టీవీలో ప్రకటనలు:పార్టీలకు CEC కీలక ఆదేశాలు

సెక్రటేరియట్ : ఏప్రిల్ 11న సార్వత్రిక ఎన్నికల పోలింగ్ మొదలవుతోంది. అదే రోజు రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. ఇందుకు సంబంధించి ప్రింట్ మీడియాలో వచ్చే ప్రకటనలపై పార్టీలకు కేంద్రం ఎన్నికల కమిషన్ కీలక సూచనలు జారీచేసింది. పోలింగ్ రోజు 11న, దానికి ముందు రోజున ఏప్రిల్ 10న ఆఖరి దశ ప్రచారంలో భాగంగా అభ్యర్థులు కానీ, రాజకీయ పార్టీలు కానీ, ఇతరులు కానీ మీడియా సర్టిఫికేషన్ కమిటీ నుంచి ముందస్తు అనుమతి లేకుండా వార్తా పత్రికల్లో (ప్రింట్ మీడియాలో) ఎటువంటి రాజకీయ ప్రకటనలు జారీ చేయరాదని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ ఆదేశాలు వెంటనే అమల్లోకి వస్తాయి.

రాజ్యాంగంలోని 324 సెక్షన్ కింద సంక్రమించిన అధికారాలను ఆధారంగా చేసుకుని కమిషన్ ఈ ఉత్తర్వులు జారీ చేసింది. తప్పుదోవ పట్టించే, రెచ్చగొట్టే, ద్వేషం రగిల్చే రాజకీయ ప్రకటనలతో మొత్తం ఎన్నికల వాతావరణం కలుషితం కావడమేకాక, బాధితులు తిరిగి సమాధానం ఇచ్చుకోవడానికి తగిన సమయం ఉండని సంఘటనలు గతంలో జరిగినందువల్ల… అటువంటివి మళ్ళీ జరగకూడదని కేంద్ర రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి పంపిన ఒక లేఖలో సీఈసీ స్పష్టం చేసింది.

వార్తాపత్రికల్లో రాజకీయ ప్రకటనల జారీకి సంబంధించి ముందస్తు అనుమతులను వేగవంతం చేయడానికి రాష్ట్ర, జిల్లా స్థాయిలోని మీడియా సర్టిఫికేషన్, మానిటరింగ్ కమిటీలను అప్రమత్తంగా ఉంచాలనీ, అనుమతుల నిర్ణయాల్లో కూడా ఆలస్యం జరగకుండా చూడాలని కోరింది.

ఎన్నికల వేళ ఈ సమాచారాన్ని రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులకు, పోటీలో ఉన్న అభ్యర్థులకు, వ్యక్తులకు, వార్తా పత్రికల సంస్థలకు తెలియచేయాలని అలాగే విస్తృత ప్రచారం కల్పించాలని, ఈ ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని కూడా కేంద్ర సంఘం ఆదేశించింది.