హనుమకొండ, వెలుగు : టెన్త్, ఇంటర్ ఎగ్జామ్ సెంటర్ల వద్ద ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని హనుమకొండ కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. వివిధ శాఖల ఆఫీసర్లతో హనుమకొండ కలెక్టరేట్‌లో శనివారం సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమస్యాత్మక పరీక్షా కేంద్రాలను గుర్తించి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు. సెంటర్ల వద్ద సీసీ కెమెరాల నిఘా తప్పనిసరిగా ఉండాలన్నారు.
ఎగ్జామ్స్ నిర్వహణపై ఈ నెల 26న ఎడ్యుకేషన్, పోలీస్ ఆఫీసర్లతో సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు. డీఐఈవో గోపాల్ మాట్లాడుతూ వార్షిక పరీక్షల నిర్వహణకు ఆఫీసర్లు సహకరించాలని కోరారు. క్వశ్చన్ పేపర్ల తరలింపు టైంలో పోలీస్ భద్రత ఏర్పాటు చేయాలన్నారు. విద్యుత్‌లో అంతరాయం లేకుండా చూడాలని, స్టూడెంట్ల కోసం ఆర్టీసీ బస్సులు నడపాలని కోరారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ మహేందర్, అడిషనల్ డీఎంహెచ్‌వో మదన్‌మోహన్‌రావు, డీఈవో ఎండీ.అబ్దుల్‌హై, జీడబ్ల్యూఎంసీ డిప్యూటీ కమిషనర్ రవీందర్, ఏసీపీ కిరణ్‌కుమార్, ఎస్సై కొమురెల్లి పాల్గొన్నారు.