నస్పూర్,వెలుగు: నేర పరిశోధనలో సీసీ కెమెరాలు కీలకమని రామగుండం పోలీస్ కమిషనర్ ఎస్.చంద్రశేఖర్ రెడ్డి చెప్పారు. సోమవారం సీసీసీ నస్పూర్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్‌రూమ్‌ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. సింగరేణి సంస్థ సహకారంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతీ వాహనదారులు నంబర్ ప్లేట్ ఉండేలా చూసుకోవాలన్నారు. కార్యక్రమంలో మంచిర్యాల ఇన్ చార్జి డీసీపీ అఖిల్ మహాజన్, ఏసీపీ తిరుపతి రెడ్డి, రూరల్‌సీఐ సంజీవ్, ఎస్ఐ శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ ప్రభాకర్, వైస్ చైర్మన్ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ రమేశ్, ఎస్వోటు జీఎం త్యాగరాజు తదితరులు పాల్గొన్నారు.
నార్మల్ డెలివరీలకే ప్రాధాన్యం ఇవ్వండి
నిర్మల్,వెలుగు: నార్మల్డెలివరీలకే ప్రాధాన్యం ఇవ్వాలని, ఆరోగ్య సిబ్బంది మహిళలకు అవగాహన కల్పించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ధనరాజ్ సూచించారు. సోమవారం స్థానికంగా ఆయన మాట్లాడారు. ప్రైవేట్ డాక్టర్లు, హాస్పిటళ్ల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సిజేరియన్లతో కలిగే నష్టాలు వివరించాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎం అండ్ హెచ్ వో రాజేందర్, ప్రొగ్రాం ఆఫీసర్ డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ నిఖిల పాల్గొన్నారు.
కడుపు కోతలు వద్దు..
భైంసా,వెలుగు: గర్భిణిలు నార్మల్ డెలివరీలకే ప్రాధాన్యం ఇవ్వాలని డాక్టర్లు పద్మావతి బోస్లే, దీపా జాదవ్, వనజ సూచించారు. భైంసాలోని కిసాన్ గల్లీ, గణేశ్‌నగర్, ఓవైసీనగర్, డాక్టర్స్ అసోసియేషన్ ఏరియాలో అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డాక్టర్ అనిల్ కుమార్జాదవ్, హెచ్ఈవో కలీమొద్దీన్, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.
అవినీతి రహిత సంస్థగా సింగరేణిని తీర్చిదిద్దుదాం
మందమర్రి/నస్పూర్,వెలుగు: సింగరేణిని అవినీతి రహిత సంస్థగా తీర్చిదిద్దాలని జీఎంలు కోరారు. సోమవారం మందమర్రి, బెల్లంపల్లి, శ్రీరాంపూర్ఏరియా బొగ్గు గనులు, డిపార్ట్మెంట్లపై విజిలెన్స్వారోత్సవాలను జీఎంలు చింతల శ్రీనివాస్, దేవేందర్, ఇన్చార్జి జీఎం త్యాగరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగరేణి పేరిట ఎవరైన అవినీతికి పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. సంస్థలో జరిగే అవినీతిపై సమాచారం అందిస్తే విజిలెన్స్ ఆఫీసర్లు గోప్యంగా ఉంచుతూ కట్టడికి చర్యలు తీసుకుంటారన్నారు. అనంతరం విజిలెన్స్ "సమగ్రత ప్రతిజ్ఞ" చేయించారు. కార్యక్రమంలో ఎస్వోటు జీఎంలు సీహెచ్కృష్ణారావు, గుప్తా, శ్రీరాంపూర్ ఓసీపీ పీవో పురుషోత్తంరెడ్డి, సింగరేణి ఆఫీసర్స్ అసోసియేషన్ బాధ్యులు డాక్టర్రాజారమేశ్, అబ్దుల్ఖదీర్, డీజీఎం ఐఈడీ రాజన్న, డీజీఎం పర్సనల్ గోవిందరాజు, పర్సనల్మేనేజర్లు శ్యాంసుందర్, లక్ష్మణ్‌రావు తదితరులు పాల్గొన్నారు.
దళితులకు మూడెకరాలు ఇయ్యాలి
మంచిర్యాల,వెలుగు: ప్రతీ దళిత కుటుంబానికి మూడెకరాల భూమి ఇయ్యాలని మాలమహానాడు నాయకులు డిమాండ్ చేశారు. జన్నారం మండలం కిష్టాపూర్ గ్రామ దళితులతో కలిసి సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. గ్రామ శివారులోని 270,305,308 సర్వేనంబర్లలో సుమారు 3619 ఎకరాల పరంపోగు, ప్రభుత్వ భూమి ఉందన్నారు. ఇందులోని 130 ఎకరాలను గ్రామానికి చెందిన దళితులు గత 40 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్నారని తెలిపారు. ఫారెస్ట్ ఆఫీసర్లు దళితులపై కేసులు పెట్టి సాగును అడ్డుకుంటున్నారని అన్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ప్రతి దళిత కుటుంబానికి మూడెకరాల భూమి ఇస్తే ఎలాంటి గొడవలు ఉండవన్నారు. అర్హులకు వెంటనే పట్టాలు ఇయ్యాలని వారు డిమాండ్ చేశారు. తెలంగాణ మాలమహానాడు జిల్లా అధ్యక్షుడు పొట్ట మధుకర్, జక్కుల సురేష్, బొట్ల సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.
అర్హతలున్నా పెన్షన్ ఇస్తలేరు
కలెక్టరేట్ ఎదుట వృద్ధ దంపతుల నిరసన
గ్రీవెన్స్‌లో కలెక్టర్‌కు విన్నవించిన బాధితులు
మంచిర్యాల, వెలుగు: అర్హతలున్నా ఆసరా పింఛన్ ఇయ్యడం లేదని పలువురు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన గ్రీవెన్స్‌లో కలెక్టర్‌కు తమ గోడు విన్నవించారు. మందమర్రి మండలం దీపక్‌నగర్‌కు చెందిన కదం లక్ష్మి, నర్సయ్య అనే వృద్ధ దంపతులు కలెక్టరేట్ ఎదుట నేలపై పడుకొని నిరసన తెలిపారు. లక్ష్మి (60)కి చెవుడు రావడంతో 2014లో మంచిర్యాల హాస్పిటల్లో 53 శాతం వినికిడి లోపం ఉన్నట్టు డిజేబులిటీ సర్టిఫికెట్ ఇచ్చారు. దాని గడువు 2020లో ముగియడంతో పింఛన్ నిలిపేశారు. మళ్లీ సదరం సర్టిఫికెట్ కోసం హాస్పిటల్‌కు వెళ్తే డాక్టర్ సరిగా టెస్ట్ చేయకుండానే 27 శాతం లోపం మాత్రమే ఉందని సర్టిఫికెట్ ఇచ్చాడని, దీంతో తనకు పింఛన్ రావడం లేదని లక్ష్మి తెలిపింది. పాత బెల్లంపల్లికి చెందిన తాళ్లపెల్లి తారక్క తనకు వృద్ధాప్య పింఛన్ గుర్తింపు కార్డు వచ్చిందని, కొడుకుకు ట్రాక్టర్ ఉండడంతో పింఛన్ పైసలు ఇయ్యడం లేదని తెలిపింది. హాజీపూర్ మండలం ముల్కల్లకు చెందిన ఆవుల వెంకటస్వామి 2018లో జరిగిన ప్రమాదంలో కుడి కన్ను పూర్తిగా కోల్పోయానని, కూలీ పని చేసుకుంటూ జీవించే తనకు దివ్యాంగుల పెన్షన్ శాంక్షన్ చేయాలని కోరాడు. లక్సెట్టిపేట మండలం వెంకటాపూర్‌కు చెందిన పోతరవేని భూలక్ష్మి తోటగూడ ప్రైమరీ స్కూల్లో మధ్యాహ్న భోజనం వంట కార్మికురాలిగా పనిచేస్తోంది. తన భర్త ఆసరా పెన్షన్ దరఖాస్తు కోసం ఆన్లైన్లో వివరాల నమోదు సమయంలో ప్రభుత్వ ఉద్యోగిగా తన వివరాలు నమోదు చేశారని, దానిని సవరించాలని కోరింది.
జీవో 76 ప్రకారం పట్టాలు ఇయ్యాలె...
నస్పూర్ మండలం అరుణక్కనగర్లోని బుడగజంగాల కాలనీ వాసులు 25 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న స్థలాలను జీవో నంబర్ 76 ప్రకారం రెగ్యులరైజ్ చేయాలని కోరారు. రెగ్యులరైజేషన్ కోసం డబ్బులు కట్టి ఏండ్లు గడుస్తున్నా స్పందన లేదన్నారు. తమకు ఇండ్ల పట్టాలు ఇప్పించి, కరెంట్, రోడ్లు, డ్రైనేజీల వంటి సౌలత్లు కల్పించాలని కోరారు.
దీపావళి ఆత్మీయ సమ్మేళనం
మంచిర్యాల, వెలుగు: చాంబర్ ఆఫ్ కామర్స్ మంచిర్యాల ఆధ్వర్యంలో దీపావళి ఆత్మీయ సమ్మేళనం జిల్లా కేంద్రంలోని హైలైఫ్ హోటల్లో నిర్వహించారు. గౌరవాధ్యక్షుడు గోనె శ్యాంసుందర్‌రావు, అధ్యక్షుడు గుండా సుధాకర్ మాట్లాడుతూ మంచిర్యాల వ్యాపారస్తులు అందరూ ఐక్యంగా ఉండాలన్నారు. కష్టసుఖాల్లో, వ్యాపార పరంగా ఏమైనా ఇబ్బందులు ఉంటే ఛాంబర్ ఆఫ్ కామర్స్ ద్వారా పరిష్కరించుకోవాలని కోరారు. మంచిర్యాల పట్టణ అభివృద్ధిలోనూ భాగస్వాములు కావాలన్నారు. ఈ సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, పుర ప్రముఖులను సన్మానించారు. చాంబర్ ఆఫ్ కామర్స్ నాయకులు ఇరుకుల్ల శ్రీనివాస్, చంద్రశేఖర్‌శెట్టి, జుగల్ కిషోర్ వ్యాస్, రాధాకిషన్, రజనీష్ జైన్, గుండా శ్రీనివాస్, ఉజ్జల శ్రీధర్ పాల్గొన్నారు.
హాస్పిటళ్ల నిర్వహణలో సింగరేణి నిర్లక్ష్యం
రామకృష్ణాపూర్,వెలుగు: సింగరేణి హాస్పిటళ్లలో కార్మికులు, వారి కుటుంబాలకు సరైన వైద్యం అందడంలేదని, దవాఖానల నిర్వహణపై యాజమాన్యం నిర్లక్ష్యం చేస్తోందని సీఐటీయూ స్టేట్ ప్రెసిడెంట్ తుమ్మల రాజిరెడ్డి ఆరోపించారు. సోమవారం రామకృష్ణాపూర్సింగరేణి ఏరియా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న శ్రీరాంపూర్ఏరియా ఆర్కే7 గని కార్మికుడు రమేశ్‌ను పరామర్శించారు. కార్మికులు, రోగులకు అందుతున్న వైద్యం, ఆసుపత్రి నిర్వహణ తీరును పరిశీలించారు. సింగరేణి వ్యాప్తంగా అన్ని హాస్పిటళ్లలో మెరుగైన వైద్యం, సౌలత్లు కల్పించడం కోసం రూ.400 కోట్లు కేటాయించాలన్నారు. పర్మినెంటు, స్పెషలిస్టు డాక్టర్లను నియమించాలన్నారు. రాష్ట్ర సర్కార్మెప్పు కోసం సంస్థ వందల కోట్లు ధారదత్తం చేస్తూ కార్మికులను గాలికొదిలేసిందన్నారు. సీఎండీ అవార్డులు, రివార్డుల కోసమే పనిచేస్తున్నారని మండిపడ్డారు. ఆయన వెంట శ్రీరాంపూర్ఏరియా సెక్రటరీ గోదారి భాగ్యరాజు, ఉపాధ్యక్షుడు గూళ్ల బాలాజీ , బ్రాంచి ఆర్గనైజింగ్ సెక్రటరీ కస్తూరి చంద్రశేఖర్, నాను తదితరులు పాల్గొన్నారు.
వర్గీకరణ కోసం ఉద్యమించాలి
ఆదిలాబాద్‌టౌన్, వెలుగు: ఎస్సీ వర్గీకరణ కోసం ఉద్యమించడం కోసం రెడీ కావాలని ఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్ ఆరెల్లి మల్లేశ్కోరారు. సోమవారం స్థానిక బీసీ భవన్లో నిర్వహించిన జిల్లా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజకీయ పార్టీల మోసాలు ఎండగ ట్టడం కోసం మాదిగలు పోరాడాలన్నారు. సమావేశంలో ఎంఈఎఫ్, వీహెచ్పీఎస్, ఎంఎస్ఎఫ్లీడర్లు కొల్లూరి శంకర్ మాదిగ, కల్లెపెల్లి ప్రేమ్ రాజు మాదిగ, రామంచ లక్ష్మణ్, గొటిముకల సుభాష్, శ్రీకాంత్ పాల్గొన్నారు.
ఆదివాసీ అభ్యర్థులకు ఫ్రీ కోచింగ్ ఇవ్వాలి
ఆదిలాబాద్‌టౌన్, వెలుగు: ఎస్సై, కానిస్టేబుల్ పరీక్షల్లో అర్హత సాధించిన ఆదివాసీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వాలని తుడుందెబ్బ లీడర్లు కోరారు. ఈమేరకు సోమవారం ఎస్సీ ఉదయ్‌కుమార్‌రెడ్డి, కలెక్టర్ సిక్తా పట్నాయక్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. జిల్లాలోని ఐదో షెడ్యూల్ ప్రాంతంలో జీవో నంబర్ 24 ప్రకారం పోలీసు ఉద్యోగ నియామకాలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు గోడం
గణేశ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజీవ్, వెట్టి మనోజ్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా కోటి దీపోత్సవం
భైంసా,వెలుగు: ఆధ్యాత్మిక చింతనతోనే ప్రతీ ఒక్కరికి మానసిక ప్రశాంతత లభిస్తుందని భువనేశ్వరీ పీఠాధిపతి కమలానంద భారతీస్వామి సూచించారు. సోమవారం భైంసాలోని సుభద్రవాటిక సరస్వతీ శిశుమందిర్స్కూల్ లో డాక్టర్ కిరణ్ ఫౌండేషన్, భారత్ దర్శన్ ఆధ్వర్యంలో కోటి దీపోత్సవం నిర్వహించారు. కార్యక్రమానికి ముథోల్ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, సరస్వతీ విద్యాపీఠం సంచలన సమితి సభ్యులు దిగంబర్ మాశెట్టివార్, భారత్ దర్శన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కిరణ్, జిల్లా అధ్యక్షుడు ధర్మపురి సుదర్శన్హాజరయ్యారు. భైంసాతో పాటు చుట్టు పక్కల ప్రాంతాల నుంచి వేలాది మంది మహిళలు తరలివచ్చి దీపాలు వెలిగించారు. కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్, హిందూ ఉత్సవ సమితి సభ్యులు సాదుల కృష్ణదాస్, డాక్టర్రామకృష్ణగౌడ్, డాక్టర్ నగేశ్, అరుణ్ కొమిరె, రమేశ్మాశెట్టివార్, ఎల్ఐసీ శ్రీనివాస్, తూము దత్తు, పెండప్ కాశీనాథ్ పాల్గొన్నారు.
