ఇవాళ(ఏప్రిల్ 10)కంచ గచ్చిబౌలి భూములపై సీఈసీ కీలక భేటీ

ఇవాళ(ఏప్రిల్ 10)కంచ గచ్చిబౌలి భూములపై  సీఈసీ కీలక భేటీ
  • కంచ గచ్చిబౌలి భూములపై ఇయ్యాల సీఈసీ కీలక భేటీ
  • సీఎస్, అటవీ శాఖ ఉన్నతాధికారులు, హెచ్​సీయూ విద్యార్థి సంఘాలతో మీటింగ్​
  • సుప్రీం ఆదేశాలతో క్షేత్రస్థాయిలో భూముల పరిశీలన
  • ఆ 400 ఎకరాలు ప్రభుత్వ భూములేనని నివేదిక రెడీ చేసిన రాష్ట్ర సర్కారు!

హైదరాబాద్, వెలుగు: కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ (సీఈసీ) దృష్టి పెట్టింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో సీఈసీ బుధవారం రాత్రి హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చేరుకున్నది. ఈ బృందం గురువారం సీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు అటవీ, పర్యావరణ, రెవెన్యూ, హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీయూ వీసీ, విద్యార్థి సంఘాలు, పౌర  సంఘాల సంస్థలతో తాజ్​ కృష్ణలో సమావేశం కానున్నది. సీఈసీ చైర్మన్ సిద్ధాంత దాస్ నేతృత్వంలోని సభ్యులు చంద్ర ప్రకాశ్ గోయల్, లిమేయతో కూడిన బృందం గురువారం కంచ గచ్చిబౌలి స్థల పరిశీలనతోపాటు అధికారులతో చర్చలు జరుపుతుంది. ఈ నెల 3న సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం,  16 లోపు తన నివేదిక సమర్పించాల్సి ఉంది. ఇదిలా ఉంటే, ఈ భూములు ‘డీమ్డ్ ఫారెస్ట్’ కిందకు రావని, వన్యప్రాణుల సంరక్షణ చట్టంలోని షెడ్యూల్–-1 జాతులు ఇక్కడ లేవని రాష్ట్రం గట్టిగా వాదిస్తున్నది. ఆ 400 ఎకరాలు ప్రభుత్వ భూములేనని రాష్ట్ర సర్కారు నివేదిక రెడీ చేసినట్లు సమాచారం. ఈ విషయంలో అటవీశాఖతోపాటు రెవెన్యూ శాఖ ఆధారాలు సిద్ధం చేసినట్లు తెలిసింది. ఈ వివాదంపై సీఈసీ నివేదిక ఆధారంగా సుప్రీంకోర్టు తీసుకునే నిర్ణయం కీలకంగా మారనుంది. రాష్ట్రం వాదన నిలబడితే, ఈ భూముల్లో అభివృద్ధి కార్యకలాపాలకు  లైన్​క్లియర్​ కానుంది. ఇప్పటికే ఈ వివాదంలో ప్రభుత్వం కోర్టుకు వెళ్లడంతో ఏఐ ఫేక్ ఫొటోలు, వీడియోలు సృష్టించి సోషల్ మీడియాలో పోస్టు చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో సహా పలువురు ఆ పోస్టులను డిలీట్ చేస్తున్నారు. ఈ విషయాన్ని కూడా సీఈసీకి రాష్ట్ర ప్రభుత్వం నివేదించనున్నట్లు తెలిసింది. 

సీఈసీ ఎలా పనిచేస్తుందంటే?  

2002లో తమిళనాడులోని గోదావర్మన్ తిరుముల్పాడ్ కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలతో సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ ఏర్పాటైంది. అటవీ భూములు, వన్యప్రాణుల సంరక్షణ, పర్యావరణ నిబంధనల అమలును గాడిన పెట్టడానికి కోర్టు ఈ బృందాన్ని రంగంలోకి దించింది. పర్యావరణ, అటవీ శాఖ నిపుణులు, సీనియర్ బ్యూరోక్రాట్లతో కూడిన ఈ కమిటీ.. కోర్టు ఆదేశాలను అమలు చేయడమే కాక వివాదాస్పద అంశాలపై స్థల పరిశీలన చేసి నివేదికలు సమర్పిస్తుంది. అటవీ భూముల దుర్వినియోగం, అక్రమ నిర్మాణాలు, వన్యప్రాణుల సంరక్షణలో లోటుపాట్లను గుర్తిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక అధికారులతో చర్చలు జరిపి.. ఆధారాలు సేకరించి, సుప్రీం కోర్టుకు సమగ్ర నివేదిక అందజేస్తుంది. ఈ నివేదికల ఆధారంగా కోర్టు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది.