదేశ్‌‌లోని ప్రస్తుత పరిస్థితులపై చర్చించారు. బంగ్లాదేశ్‌‌లో హిందువులతో సహా ఇతర మైనారిటీలపై దాడులు, చిన్మయ్ కృష్ణ దాస్ అరెస్ట్, చిట్టగాంగ్ జిల్లాలో ఆలయం ధ్వంసం తదితర అంశాలపై మాట్లాడుకున్నారు. బంగ్లాదేశ్‌‌లోని ప్రస్తుత పరిస్థితులపై శుక్రవారం పార్లమెంటు ఉభయ సభల్లో జైశంకర్ ప్రసంగించే అవకాశం ఉంది.