- విచారణలో పోలీసు సిబ్బంది పాత్రపైనా ఎంక్వైరీ
- ఎవరిపై వేటు పడుతుందనే టెన్షన్
నల్గొండ, వెలుగు: ఉమ్మడి నల్గొండ జిల్లాలో పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాలో ఆరుగురిని సీసీఎస్, టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీకి తరలించడం పట్ల రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుని చర్యలకు ఆదేశించింది. దీంతో కొందరు పోలీసుల అండతోనే సరఫరా చేసినట్టు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అందించింది. మల్టీ జోన్ – 2 ఐజీ సత్యనారాయణ ఉమ్మడి నల్గొండ జిల్లాపై ఫోకస్ పెట్టి బుధవారం పర్యటించి పోలీసులతో సమావేశమయ్యారు.
- జిల్లాలోని సరిహద్దు మండలాల నుంచే..
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని సరిహద్దు మండలాల నుంచే పెద్ద ఎత్తున పీడీఎస్ బియ్యం ఏపీలోని కాకినాడ పోర్ట్ కు తరలుతున్నట్టు ఇందుకు అక్రమార్కులకు కొందరు ఎస్ఐలు సహకరిస్తున్నట్టు.. పీడీఎస్ బియ్యం రవాణా నియంత్రణలో ఫెయిలవుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పోలీస్ ఉన్నతాధికారులు అలర్ట్ అయ్యారు. నిఘా పెట్టగా.. పోలీసుల అండతోనే అక్రమ రవా ణా చేస్తున్నట్టు తేలింది. దీంతో ఇటీవల కొందరు ఎస్ఐలపై వేటు వేశారు.
- దొరికిన వీడియో..పోలీసుల్లో టెన్షన్
ఇటీవల ఒక పీఎస్ పరిధిలో పీడీఎస్ బియ్యం సరఫరా చేసే ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారించగా, పోలీసుల పాత్రపై తెలపడంతో వీడియో తీసిన సదురు ఎస్ఐ పోలీస్ ఉన్నతాధికారులకు పంపినట్టు తెలిసింది. నెలకు ఎవరెవరికెంత ముడుపులు అందుతున్నాయి, పోలీసులు ఎలా సాయం చేస్తున్నారని తెలిపినట్లు సమాచారం.
ఆ వీడియో ఓ ప్రజాప్రతినిధికి చేరడంతో పోలీసుల తీరుపై గుర్రుగా ఉండడమే కాకుండా ఉన్నతాధికారితో మాట్లాడినట్లు తెలిసింది. దీంతో అక్రమార్కులను అదుపులోకి తీసుకోవడంతో వీరికి సహకరించిన పోలీసుల్లో టెన్షన్ మొదలైంది. సూర్యాపేట ఎస్పీ ఆఫీస్ లో మీడియాతో పోలీసుల పాత్రపై ఎంక్వైరీ చేస్తున్నట్లు మల్టీ జోన్ – 2 ఐజీ వెల్లడించడంతో ఎవరిపై వేటు పడుతుందోననే చర్చ జరుగుతోంది.