ఎల్ఆర్ఎస్ అప్లికేషన్లు క్లియర్ చేయండి..మున్సిపల్ కమిషనర్లకు సీడీఎంఏ ఆదేశం

ఎల్ఆర్ఎస్ అప్లికేషన్లు క్లియర్ చేయండి..మున్సిపల్ కమిషనర్లకు సీడీఎంఏ ఆదేశం
  • 14 లక్షలకు 15 శాతమే క్లియర్ కావటంపై ఫైర్
  • షోకాజ్ నోటీసులు ఇస్తామని హెచ్చరిక

హైదరాబాద్, వెలుగు: పెండింగ్ లో ఉన్న ఎల్ఆర్ఎస్ అప్లికేషన్లను త్వరగా క్లియర్ చేయాలని మున్సిపల్ కమిషనర్లను సీడీఎంఏ ( కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ర్టేషన్ ) టీకే శ్రీదేవి ఆదేశించారు.143 మున్సిపాలిటీలకు14లక్షల 80వేల అప్లికేషన్లు రాగా..అందులో  కేవలం 15 శాతం మాత్రమే పూర్తవటం ఏమిటని అధికారులను నిలదీశారు. ఈ మేరకు టీకే శ్రీదేవి ఇటీవల అధికారులతో  టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఇంత తక్కువ పూర్తి కావటంతో సీడీఎంఏ తీవ్రంగా ఫైర్ అయినట్లు మున్సిపల్ కమిషనర్లు చెబుతున్నారు. సమగ్ర సర్వేలో బిజీగా ఉండటంతో పాటు టెక్నికల్ సమస్యలు,  సిబ్బంది కొరత వల్ల ఆలస్యమవుతున్నట్లు సీడీఏంఏకు కమిషనర్లు తెలిపారు. అప్లికేషన్లు క్లియర్ చేయకుండా కారణాలు చెబితే కమిషనర్లకు  షోకాజ్ నోటీసులు ఇస్తామని అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దని సీడీఏంఏ సున్నితంగా హెచ్చరించినట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఈ నెలాఖరు వరకే గడువు 

 ఎల్ఆర్ఎస్ అప్లికేషన్లను క్లియర్ చేసేందుకు ప్రభుత్వం ఈ నెలాఖరు వరకు గడువు విధించింది. ఈ నేపథ్యంలోనే  సీడీఎంఏలోని ఉన్నతాధికారులు మున్సిపల్ కమిషనర్లకు  ఫోన్లు చేస్తూ త్వరగా క్లియర్ చేయాలని ఆదేశిస్తున్నారు. అప్లికేషన్ క్లియర్ డేటా ప్రకారం.. మొత్తం ఎన్ని పెండింగ్ లో ఉన్నాయి, ఎందుకు క్లియర్ కావటం లేదని కమిషనర్లను ప్రశ్నిస్తున్నారు. ఎల్ఆర్ఎస్ అప్లికేషన్లను త్వరగా పూర్తి చేయాలని ఇటీవల మున్పిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ సైతం కమిషనర్లను ఆదేశించారు.

టీజీపీఎస్సీ నుంచి కొంతమంది టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు వచ్చాక వేగంగా క్లియర్ అవుతాయని సీడీఏంఏ అధికారులు చెబుతున్నారు. అన్ని అప్లికేషన్లను ఎల్1, ఎల్ 2, ఎల్ 3 అనే మూడు కేటగిరీలుగా డివైడ్ చేశారు. ఎల్ 1 అప్లికేషన్లను టౌన్ ప్లానింగ్ సూపర్ వైజర్, రెవిన్యూ ఇన్స్ పెక్టర్, ఇరిగేషన్ ఇంజినీర్ పరిశీలిస్తారు.  ఎల్ 2ను ఏసీపీ స్థాయి ఆఫీసర్, డీటీసీపీ  ( డైరెక్టరేట్  ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ ) సీపీవో ( ఛీప్ ప్లానింగ్ ఆఫీసర్ ) అధికారులు పరిశీలిస్తారు. ఎల్ 3ని మున్సిపల్ కమిషనర్, జిల్లా పంచాయతీ అధికారి పరిశీలించి ఫైనల్ అప్రూ చేయాల్సి ఉంటుంది.