
న్యూఢిల్లీ: రాష్ట్రాలలోని ఎన్నికల అధికారులు క్రమం తప్పకుండా అన్ని పొలిటికల్ పార్టీలతో సమావేశాలు నిర్వహించాలని ఎన్నికల సంఘం (ఈసీ) ఆదేశాలు జారీ చేసింది. విధానాల ప్రకారం సమస్యలను పరిష్కరించాలని సూచించింది. వివిధ రాష్ట్రాల్లోని ఓటర్లు ఒకే ఓటరు కార్డు నంబర్లు కలిగి ఉన్నారని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) చేసిన ఆరోపణల నేపథ్యంలో మంగళవారం సమావేశమైన ఎన్నికల అధికారులు ఈ అంశంపై చర్చించారు. ఈ నెల 31 నాటికి సమస్యల వారీగా తీసుకున్న చర్యలను నివేదిక రూపంలో పంపించాలని కోరారు.
ఈ సందర్భంగా ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ మాట్లాడుతూ.. ఎన్నికల అధికారులు పారదర్శకంగా పని చేయాలని, అన్ని చట్టపరమైన బాధ్యతలను శ్రద్ధగా, ప్రస్తుత చట్టం ప్రకారం నెరవేర్చాలని కోరారు. అధికారులు రాజకీయ పార్టీలకు అందుబాటులో ఉండాలని, వారి సూచించే సమస్యలపై ప్రతిస్పందించాలని ఆయన ఆదేశించారు.