17న ఢిల్లీలో బీఎంఎస్ ధర్నా: యాదగిరి సత్తయ్య
నస్పూర్, వెలుగు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈనెల 17న పార్లమెంట్ భవన్ ఎదుట ధర్నా నిర్వహిస్తున్నట్లు బీఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య తెలిపారు. సోమవారం శ్రీరాంపూర్ ఏరియాలోని సీహెచ్‌పీలో నిర్వహించిన గేట్‌మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. పరిశ్రమల రక్షణ, కార్మికుల హక్కుల సాధన, ఉద్యోగ సామాజిక భద్రత కోసం బీఎంఎస్పోరాటం చేస్తోందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఉపసంహరించుకోవాలన్నారు. అనంతరం పలువురు కార్మికులు బీఎంఎస్‌లో చేరారు. కార్యక్రమంలో లీడర్లు నాతాడి శ్రీధర్ రెడ్డి, కాదాసి భీమయ్య, పొడిసెట్టి వినోద్ కుమార్, కె.రాకేశ్, భాస్కర్, ప్రణయ్, జోగుల ప్రభాకర్, బూస శ్రీనివాస్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
కోర్టు ఉత్తర్వులు అమలుకాలె
ఎటూ తేలని బాలాజీ అనుకొడ శ్మశాన వాటిక, డంప్ యార్డ్ వ్యవహారం
కాగజ్ నగర్,వెలుగు: చింతలమానేపల్లి మండలంలోని బాలాజీ అనుకొడ శ్మశాన వాటిక, డంప్ యార్డ్, సెగ్రిగేషన్ షెడ్ నిర్మాణం వ్యవహారంలో కోర్టు ఉత్తర్వులు అమలు కావడంలేదు. కలెక్టర్ఆదేశాలు పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. శిఖం భూమిలో నిర్మించిన ఈ మూడింటి నిర్మాణాలు ఆపాలని గతంలో స్థానిక రైతులు కలెక్టర్రాహుల్రాజ్కు ఫిర్యాదు చేశారు. ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. స్పందించిన కోర్టు విచారణ చేసి నివేదిక ఇవ్వాలని ఆఫీసర్లను ఆదేశించింది. దీంతో కలెక్టర్ సంబంధిత శాఖ అధికారులు, ఫిర్యాదు చేసిన రైతుల నుంచి వివరాలు సేకరించి కోర్టుకు అందజేశారు. ఇదంతా ముగిసేసరికి శ్మశాన వాటిక, డంప్ యార్డ్, సెగ్రిగేషన్‌షెడ్ నిర్మాణాలు దాదాపు పూర్తయ్యాయి. కాంట్రాక్టర్‌కు రూ. 12 లక్షల బిల్లూ ఇచ్చేశారు. కోర్టు నిర్మాణాలు వేరే చోట చేపట్టాలని ఆదేశించడంతో వాటిని రీ లోకేట్ చేసేందుకు కలెక్టర్చర్యలు ప్రారంభించారు. మూడు నెలల్లో స్థలం చూపాలని రెవెన్యూ ఆఫీసర్లను ఆదేశించారు. అయినా ఇప్పటి వరకు అది అమలుకు నోచుకోలేదు. ప్రభుత్వ భూమి ఎక్కడా దొరకడంలేదని చెబుతున్నట్లు సమాచారం. శిఖం భూమిలో నిర్మాణాలు.. లక్షల నిధుల దుర్వినియోగానికి బాధ్యులు ఎవరని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారమంతా తిరిగి కోర్టు దృష్టికి తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్నారు.
టీచర్ సస్పెన్షన్
ఆసిఫాబాద్,వెలుగు: గవర్నమెంట్ఆఫీసర్లపై నిరాధార ఆరోపణలు చేసిన గవర్నమెంట్టీచర్ మొహమ్మద్అష్రఫ్ను సస్పెండ్ చేసినట్లు డీఈవో అశోక్తెలిపారు. కలెక్టర్ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. సమాచార హక్కు చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ అధికారులను బెదిరిస్తున్నాడని, తప్పుడు సర్టిఫికెట్లు సృష్టించడం, గవర్నమెంట్ల్యాండ్స్కబ్జా చేయడం తదితరాలు చేసినట్లు వివరించారు.