తెలంగాణలో ఏసీబీ దూకుడు పెంచింది. అవినీతికి పాల్పడే అధికారులను వేటాడుతోంది. హైదరాబాద్ సీసీఎస్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించి సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ సుధాకర్ ఏసీబీకి చిక్కాడు. ఓ కేసు విషయంలో రూ.3 లక్షలు లంచం తీసుకుంటుండగా సుధాకర్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు.
ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... బోయిన్ పల్లికి చెందిన శ్రీ మణి రంగస్వామిపై సీసీఎస్ లో ఓ కేసు నమోదు అయింది. శ్రీ మణిరంగస్వామి కేసును విచారిస్తున్న డిటెక్టివ్ డిపార్ట్మెంట్ ఎకనామిక్ అఫెన్స్ వింగ్ టీం 7 లో పని చేస్తున్న ఇన్‌స్పెక్టర్ చామాకురి సుధాకర్ కేసును అతనికి అనుకూలంగా క్లోజ్ చేసేందుకు రూ.15 లక్షలు లంచం డిమాండ్ చేశాడు. తొలి విడతగా రూ.5 లక్షలు అతని నుండి తీసుకున్నాడు.
2024 జూన్ 13వ తేదీ గురువారం రోజున రెండో విడతగా రూ.3 లక్షలు సీఐకు సీసీఎస్ ఎదురుగా ఉన్న పార్కింగ్ ప్లేస్ లో అతని కారులో పెడుతున్న సమయంలో ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నారు. అయితే ఏసీబీ అధికారులను చూసి , పరారు కావడానికి యత్నించిన సుధాకర్ ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అతని వద్ద నుండి మూడు లక్షలు స్వాధీనం చేసుకున్నారు ఏసీబీ అధికారులు , అతనిపై కేసు నమోదు చేసి , నాంపల్లి ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు.