న్యూఢిల్లీ: లక్ష్య సాధనలో ఎదురయ్యే సవాళ్లకు ఎప్పుడూ తలొగ్గొద్దని దేశ యువతకు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ సూచించారు. మనం వెళ్లే దారిలో వచ్చే వంపు రోడ్డుకు ముగింపు పాయింట్ కాదన్నారు. ఢిల్లీ కంటోన్మెంట్‌లో జరుగుతున్న 'నేషనల్ క్యాడెట్ కోర్(ఎన్‌సీసీ)' క్యాంపును అనిల్ చౌహాన్ సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా క్యాడెట్‌లు, అధికారుల బృందాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు.
"2047 నాటికి 'వికసిత్ భారత్ (అభివృద్ధి చెందిన భారత్ )'గా మారే లక్ష్యాన్ని చేరుకోవడానికి దేశ యువత సహకారం అవసరం. సమాజానికి సూక్ష్మరూపమే యువకులు. వారే నిజమైన జనాభా, స్టాటిస్టికల్ రియాలిటీ. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్‌గా మారాలని దేశం కోరుకుంటున్నది. ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి యువత సహకరిస్తున్నది. దీనివల్ల అతిపెద్ద లబ్ధిదారులు కూడా యువతే అవుతారు.విజయం కోసం చాలా కష్టపడాలి. జీవితంలో హెచ్చు తగ్గులు మాములే. ప్రయాణంలో వచ్చే వంపు రోడ్డుకు ముగింపు పాయింట్ కాదు" అని అనిల్ చౌహాన్ పేర్కొన్నారు.