- ఆ లిస్ట్ వచ్చాకే ఒప్పందంపై ముందుకెళ్తామన్న నెతన్యాహు
కైరో/జెరూసలెం: ఇజ్రాయెల్, హమాస్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం అమలు మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. హమాస్ విడుదల చేయనున్న బందీల లిస్టు తమకు అందే వరకూ ఒప్పందం అమలుపై ముందుకు వెళ్లబోమని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తేల్చి చెప్పారు. ఒప్పందం ప్రకారం.. విడుదల చేయనున్న బందీల లిస్టును ముందుగానే రిలీజ్ చేయాలని, కానీ హమాస్ అగ్రిమెంట్ రూల్స్ ను ఉల్లంఘిస్తున్నదని ఆయన మండిపడ్డారు.
ఒప్పందం ఆగిపోతే, అందుకు హమాస్ నే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ మేరకు శనివారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. కాగా, అంతకుముందు ఒప్పందానికి ఇజ్రాయెల్ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇది ఆదివారం నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. డీల్లో భాగంగా తాము విడుదల చేయనున్న ఖైదీల లిస్టును ఇజ్రాయెల్ రిలీజ్ చేసింది. అయితే బందీల లిస్టును హమాస్ విడుదల చేయలేదు. ఈ క్రమంలో నెతన్యాహు చేసిన కామెంట్లతో ఒప్పందం అమలుపై సందిగ్ధం నెలకొంది.
మూడు దశల్లో అమలు..
ఇజ్రాయెల్, హమాస్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం ఆదివారం ఉదయం 8:30 గంటల (లోకల్ టైమ్) నుంచి అమల్లోకి వస్తుందని ఖతార్ విదేశాంగ శాఖ మంత్రి మాజిద్ అల్ అన్సారీ తెలిపారు. మొత్తం మూడు దశల్లో ఒప్పందం అమలు కానుంది. ఫస్ట్ ఫేజ్ లో భాగంగా ఆరు వారాల పాటు కాల్పుల విరమణ అమల్లో ఉంటుంది. ఈ ఫేజ్ లో 33 మంది బందీలను హమాస్ విడిచి పెట్టనుంది. దానికి బదులుగా 1,900 మంది పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడిచిపెట్టనుంది.
మొదట మహిళలు, 19 ఏండ్ల లోపు ఉన్న పిల్లలందరినీ విడుదల చేయనుంది. ఒప్పందం ప్రకారం.. ఇజ్రాయెల్ పై దాడి ఘటనలో దోషులుగా తేలినోళ్లందరినీ ఆ దేశం బహిష్కరించనుంది. ఇజ్రాయెల్, వెస్ట్ బ్యాంక్ కు తిరిగి రాకుండా నిషేధం విధించనుంది.
గాజాలోకి నిత్యావసరాల ట్రక్కులు..
ఫస్ట్ ఫేజ్లో భాగంగా గాజాలోని ఇజ్రాయెల్ దళాలు బఫర్ జోన్ లోకి తిరిగి రావాలి. తమ ఇండ్లు వదిలిపెట్టి వెళ్లిన పాలస్తీనియన్లు తిరిగి రావడానికి ఇది దోహదపడుతుంది. యుద్ధం కారణంగా గాజాలో పెద్ద ఎత్తున నష్టం జరిగింది. పాలస్తీనియన్ల ఇండ్లు ఘోరంగా దెబ్బతిన్నాయి. ఎక్కడెక్కడికో వెళ్లి తలదాచుకున్న వాళ్లందరూ ఇప్పుడు తమ ఇండ్లకు వచ్చి ఉండాలంటే కష్టమే. బాధితులకు పెద్ద ఎత్తున సాయం అందించాల్సి ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
700 మంది ఖైదీలతో ఇజ్రాయెల్ లిస్టు..
ఫస్ట్ ఫేజ్ లో భాగంగా విడుదల చేయనున్న 700 మందికి పైగా పాలస్తీనా ఖైదీల లిస్టును ఇజ్రాయెల్ న్యాయ శాఖ రిలీజ్ చేసింది. ఆదివారం సాయంత్రం 4 గంటల (లోకల్ టైమ్) తర్వాతే ఖైదీల విడుదల ఉంటుందని తెలిపింది. ఈ లిస్టులో హమాస్, ఇతర ఇస్లామిక్ మిలిటెంట్ గ్రూప్ మెంబర్ల పేర్లు ఉన్నాయి.
వీరిలో కొందరు జీవిత ఖైదు శిక్ష పడినోళ్లు, వివిధ నేరాల్లో దోషులుగా తేలినోళ్లు ఉన్నారు. అయితే ఈ లిస్టులో పాలస్తీనా ముఖ్య నాయకుడు మార్వాన్ బర్ఘౌటి పేరు లేదని తెలుస్తున్నది.